●యాకూబ్

ఒక గుడిసె కథ, హిట్లర్ నవ్వు, తుఫాను తుమ్మెద, దెర్సూ ఉజాలా, సంగీతసూర్యుడు, పుట్టినరోజు గురించి, నీటిపుట్ట, అజంత, దయలేని నగరం, వీధుల్లో ధరణి, ధరిత్రి.. భూమి, అమ్మపాడిన పాట, ఈమె ఎవరు? విషాద విదూషకుడు, ఇలా చెప్పుకుంటూ పోతే దేవిప్రియ కవితలు నిద్రలోను గుర్తుండే లక్షణం కలవి, ఇంకా ఎన్నో. ఒక కవి సృజనశక్తికి సంబంధించిన కొలమానం ఇంతకంటే వేరే ఏం కావాలి? ఇంకా ఈ కవి గురించి యోగ్యతాపత్రాలు జారీ చేయవలసిన అవసరం ఉందా? కవిత్వానికే పాఠాలు నేర్పగలిగిన నేర్పరి దేవీప్రియ. శిల్పంలో దేవిప్రియగారు భిన్నం. ఎన్ని ప్రక్రియలు ఈ కవికి దాసోహం అన్నాయో అని ఒకింత ఆశ్చర్యం, మరింత ప్రశంసాభావన కలుగుతాయి.

దేవిప్రియ ’రన్నింగ్ కామెంటరీ‘లు ఆంధ్రదేశాన్ని ఆవురావురుమని చదివేట్లు చేశాయి. మా చిన్నప్పుడు ఆంధ్రప్రభ, ఉదయం, ఆంధ్రజ్యోతి మొదటి పేజీలలో ప్రతిరోజు వచ్చే రన్నింగ్ కామెంటరీలు క్యూలు కట్టి చదివింపజేసేవి. పుచ్చలపల్లి సుందరయ్యగారు చనిపోయినప్పుడు ‘సోషలిజం ఈ దేశపు/ బిడ్డల తలనిమిరినపుడు/ ఎర్రబడిన ఏ మబ్బుల/ తేరుమీదొ వచ్చి చూడు’ అని దేవిప్రియ రాసిన రన్నింగ్ కామెంటరీ మా ఖమ్మం జిల్లాలోని అనేక పట్టణాల్లో, గ్రామాల్లో, సి.పి.యం. పార్టీ కార్యాలయాల గోడలమీద రాసి ఉండేవి. ఒక కవికి ఇంతకంటే గౌరవం ప్రజల అభిమానం వేరేముంటుంది.

"జమ్ జమ్మల్ మర్రీ" వంటి ఆయన సినిమా పాటలు నేటికీ నిత్యనూతనంగా ప్రజలు పాడుకుంటూనే ఉన్నారు. పాటకు పదాలతో ప్రాణం పోసే కళ తెలిసినవాడు దేవిప్రియ.

దేవిప్రియది అనునయకంఠం. ఆగ్రహాన్ని కూడా అనునయంగా వ్యక్తీకరించడం ఆయన ప్రత్యేకత. ఈ ప్రత్యేకతే దేవిప్రియను సమకాలీన సాహిత్యంలో భిన్నంగా నిలబెడుతున్నది. తానే చెప్పుకున్నట్లుగా తన కవిత్వం –
'’ఇంద్రధనుస్సుకి/ నిద్రలో కనిపించే బ్లాక్ అండ్ వైట్ స్వప్నం/ పద్మవ్యూహం లోంచి/ బయటపడే ప్రయత్నం చేయడం‘‘, ’’కనురెప్పల వెనుక మూసిన నిశీధిలో/ చూచుకాన్ని మీటుతున్న చూపుడువేలు‘‘, ’’నీటిలోకి నిటారుగా దిగిన/ కత్తిలా నిశ్శబ్దంగా చీల్చుకుపోవడం‘‘. ఇంత వైవిధ్యమైన కవిత్వతత్వమే దేవిప్రియని కవితారంగంలో ఒక మహోన్నత కవిగా నిలబెడుతోంది. 

దేవిప్రియ ఊహ చేసేపద్ధతి, ఆయన కవిసమయం భిన్నంగా ఉంటాయి. శబ్దాన్ని, అర్థాన్ని తన అదుపులో పెట్టుకుని, పదాలకు తన ముద్రతో కూడిన భావాన్ని అద్దడం ఆయన ప్రత్యేకత. ప్రతిపాదంలోను కవిత్వం తొణికిసలాడే సందర్భాలే అన్నీనూ. గద్దర్ గురించి ఆయన ఊహ చేసిన పద్దతి చూడండి.
 ’’నల్లమబ్బు గొంగళి భుజానేసుకున్న/ భువనజనహవనఘోష/ ఒక నక్షత్ర ఖచిత నవనీత ఖడ్గం/ నిప్పుల నదిలో ఈదుతున్న/ మహాద్భుతమైన మాటల మంచుచేప‘‘
 ఒక్కో పదబంధం ఒక్కో ప్రతీక ఎంత ఒడుపుగా, ఎంత బిగుతుగా తాను చెప్పే భావాన్ని మనకు బోధపరుస్తాయో గమనించండి. ఇది దేవిప్రియ కవిత్వంలోని సహజగుణం. ’’మూడోకన్ను ఉదయించిన కవికి/ ముప్పైమూడో కన్ను ప్రతీకగా‘‘ గా చేసుకున్నవాడు దేవిప్రియ. ఎన్నిబొమ్మలు, ఎన్ని కేకలు, ఎన్ని చిహ్నాలు – ఈ కవి కలం లోంచి ఏ ఏ పద్ధతుల్లో రూపుదిద్దుకున్నాయో పరిశీలిస్తే ఆధునిక కవిత్వంలో ఈయన స్థానమేమిటో స్పష్టంగా అర్థమవుతుంది.

’’నాలుకమీద కవిత్వం/ తలమీద దారిద్ర్యం‘‘ తన రెండు నిధులుగా చెప్పుకున్న ఈ కవి. ’కవిత్వ నిత్య నిబద్దంగా బతకడం / దారిద్ర్యవిముక్తి యుద్ధం చేయడమే తన విధులు‘ గా చేసుకున్నాడు. కవిత్వ నిత్య నిబద్దుడిగా బతికే దేవిప్రియ చుట్టుముట్టి వుండే జీవనవేదన ఆయనను సదా జాగరుకుడిగా చేస్తుంది. తాను ఏ మూలాల నుండి వచ్చాడో, తన జీవన నేపథ్యం ఏమిటో మరవకుండా ఉంచుతుంది. ఇప్పటికీ తన బాధ్యతల్నీ, తన కన్నతల్లిని, తన సహోదరుల్నీ కవచంలా కాపాడుతూ, జీవన బాద్యతల్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కుంటున్న సాహసి.

’ఈ గుడిసెