Asianet News TeluguAsianet News Telugu

గీతాంజలి తెలుగు కథ: స్టోమా

తెలుగు సాహిత్యంలో గీతాంజలికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆమె కథలు సాహిత్య విమర్శకుల మన్ననలు పొందాయి. గీతాంజలి రాసిన స్టోమా అనే కథను ఏషియానెట్ తెలుగు పాఠకుల కోసం అందిస్తున్నాం.

Telugu Literature: Geethanjali Telugu short story Stoma
Author
Hyderabad, First Published Jan 9, 2020, 4:24 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

''ఓసీ వృద్ధ తపశ్వినీ రా రా ఇటుల, పాత చుట్టాలు వచ్చినారూ... ఇక్కడ చుట్టాలు ఎవరూ... సీతారాములు వృద్ధ తపశ్విని...? మహా పతివ్రత అనసూయ. అనసూయ ఎలా ఉందీ... ముడతలు పడిపోయిన దేహంతో... ఎండిపోయి రావి పుల్లల వలే వంకరగా ఉన్న కాళ్లతో బయటకు తేలుతున్న ఎముకలతో... ఉన్నప్పటికీ ఎంత తేజస్సులో వెలిగిపోతున్నదో ఆ పతివ్రతా సాధ్వీ మణి ముఖం.

అప్పుడా ఋషి పుంగవుడు అనసూయ కుటీరం ముందు నిలబడి... 'అమ్మీ... అమ్మీ ఎవరో ఎరుగుదువే ఈ పసికూనని... సీత... మన సీత' అంటాడు ఆరాటంగా పరిచయం చేస్తూ...

అప్పుడు రాముడు సీతతో... 'సీతా చూడు అనసూయమ్మ ఎలా ఉన్నదో మాయమ్మ కౌసల్య వలె ఉన్నది... పోయి ప్రణమిల్లి ఉపచర్యలు చేయి పో' అంటాడు అనసూయ తన వద్దకు వచ్చిన సీతను బొమికల గూడులా ఉన్న తన దేహంలోని చేతుల్ని ముందుకు చాచి హృదయానికి హత్తుకుంటుంది... పంతులు చెబుతూ ఉన్నాడు.

'అమ్మ్మా... సీతమ్మకు పాతివ్రత్యపు కథలన్నీ చెప్పు కుటుంబంలో అత్త మామ - భర్తతో ఎలా మెలగాలి అవీ... సీతకు తెలియక కాదు పెద్ద వయస్సు వారితో చెప్పించాలి. అందుకే నీ దగ్గరికి తెచ్చాం. సీతకి పాతివ్రత్యపు పాఠాలు చెప్పాక అనసూయమ్మ సీతకు చిన్న భరణిలాంటిది చేతిలో పెట్టి 'ఏమ్మా సీతా... ఈ మైపూత పెట్టుకో సంవత్సరం వరకూ స్నానం చేయికపోయినా ఫరవాలేదు. వాసన వేయవు నువ్వు. ఈ చీర ధరించు ఎన్నేళ్ళైనా నలగదు సుమీ' అంటూ పెట్టె తెరిచి... దేవతలు ధరించే చీరా... పసుపు కుంకుమల సారె పెట్టె సీతకు ఇచ్చింది. రాముడు చాలా సంతోషించాడు ఆ చీరను చూసి... 'సీతా ఈ చీర కట్టుకో ఎంత బాగుంది' అన్నాడు. అనసూయ పాఠం విన్న ఆ మరుక్షణంలోనే సీతలో చాలా మార్పు వచ్చింది. ఇంకా... శంకర్‌ పంతులు తుంపర్లు తుంపర్లుగా సీతకు అనసూయ పాతివ్రత్యపు పాఠాల గురించీ రాముడి పారవశ్యం గురించి వైనాలు వైనాలుగా చెబుతూనే ఉన్నాడు. ఇంటిల్లి పాదీ భక్తితో ఊగిపోతూ కళ్ళు మూస్కోని నెత్తి మీద కొంగులు. ధోవతులూ కప్పుకొని నుదిటిపై కాషాయరంగు బొట్టు ఒక్కోరు నిమ్మకాయంత పెట్టేసుకుని ధూప దీప నైవేద్యాల పొగలు పీల్చేస్తూ రెండు అరచేతులతో దండాలు పెడ్తూ మైమరచి పోతున్నారు. పంతులు చెబుతున్న కథ గాల్లో తేలుతూ బెడ్రూంలో కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తున్న తులసి చెవుల్లో పడుతున్నాయి. ఆయన చెబుతున్న కథ ఆమె గుండెల్ని కోస్తున్నది. ఎన్ని యుగాలింకా ఈ పతివ్రతల కథలు చెబుతారు ఆడవాళ్ళకి? అనసూయ, సావిత్రి, ద్రౌపదిల నుంచి సీత, సీత నుంచి తన దాకా... తనలాంటి చాలా మంది సీతల దాకా ఈ పాతివ్రత్యపు చక్రవ్యూహాల్లో బలి కావల్సిందేనా? ఆ రోజు శ్రీరామనవమి ఇల్లంతా కళకళలాడుతున్నది. కోడళ్ళిద్దరూ హడావిడిగా ఉన్నారు. మనవలు మనవరాళ్ళు అంతా అల్లరి చేస్తూ తిరుగుతుంటే కొడుకులిద్దరూ భార్యలు చెప్పినట్లు భక్తిగా వింటున్నారు. తన భర్త కృష్ణారావు కూడా ఆ రోజు ఇంట్లోనే ఉన్నాడు. బెడ్రూంలోంచి తలుపుల కావల ఉన్న విశాలమైన హాల్లో రాముడు - సీతకు వేసిని పూల మండపం... దీపాలు - ధూపాలు మనుషులు అంతా కనిపిస్తూనే ఉన్నారు. భర్త కూడా భక్తిగా కూచుని పంతులు చెప్పే కథ వింటున్నాడు. తనొక్కతే అక్కడ లేదు. అక్కడ కూర్చున్న వాళ్ళందర్ని కని పెంచి ప్రయోజకుల్ని చేసి... పెళ్ళిళ్ళు చేసి పురుళ్ళు పోసి, మనవలను పెంచి, ఇంతా చేస్తే ఈ రోజు తమ వాళ్ళ మధ్య తను బహిష్కత. 'అత్తయ్యా ఈ రోజు పొరపాట్న కూడా గది బయటకు రాకండి మైల అంటూ పంతులు విసుక్కుంటారు' టిఫిన్‌ ప్లేటు అక్కడ టేబుల్‌ మీద పెడ్తూ కోడలు నర్మద అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. మైల పంతులుకా... దేవుడికా... తన కోడళ్ళకా వెరసి మొత్తం ఇంటికా? తనొక బహిష్క్రుత, అంటరానిది... ఇంటికీ, మనిషులకీ తులసి మెల్లగా లేచింది.. బాత్రూం వైపుగా నడిచింది. బాత్రూంలో తన భర్త చాలా ఇష్టంగా పెట్టించుకున్న నిలువుటద్దం ముందు నిలబడింది మెల్లగా నైటీ కింది నించి పైకి తీసింది. కుడివైపు నాభికి ఒక రెండు ఇంచుల పక్కన నిమ్మకాయంత రంధ్రానికి మూత్రపు సంచిలాంటి సంచి వేలాడుతున్నది. దాన్నిండా మలం ఉంది. మెల్లగా దాన్ని విడదీసి కమ్మోడ్‌లో పిండేసింది. నల్ల కవర్‌లో దాన్ని పెట్టి గట్టి ముడివేసి డస్ట్‌బిన్‌లో పడేసి కమ్మోడి ఫ్లష్‌ చేసింది. అద్దం పక్కన ఉన్న సర్జికల్‌ బాక్స్‌ తెరిచి ఆ రంధ్రం చుట్టూ ఏంటి సెప్టిక్‌ సొల్యూషన్‌ దూదితో మెల్లగా రాసింది. ఆ మంటకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అద్దంలో తనను తాను చూస్కుంది. ఉబ్బెత్తు అంచులతో గుండ్రంగా లోపలి ఎర్రని మాంసంలా పేగులు కన్పిస్తూ ఆ రంధ్రం భయపెడ్తున్నది. పెద్ద గులాబీ రంగు రంధ్రంతో తనకు తానే ఒక వింత జీవిలాగా కనిపిస్తోంది. పొట్ట రంధ్రంలోంచి స్టోమా బాగ్‌ వెళ్ళుకొచ్చి మలంతో పచ్చగా వేలాడుతూ... ఏమిటీ కొత్త అవయవం తన దేహంలో? ఈ దేహం తనది కాదు... కానీ ఈ రంధ్రం తన దేహంలో భాగం ఇప్పుడు. ఈ దేహాన్ని సృష్టించింది ఆ భగవంతుడైతే... ఈ రంధ్రాన్ని సృష్టించింది మాత్రం తన భర్త కృష్ణారావే... దీన్నిప్పుడు తన దేహంలో కన్నూ ముక్కూ చెవులు నాభీలాగా ఒక భాగంగా తను అంగీకరించాల్సిందే. తులసి మెల్లగా స్టోమా బాగ్‌ అందుకొంది. దానికంటే ముందు రంధ్రం చుట్టూ ఒక చతురస్రాకారపు బాండ్‌ లాంటిది అమర్చుకుని దానికి స్టోమాబాగ్‌ అంటించుకుంది. మూత్రపు సంచిలాగా ఇది మలపు సంచి. తన దేహం నుంచి వేలాడుతూ... తనొక కదిలే లాట్రిన్‌ లాంటిది.

స్టోమా క్లీన్‌గా పెట్టుకోవాలి. ఇదిగో ఇలా ఈ లోషన్‌తో శుభ్రం చేస్కోవాలి. సిస్టర్‌ చెబుతుంటే 'స్టోమా అంటే ఏంటమ్మా' అని అడిగింది తులసి. 'స్టోమా అంటే రంధ్రం... దీన్ని స్టోమా బాగ్‌ అంటారు' అంది సిస్టర్‌. జాలిగా చూస్తూ... 'అసలు ఈ వయసులో నీకు ఈ ఆపరేషన్‌ అవసరమా... ఎందుకు చేయించుకున్నావు? ఇప్పుడు చూడు ఏమైందో గట్టిగా ఎందుకు చెప్పలేకపోయావు భర్తతో...' అంటోంది సిస్టర్‌. కళ్ళల్లోంచి ఉబికి ధారగా చెవుల కిరువైపులా కన్నీళ్లు కారిపోతూ చెవిదొప్పలో నిండిపోతుంటే, కనురెప్పలు అల్లల్లాడిస్తూ పెదాలు బిగపట్టడం తప్పిస్తే తులసి ఏం సమాధానం చెప్పలేదు. తను చేయించుకుందా? చేయించుకునే పరిస్థితికి నెట్టబడిందా?

పధ్నాలుగేళ్ళకు పెళ్ళైంది తనకు. తొమ్మిదో తరగతిలో చదువాపించి బలవంతంగా కృష్ణారావుతో పెళ్ళి చేసారు. తనకంటే పదేళ్ళు పెద్ద వయస్సు. పెళ్ళైన సంవత్సరానికి పాప పుట్టింది. తర్వాత రెండు మూడేళ్ళకోసారి ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు పుట్టేసారు. కృష్ణారావు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తాడు. తాగుడు, సిగరెట్టు అలవాట్లున్నాయి. ముప్ఫై ఏళ్లు కష్టపడి పిల్లల్ని సాది చదివించి ప్రయోజకుల్ని చేసింది. ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్లు చేసింది. ఇద్దరు కొడులు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పైగా బోల్డెన్ని ఫ్లాట్లు, పొలాలు లంకంత ఇల్లు ఆస్థులకేం తక్కువ లేదు. ఎటొచ్చీ మనస్సాంతే లేదు. వర్శగా పిల్లలు పుట్టటం వాళ్ళ పెంపకంలోనే హడావిడిగా జీవితం ఎప్పుడు ముందుకెళ్ళిపోయిందో తెలీదు. గడిచిన కాలమంతా తనలో అలసటనీ... కృష్ణారావులో అసంతృప్తిని మిగిల్చాయి. అలసి పడుకునే తను అందక రాత్రిళ్ళు అసంతృప్తిలో తాగి పడుకునేవాడు. మెల్లగా అది వ్యసనమయ్యింది. పిల్లల తర్వాత మనవలు మనవరాళ్ళు తయారయ్యారు. వాళ్ళతో ఇంకో సగం జీవితం గడిచిపోయింది.

పిల్లలు పెళ్ళిళ్లు ఎవరిళ్ళకు వాళ్లు వెళ్లిపోయాక దొరికిన కొద్ది ఏకాంతంలో... కలయికలో అసంతృప్తి 'నీ దేహం అంతకు ముందు లాగా లేదు. లూసు అయిపోయావు' అంటూ విసుక్కోవడం ఎక్కువ చేసాడు. వర్శగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టాకా ఆపాడా... మగపిల్లాడి కోసం కంటూనే ఉంది. మధ్యలో ఆడపిల్లని తెల్సుకున్నాకా రెండు అబార్షన్లు, గర్భసంచి లోపలి పొరలు మందమైపోయి నెలసరిలో విపరీతం రక్తస్రావం కావడంతో ఆపరేషన్‌ చేసి ఆ పొరలన్నీ తీసేసారు. మరి శరీరం మారకుండా ఎట్టా ఉంటుంది. ఇంత వయసొచ్చినా అదే మాట ఎటైనా పోతానంటాడు. వెళితే తను ఏమైపోవాలి. భయం... వెంటాడుతుంటే అలా మాట్లాడద్దని బ్రతిమిలాడేది, ఏడ్చేది. 'మరేం చేయమంటావు వదులైపోయావు, నా కోరికెట్టా తీరాలీ' అనేవాడు. కలిసిన తర్వాత ఛీ... ఇంత లూసా అంటూ ఛీదరించుకొంటూ లేచి పోయేవాడు. కన్నీళ్ళతో నిద్రపట్టేది కాదు. పెళ్ళై పిల్లలు. మనవలు మనవరాళ్ళు తిరగాడుతున్న ఇంట్లో ఎనభై ఏళ్ళ అత్తగారున్న ఇంట్లో ఇతను ఇట్లా వేధిస్తాడు. ఎవరికి చెప్పుకోవాలి?

ఒక రోజు చాలా ఉత్సాహంగా వచ్చాడు. 'తులసీ ఒక డాక్టరు దగ్గరికి వెళ్ళాను. ఆయన సర్జను. నీకైన వదులుని ఆయన కుట్లు వేసి టైట్‌ చేస్తానన్నాడు. తర్వాత అంతా బాగుంటుందట రేపే వెళ్దాం' అన్నాడు. 'యాభై ఏళ్ళ వయస్సులో నాకిది అవసరమా... నీకూ వయసైంది సాయంత్రం పూట ఏ గుళ్ళోకో వెళ్ళి కూర్చోవచ్చు కదా?' అన్నది. ముఖం చింపుకున్నాడు కృష్ణారావు. 'నీకేం తెలుసు నాకంటే పెద్దవాళ్ళు ఎంత అనుభవిస్తున్నారో మన పక్కింటి పెంట్‌హౌస్‌లో అంతా నా లాంటి సీనియర్‌ సిజిజన్స్‌ చేరి బూతు వీడియోలు చూస్తూ - బీర్లు విస్కీలు తాగుతూ పోతూ పోతూ మెడికల్‌ షాపులో పటుత్వానికి సుహాగ్రా బిళ్ళలు కొనుక్కెళతారు. తెలుసా? వాళ్ళ భార్యలు ఎంచక్కా సహకరిస్తారు. ఒక్క మౌళి మటుకు డబ్బులిచ్చి సుఖం కొనుక్కునే చోటకు వెళ్లిపోతాడు. నీతో నాకు సావొచ్చింది. రెండు, మూడు కుట్లే వేస్తారు. ఐదుగురు పిల్లల్ని కన్నప్పుడు ఐదారు కుట్లు వేయించుకున్న దానివి మొగుడు సుఖం కోసం మళ్ళీ వేయించుకోలేవా?' అంటూ దబాయిస్తారు. అంతమంది పిల్లల్ని తను కావల్సుకుని కన్నదా? మగపిల్లాడు కావలని, అతనూ - అత్తా కనిపిస్తూనే ఉన్నారు కానీ, తనకు చాతకావట్లేదని ఎంత ఏడ్చినా వింటేనా? ''నాకిష్టమై కన్నానా పిల్లల్ని'' కోపంగా అంది తులసి. 'సర్లే ఇప్పుడీ టాపిక్‌ ఎందుకని రేపు డాక్టరు దగ్గరకు వెళ్దాం' అన్నాడు. 'నేను రాను' అంది తులసి. చెంప పైన కొట్టాడు 'ఎట్టా రావో చూస్తాను' అన్నాడు... 'నీ ఇష్టమైన ముండల కాడికి పోతాన్నావుగా... పో... ఎటైనా పో నేను మాత్రం మళ్ళీ ఆపరేషను టేబుల్‌ ఎక్కను. కుట్లు వేయించుకోను, ఐదు ప్రసవాలకు కుట్లేయించుకునీ ఏయించుకుని కండలు కట్టినాయి అక్కడ. ఇప్పుడు మళ్ళీ వేయించుకోను గాక వేయించుకోను' తులసీ మొండిగా అరిచింది. 'నేను ముండల కాడికి పోతే భయంకరమైన రోగాలొస్తాయే... చావమంటావా... నీకూ అంటుక్కుంటాయే - నోర్మూస్కొని నడువు' అన్నాడు కోపంగా.

అన్నట్లే మరునాడు ఆసుపత్రికి తీస్కెళ్ళాడు. డాక్టరమ్మ ఆశ్చర్యపోయింది. 'ఈ వయస్సులో కుట్లేంటి? ఆమె నెలసరి ఆగిపోయిన దశలో ఉంది. ఆమె యోని లోపలంతా పెళ్ళుసుబారి కలియికకే చిట్లు పోయేంత సున్నితమైపోయింది. పరీక్ష చేసాగా... వద్దు.. ఈమెకు కుట్లు వేస్తే ఈమె ఆరోగ్యం పాడై పోతుంది. అయినా యాభై ఎనిమిదేళ్ళ వయస్సులో సెక్సులో ఆనందం లేదని భార్యకు కుట్లేయించడం ఏమిటి? నేనొప్పుకోను' అంటూ 'నాట్‌ అడ్వైసెబుల్‌ ఫర్‌ వెజైనోప్లాస్టీ సర్జరీ' అని రాసింది.

'డాక్టరమ్మా... చేసెయ్యండి ఆపరేషను. కుట్లు వేసెయ్యండి... బయట తిరుగమని కూడా చెప్పాను. అయినా ఇనకుండా రోజు నా వెంట పడ్తూ, నరకం చూయిస్తున్నాడు. చేసెయ్యండమ్మా' తులసి ఏడ్చింది. 'ఆడపిల్లలు, మనవలు, మనవరాళ్లు ఉన్నారని కూడా లేదు ఈనకి' అంటూ మళ్ళా నోట్లో చీర చెంగు దోపుకుని ఏడ్చింది దుఃఖాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ.. 'లేదమ్మా... నీకే మంచిది కాదు. హార్మోన్లు తగ్గిపోయి నీకు యోని లోపల ఎండి పోయింది. ఈ స్థితిలో ఆపరేషన్‌లు చేసి కుట్లు వెయ్యకూడదు అయినా నేను ఊరెళుతున్నా పది రోజుల తర్వాత వస్తాను'' అని చెప్పి డాక్టరమ్మ వెళ్లిపోయింది.

కానీ ఈ దుర్మార్గపు ముండా కొడుకు ఆగాడా? ఇంకో మగ డాక్టరుతో మాట్లాడి, ఒక డాక్టరమ్మను కలుసుకొని కుట్లు వేయించేసాడు.

ఆపరేషను చేసిన డాక్టరమ్మ చాలా చిన్న పిల్లలా ఉంది. మత్తిచ్చిన డాక్టరు ఏమీ పట్టనట్లు నిర్లిప్తంగా జోగుతున్నాడు. ఇంతలో తన లోపల ఏదో దిగబడ్డట్లు అయ్యింది. మొదటి రెండు రోజులు బాగానే ఉన్న మూడో రోజు నుంచి ఏదో తేడా అనిపించసాగింది. మూత్రానికి పోతుంటే కుట్లేసిన యోని లోపల్నించి దొడ్డికి బయటకు వస్తున్నది. సిస్టర్‌కు చెప్పింది వెంఠనే ఆపరేషను థియేటర్‌ దగ్గర్కి తీస్కెళ్ళారు.

'ఈమెకి ఆపరేషన్‌ సక్సెస్‌ కాలేదు, ఫెయిల్‌ అయ్యింది. లోపల పెగులకీ యోనికీ మధ్య రంధ్రం పడింది. గ్లోబల్‌ హాస్పిటల్‌కి పంపిస్తున్నాం. ఇంకో పెద్దాపరేషను చెయ్యాలి' అంటూ కృష్ణారావు చేతుల్లో యాభై వేలు పెట్టి తరిమేసారు.

తులసి గుండెలు పగిలేలా ఏడ్చింది. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు దేహంలో  ఎన్నో మార్పులు వస్తాయి. దేహం లోపల అవయవాలు కూడా పెరుగుతాయట. బిడ్డ పుట్టాకా అంతే...

మగపిల్లాడి కోసం తన రెండు కాళ్ళ మధ్య ఎంతో దుర్మార్గం జరిగింది. మగపిల్లాణ్ణి కనేవరకూ... ఆడపిల్లని తెలిసాక జరిగిన అబార్షన్లు...

తోడేలు కోరల్లాంటి ఇంతేసి కొచ్చెగా ఉన్న ముళ్ళలాంటి స్టీలు రాడ్లు లోపలికి గుచ్చేసి కొబ్బరి తురిమినట్లు తురిమితే ప్రాణాలు పోయినంత పనైంది. ఇష్టం లేకపోయినా తన భర్త తనతో బలవంతంగా సెక్స్‌ చేస్తున్నప్పుడు కలిగే అవమానం బాధ... దుఃఖం భరించింది ఆ క్షణాల్లో.

ఇప్పుడు... ఇతని సుఖం కోసం తనను మళ్ళీ కోసాడు.. కోయకూడని చోట... ఏమైంది ఈ సారి... అతని కోరికకున్నంత దుర్గంధం తన దేహంలో నిండిపోయింది. ఆపరేషను ఫెయిల్‌ అయ్యింది. ఆ రోజు వరలక్ష్మీ వ్రతం చేస్కోవాలన్న తొందరలో ఆ డాక్టరమ్మ బ్లేడుతో కోసిందంట ఆపరేషను థియటర్లో ఉన్న అసిస్టెంటు చెప్పాడు. 'ఎవరికీ చెప్పొద్దమ్మా నా ఉద్యోగం ఊడుద్ది... అసలు థియేటరే పూర్తి కాలేదు డబ్బుల కోసం ఆశపడి చేశారమ్మ అసలా డాక్టరమ్మ ట్రైనింగ్‌ కూడా పూర్తి కాలేదు...' బాధతో చెప్పాడు అసిస్టెంటు సుధాకర్‌. భర్త కేసు వేస్తామంటే పైసలు తిరిగిచ్చేస్తామని రాజీ కుదుర్చుకున్నారు.

ఇంతకీ గ్లోబల్‌ హాస్పిటల్లో తనకేం జరిగింది? చీలిపోయిన తన యోనికి కుట్లు వేసి... దొడ్డికెళ్ళే రంధ్రాన్ని మూసేసి పెద్ద పేగుల నుంచి నాభికి కుడివైపు పొట్ట పైకి ఒక రంధ్రం చేసి దానికి మూత్రపు సంచీలాంటి మలపు సంచీ వేలాడదీసారు. తను ఇప్పుడు మామూలుగా అందరిలాగా దొడ్డికి పోలేదు. అంతా తన పొట్ట బయటున్న మలపు సంచీలో వచ్చి పడుతూ - నిండుతూ ఉంటుంది. రోజుకోసారో, రెండ్రోజులకోసారో ఆ సంచీని తీసి కమ్మోడ్‌లో పిండాలి. ఆ రంధ్రాన్ని గోరు వెచ్చటి నీటిలో చుట్టూతా మెల్లగా కడగాలి. పొడి బట్టతో తుడవాలి. ఎంత మంట భగభగ మండిపోతుంది. ఎర్రని పేగు మాంసం బయటకు కనపడుతుంటే కళ్ళు తిరుగుతాయి.  కానీ తప్పదు.

ఆ రోజు ఆపరేషను అయిపోయింది. మూత్రపు సంచీ ఒక వైపూ, మలపు సంచీ ఒకవైపు వేలాడుతుంటే ఆపరేషను థియేటరు నుంచి తనను బయటకు తీస్కొస్తుంటే... తనకు ఆపరేషను ససేమిరా ఒద్దన్న డాక్టరమ్మ ఉరుకులు, పరుగులతో ఎదురై తనను చూసి షాక్‌ కొట్టినట్లు ఆగిపోయింది. తను నీరసంగా రెండు చేతులూ ఎత్తి దండం పెట్టింది... దగ్గర్కి రమ్మని చేయి ఊపితే డాక్టరమ్మ దగ్గరకు వచ్చింధి. ఆమె కళ్ళల్లో నీళ్ళు, బలహీనంగా ఉన్న తన మాటలు వినపడలేదేమో తన నోటి దగ్గర తన చెవి ఆనించింది. 'నువ్వు చెప్పినట్లు వినాల్సింది డాక్టరమ్మ ఆ నా బట్టగాడి మాటలు వినాల్సింది కాదు. వాణ్ణి ఏమన్నా చెయ్యి...' ఎక్కెక్కి పడ్తూ ఆయాస పడ్తూ... తనన్న మాటలు వింటూ చేష్టలుడిగిపోయిన డాక్టరమ్మకు దండం పెడ్తూ... నక్కలాగా దొంగ చూపులు చూస్తూ ఉన్న తన భర్త వైపు వేలు చూపిస్తూ తనను రెండు మల, మూత్ర సంచులతో మోస్తున్న స్ట్రెచర్‌ అచ్చం శవాన్ని మోస్తున్న పాడెలాగా ముందుకు వెళ్తుంటే డాక్టరమ్మ తీక్షణంగా చూపుడు వేలితో బెదిరిస్తూ కృష్ణారావును ఏదో తిడుతూ కన్పించింది. కృష్ణారావు బెదురుగొడ్డు లాగా తలవంచుకుని నిలబడ్డాడు.

ఆసుపత్రిలో నర్సు సావిత్రి ఎంతో సేవ చేసింది. 'ఈ వయసులో ఎందుకు ఆంటీ ఇది చేయించుకున్నావు. నీ ఆరోగ్యం ముఖ్యం కదా... మీ ఆయనని ఎటన్నా పొమ్మనాల్సింది. నువ్వే ఎటన్నా వెళ్ళిపోవాల్సింది. ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏమయ్యిందో? నేనైతేనా వాణ్ణి తన్ని మరీ విడాకులిచ్చే దాన్ని. మనవలూ మనవరాళ్ళు కూడా అయిపోయారు కదా. ఇంకా ఈ లొంగుబాటు ఎందుకు అంటీ తప్పు చేసావు' అన్నది. అవును తనెంత తప్పు చేసింది ఈ నరకం అనుభవించడానికి...?

ఇక ఇంటికొచ్చి పడింది. మొదట్లో కూతుళ్ళూ, అల్లుళ్ళూ మనవలూ మనవరాళ్ళూ... కొడుకులు, కోడళ్ళూ బాగా వచ్చేవాళ్ళు చూస్కునే వాళ్ళూ. ఆ ప్రేమా... సందడీల్లో తన బాధ కొద్దిగా తగ్గిందన్పించింది. కానీ రోజులు గడిచేకొద్దీ... నర్సును మాన్పించాక తను మెల్లగా బెడ్రూం బయట తిరగసాగింది. తన గదిలోకి రావడమే మానేసారు... ఖంపుట... డైనింగ్‌ టేబుల్‌ దగ్గర్కి నీళ్ళకోసం వెళ్ళిన తనని చూసిన పెద్ద కొడుకు బుళుక్కుమని వచ్చే వాంతి ఆపుకుంటూ అన్నం వదిలేసి సింకులో కక్కుకున్నాడు. కోడలు నిప్పులు చెరుగుతూ 'ఆ దరిద్రాన్ని మొత్తం కప్పుకోకూడదా అత్తయ్యా అయినా ఏం కావాలని హాల్లోకి వచ్చారు గంట కొట్టినా ఫోన్‌ చేసినా వచ్చేవాళ్ళం కదా... వెళ్ళండి గదిలోకి మాలచ్మితో నీళ్ళు పంపిస్తాను. మీ అబ్బాయిని అన్నం కంచం ముందు నుంచి లేపేసారు కదూ... మేం అన్నం తినాలా.. వద్దా?' అంటూ నిప్పులు కక్కింది. స్టోమా బాగ్‌ నించి చీర కొద్దిగా తొలగింది మలం నిండిన భాగం పసుపు పచ్చగా కన్పిస్తున్నది బయటకు... ఐదేళ్ళు వచ్చేదాకా వాడి ముడ్డి కడిగిన సంగతి మరిచిపోయాడు వాడు. వాడే కాదు పిల్లలంతానూ. అంతా దూరం దూరం జరుగుతున్నారు. తనతో మాట్లాడేటప్పుడు దూరంగా నిలబడి మాట్లాడ్డఁవో... తన స్టోమా బాగ్‌ వైపు చూడకుండా చూపులు తప్పించుకుంటూ జాగ్రత్త పడ్డఁవో చేస్తున్నారు. మనవలు మనవరాళ్లు అంతకు ముందులా దగ్గరికి రావటం లేదు. కోడళ్ళు రానివ్వటం లేదు. తనేదైనా చాక్లెట్లో, పండ్లో ఇవ్వబోతే పిల్లలు తీస్కున్నా, కోడళ్ళు వాళ్ళని చెంపలు పగలగొడ్తూ 'నాన్నమ్మ ఇచ్చినవేవీ తీస్కోవద్దనీ' అంటూ ఇచ్చిన పండ్లు గుంజుకుని డస్ట్‌బిన్‌లో వేసేస్తున్నారు. 'అత్తయ్యా వాళ్ళకేమీ మీ చేతులతో ఇవ్వద్దు. ఇన్‌ఫెక్షన్లు వస్తే డాక్టర్ల దగ్గరకు వెళ్ళలేక చావాలి' అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ఒకసారి చిన్న మనవరాలు వచ్చి వళ్ళో కూర్చుంటే అల్లుడొచ్చి బరా బరా ఈడ్చుకుపోయి దాని చంపలు వాయించేసి 'మీకన్నా బుద్ధుండాలి కదా అత్తయ్యా అసలు మీరు తలుపేస్కోండి' అన్నాడు. దుఃఖం వెల్లువలా పొంగింది. తన చేతులతో ఆ పాప మెళ్ళో వేసిన బంగారు గొలుసు పనికి వచ్చింది. తను పనికి రాకుండా పోయింది. గుడి గదిలోకి, ఇంట్లోకి వంటింట్లోకి రావద్దు. నిషిద్ధ స్థలలావి తనకు. పిల్లల్ని ముట్టద్దు. వంటిల్లు నిషిద్ధం కాకముందోసారి తాను వంటింట్లోకి వెళ్ళింది. ఏఁవైనా కూరగాయలు కోస్తానమ్మాయీ బోరు కొడుతుందీ' అని... 'ఒద్దత్తయ్యా మీరెళ్ళి మీ మీ గదిలో కూర్చోండి' అంది కోడలు నుదురు చిట్లిస్తూ... 'సరె లే అమ్మాయి' అంటూ తను వంటింటి నుంచి బయటకు వస్తూ.. నేలమీద అపుడే తుడిచినట్లుంది పనమ్మాయి తను జారిపడిపోయింది. స్టోమా బాగ్‌ తన దేహం నుంచి విడిపోయి వంటిల్లంతా మలం చిమ్మింది. ఎవరూ పడ్డ తనకేమైందో పట్టించుకోలేదు మా లచ్మి చీపురు కట్ట పడేసి పారిపోయింది అంతా ముక్కులు మూస్కున్నారు. ఇల్లంతా కూడా ముక్కుమూస్కుందనిపించింది. కోడళ్ళు ఆగ్రహంతో ఊగిపోయారు 'ఛీఛీ పాడు పీడ, ఎన్నిసార్లు చెప్పాలి మీకు గది బయటకు రావద్దని' - అని ముక్కులకు మాస్కులు, గ్లౌవుసులూ, కాళ్ళకు చెప్పులూ వేస్కొని తన గదిలోని బాత్రూంలో తనని కూలేసి వెళ్ళిపోయారు. వీళ్ళ దేహాల్లో మలం మోయటం లేదా? అంత బాధలోనూ విరక్తిగానుకుంది తులసి. తను బయట మోస్తున్నది. వీళ్ళు లోపల అంతే. ఇంటికెవరైనా వచ్చినా దూరం నుంచే పలకరిస్తారు. పండగలకు నోములకూ పూజలకీ పిలవడం మానేసారు.

తన ఖర్మకి విరేచనాలు కాని ఆహారం కావాలి కానీ కోడళ్ళకు ఆ ఓపిక ఉందా... విరేచనాలు పడితే ఇంక అంతే స్టోమా బాగు నిండిపోయి బరువుతో కిందికి వేలాడిపోతూ రంధ్రం చుట్టూ భయంకరమైన నొప్పి - స్టోమా బాగుతో పాటు రంధ్రం నుంచి పేగు కూడా బయటకు వచ్చేస్తుందేమో అన్నంత నొప్పి ఎన్ని సార్లు మారుస్తుంది. ఇంక తిండి తగ్గించింది. ఆకల్లేదని చెప్పసాగింది. నిద్రపోయేటప్పుడు నరకమే - స్టోమా బాగు ఉన్న వైపు పడుకున్నా, లేని వైపు పడుకున్న నరకమే బరువు ఒకటి, అయితే, పొట్ట కింద పడి నలిగి మలం మంచంపై చిట్లిందా... అంతా గలీజే... ప్రతీ క్షణమూ భయమే. కృష్ణారావు మీద క్షణక్షణమూ కోపం... అసహ్యం పెరగసాగాయి.

******

ఇక తన భర్త కృష్ణారావు సంగతి సరేసరి... దగ్గరకు రాడు. 'సెంటు కొట్టుకొని చావు వాసనకు దేవుతోంది' అంటాడు ఎపుడన్నా గదిలోకి వస్తే. నీటుగా ఖద్దరు లాల్చీ పైజామా వేస్కొని ఛాతీ వెంట్రుకలు కనిపించేలా బొత్తాములు వదిలేసి... తలకీ, మీసాలకీ రంగేసీ, చేతికి బ్రేస్‌లెట్‌ మెడలో పులిగోరు బంగారు గొలుసూ, వేళ్ళకి రంగురాళ్ళ, ముత్యాల ఉంగరాలు ఒంటినిండా సెంటూ కొట్టుకొని తిరుగుతాడు. అతన్నలా జులాయిలా చూస్తుంటే రక్తం మరిగిపోతున్నది. గదిలో పడుకోడం ఎప్పుడో మానేసాడు. 'ఛీ వాసన' అంటాడు. గదిలోకి రాగానే ముక్కు మూసుకుంటూ గాల్లో అత్తరు స్ప్రే చేస్తాడు.

ఒక రోజు కృష్ణారావు గదిలోకి వచ్చి...

'ఈ రోజు చెకప్‌కు వెళ్ళాలి. ఆ గలీజు బ్యాగు కనపడకుండా నైటీ వేసుకో బాగు చుట్టూ నల్లరంగు కవరు ఎప్పట్లా చుట్టుకో... వాసన రాకుండా అత్తరు అద్దుకో...' మాట్లాడుతూనే ఉన్నాడు.

ఈసారి వేరే డాక్టరమ్మ దగ్గరికి తీస్కెళ్ళాడు. ఆమె టేబుల్‌పైన పడుకోబెట్టి యోనిలో వేళ్ళు పెట్టి పరీక్ష చేసింది ప్రాణం పోయినంత పనై గట్టిగా ఆమె చేతిని పట్కూని తోసేసింది అమ్మాఁ అంటూ... కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే... 'అదేంటమ్మా అలా తోసేస్తావు ఇంత దానికే అంత నొప్పా ఇంక భర్తతో సంసారం ఏం చేస్తావు? మీ ఆయన నా దగ్గరికి తెచ్చిందే అందుకు నువ్వు సంసారానికి పనికొస్తావా లేదా అని తెలుసుకోవడానికి' అంది జాలిగా చూస్తూ.

'పనికి రాను - నన్ను ముట్టుకోవద్దని చెప్పండి డాక్టరమ్మ' అని కన్నీళ్ళతో రెండు చేతులు జోడించింది. కర్టెను అవతలే ఉన్న కృష్ణారావు 'తులసీ డాక్టర్‌ను సతాయించకు' అన్నాడు అంతా వింటూ...

'నొప్పి లేకుండా ఈ లూబ్రికెంటు రాస్తున్నా... అయినా ఎందుకు ఇప్పుడు ఎనిమిది వారాలే అయ్యింది కదా సర్జరీ అయ్యి... మీరు చేసిన పనికీ ఆమె స్థితి ఇంత దారుణం అయ్యింది. ఆమెకిష్టం లేకపోతే సెక్స్‌ చేయకండి' అంది డాక్టర్‌ కోపాన్ని అణుచుకుంటూ.

*******

ఆ రోజు చీకటి పడుతుంటే ఏదో భయం... వణకు. ఆ రాత్రి తనకు నరకం చూపించాడు. స్టోమా బాగు నల్లకవరులో కప్పినా... అది ఉందనే ఎరుక కలిగించే దిగులు భయం. ఒకపక్క స్టోమా బాగు బరువు. ఇంకోపక్క కృష్ణారావు బరువు. కలయికలో భయంకరమైన నొప్పి. ప్రాణాలు పోతాయేమో అన్నంత మంట. 'ఛీఛీ వాసన... అంటూ నా బతుకిలా అయ్యిందేఁవిటి' అంటూ విడిపోయాడు. రక్తస్రావంతో విలవిల్లాడింది. ఏవో క్రీములు తెచ్చిచ్చాడు. ఇన్ఫెక్షను కాకుండా.

రోజూ ఇదే గొడవ... సెక్సుకి ముందు 'సంచీ ఖాళీ చేసి ఏడువు' అంటాడు. ప్రేమగా ఉండనే ఉండడు. తనవల్లే కదా తన భార్యకీ దారుణమైన స్థితి వచ్చిందని ఇంత జాలి, కనికరం లేదు. పశ్చాత్తాప్పం అసలే లేదు. ఒద్దంటే మానడు. వాసన అంటూనే గట్టిపడట్లేదని విసుక్కుంటాడు. 'ఛీ... ఇక నీతో కాదు ఆపరేషను చేయించినా వదులుగానే ఉన్నావని' ఛీదరించుకుంటాడు. ఒక రోజు ఏదో టాబ్లెట్‌ని వేస్కోన్నాడు... నరకం చూపించాడు చాలా సేపు. ఒకవైపు స్టోమా నొప్పి, ఇంకోవైపు చిట్లి పోతున్న యోని నొప్పి విలవిల్లాడిపోయింది. 'ఒద్దు వదలెయ్‌' అన్నా వినడు.

ఆ ఉధృతికి అతని పొట్ట స్టోమా బాగుపైన పడి చిట్లి పక్కంతా మలం చిమ్మింది.  అతని మీదకూడా... 'ఛీ... నీయమ్మ ఏం బతుకే ఇది మరుగుదొడ్డి ముండా' అని చెంపలు వాయించాడు పరుగెత్తి బాత్రూంలో షవరు కింద గంట సేపు కూర్చున్నాడు.

'తను మరుగుదొడ్డి ముండనట' రక్తం మరిగిపోయింది. అసలింట్లాంటి స్థితిలో ఉన్న భార్యతో మనిషి లక్షణాలున్న ఏ మగాడైనా సెక్స్‌ చేస్తాడా?

వీడు మనిషైతే కదా... ఇక ఆ రోజులనుంచీ తన గదిలోకి సెక్సు కోసం రావడం మానేసాడు పీడా పోయింది అనుకుంది. కానీ ఈ స్టోమా బ్యాగు పీడ ఎప్పుడు విరగడ అవుతుంది? ఎంత కాలమైనా పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నాడు డాక్టరు. స్టోమా చుట్టూ మంట, దురద, నొప్పి. మెదడులో కూడా పెద్ద రంధ్రం పడ్డట్లు ఖాళీతనం. స్టోమా లోపల, బయటా ఇన్‌ఫెక్షన్‌ శరీరం విషమై చావు కూడా రావచ్చట. తన శరీరానికున్న నవ రంధ్రాలతో పాటుగా, పదో రంధ్రం కూడా కృష్ణారావే చేసినట్లు చావు కూడా కృష్ణారావు రాసాడు.

*******

'అమ్మా' అంటూ ఎప్పుడూ రాని చిన్న కూతురు వచ్చింది గదిలోకి... ఇంటికి వచ్చినా, తన గదిలోకి రాకుండానే రహస్యంగా వెళ్ళిపోతున్న కూతుళ్ళూ అల్లుళ్ళూను చూస్తూ నిర్వేదంగా నవ్వుకొంటోంది తులసి.

'అమ్మా నీ బాధ చూడలేకపోతున్నానే. వదినలు ఎంత విసుక్కుంటున్నారో... అసహ్యించుకుంటున్నారో నాకు తెలుసు. మీ అల్లుడు కూడా బాధ పడ్తున్నారు. మా ఇంటికొచ్చేయి నేను చూస్కుంటా నిన్ను' అంది చిన్న కూతురు మానస. ఇంత ప్రేమేంటి ఒక్కసారిగా? దీని కూతురు తన ఒళ్ళో కూర్చుంటే కొట్టి మరీ గుంజుకెళ్ళిందే? ఆశ్చర్యపోతూ చూసింది తులసి. 'మరే అమ్మా మణికొండలో నీ పేరు మీద ఉన్న మూడొందల గజాల ప్లాటు నా పేరు మీద చేయించమంటున్నారే నీ అల్లుడు. రాసాక తీస్కెళతా' మెల్లగా కక్కింది. తులసి గుండె బరువెక్కింది. తర్వాత చిన్నగా నవ్వింది. మరుక్షణం భరించరాని వేదనా దుఃఖంతో మానస వైపు చేయి చాపి అడ్డంగా ఊపుతూ గదిలోంచి బయటకు వెళ్ళిపొమ్మంటూ సైగ చేసింది. 'నీ ఖర్మ' అంటూ మానస గదిలోంచి విసవిసా వెళ్ళిపోయింది.

*******

రాత్రి ఎనిమిదికి కృష్ణారావు హడావుడిగా గదిలోకి ఫోన్లో మాట్లాడుతూ వచ్చాడు. 'సరె... సరె...' అంటూ ఫోను మంచంపైన పెట్టి బీరువా తెరిచి హడావుడిగా ఏదో తీసి జేబులో కుక్కుకున్నాడు. అంతే హడావుడిగా వెళ్ళిపోయారు. కారు కదిలిన చప్పుడు. ఏదో కొత్త సెంటు వాసన ఎప్పుడూ వాడనిది వాడాడు. ఫోను మర్చిపోయాడు. అది మోగింది. తులసి ఫోన్‌ ఎత్తింది. ఒక అమ్మాయి అందంగా ఉంది జుట్టు విరబోసుకొని పెదాలకు ఎర్రని లిప్‌స్టిక్‌ వేస్కొంది. చేతుల్లేని జాకెట్టుతో ఉంది. రేరాణి అని ఉంది పేరు... ఫోన్‌ ఎత్తింది. ''ఓయ్‌, ఈ రోజు నీ పెళ్ళాం చంద్రహారం తేవాల్సిందే లేకపోతే నువ్వెన్ని వేలు ఇచ్చినా నీకు స్వంతం కాను ఈ రాత్రి గుర్తుంచుకో...'' రేరాణి మాట్లాడుతూనే ఉంది. తులసి గుండె పగిలి లావా చిమ్మింది. కొత్త సెంటు కొత్త బట్టలు, ఇందుకన్న మాట రోజూ రాత్రి ఒంటి గంటకు ఇంటికి రావడం ఇదన్న మాట. చంద్రహారం తన తల్లి తనకు ఇచ్చిన కానుక. అందరాడ పిల్లలకి మూడు తులాలు వేసి చేయించి తులసికి ప్రేమతో అమ్మ అని బిళ్ళమీద చెక్కించింది. ఇట్లా ఎన్ని నగలు తీస్కెళ్ళి ఆమెకి ఇచ్చాడో? బీరువా తెరుస్తుంటే పైసలకో, ఫైల్స్‌కో, బట్టలకో అనుకున్నది. రేరాణి కోసమేనా ఇదంతా... తన పరిస్థితి ఇంత దారుణం చేసి తననొక జీవశ్చవంలా... తన దేహాన్ని మలం మోసే మరుగుదొడ్డిగా మార్చి, తననొక కదులుతున్న లాట్రిన్‌గా మార్చి తన బతుకులో ఇంత దుర్గంధం నింపి తను వెళ్ళి రేరాణి ఒళ్ళో కులుకుతున్నాడా. తులసి హృదయం భగ్గుమని మండిపోయింది. మనిషి నిలువెల్లా ఒణికిపోయింది కోపంతో వాణ్ణి చంపెయ్యాలి. తులసి, కృష్ణారావు కోసం ఎదురు చూడసాగింది. మరుక్షణం తన దగ్గరకి వచ్చే శత్రువుని ఎట్లా మాటువేసి చావగొట్టాలా అని ఎదురుచూసే సాయుధ సైనికురాల్లాగా... ఇంకో పది నిమిషాల్లో కృష్ణారావు హడావుడిగా వచ్చాడు 'ఫోనేదీ' అంటూ కుక్కలా మంచం కింద, మీదా, దిండ్ల కింద చూస్తూ... 'ఎవత్తిది... నా చంద్రహారం ఇచ్చేసావా ఎన్నాళ్ల నుంచి నడుస్తుంది ఈ వ్యవహారం చెప్పు' అంది తులసి తన చేతిలో ఉన్న ఫోన్‌లో రేరాణి ఫోటో చూపిస్తూ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ... 'ఇవ్వు' అంటూ మీదపడి గుంజేస్కున్నాడు. 'నీతో అవుతే దాని దగ్గర్కి ఎందుకెళతానూ... తెలియకనే అడుగుతున్నావా నోర్మూస్కొని పడి ఉండు మొగాణ్ణే నేనూ. ఇంకా ముసలివాణ్ణి కాలేదు' అంటూ ఎంత వేగంగా వచ్చాడో అంత వేగంగానే వెళ్ళిపోయాడు. తులసి కుప్పకూలిపోయింది.

******

గాఢంగా నిద్రపోతున్న కృష్ణారావు ఉలిక్కిపడి లేచాడు. తులసి అతని ఛాతీ మీద తట్టి తట్టి లేపుతున్నది. మనిషి కోపంలో వణికిపోతున్నది. కళ్ళెర్రబారి ఉన్నాయి. ఏమైంది... ఏమైంది అని ఉలిక్కిపడి లేచాడు కృష్ణారావు. రేరాణి దగ్గరికి వెళ్ళి ఇంటికొచ్చి తృప్తిగా నిద్రపోతున్న కృష్ణారావుని చూసి కుతకుతా ఉడికిపోయింది తులసి.

కళ్ళు తెరిచిన కృష్ణారావు మొఖం మీదకి ముద్దలు, ముద్దలుగా కారిపోతూ, జారిపోతున్న మలం పడింది. ఏంటిది... ఏంటిది... భరించలేని కృష్ణారావు లేవబోయాడు. తులసి నింపాదిగా అతని ఛాతీ, పొట్ట, కాళ్ళ మీద స్టోమా బాగ్‌ పిండుతూనే ఉంది. తాగి ఉన్నాడేమో మెలకువ వచ్చినా లేవలేని కృష్ణారావు దుర్గంధానికి ఉక్కిరి బిక్కిరై పోతున్నాడు.

ఖాళీ అయిన స్టోమా బాగ్‌ను కృష్ణారావు మొఖం మీదకి విసిరికొట్టి 'థూ నీ బతుకు చెడ' అంటూ కృష్ణారావు మీద తుపుక్కున ఖాండ్రించి ఉమ్మేసి తన పొట్ట మీద రంధ్రాన్ని అరచేత్తో జాగ్రత్తగా కప్పేస్తూ కృష్ణారావు గది దాటింది తులసి.

Follow Us:
Download App:
  • android
  • ios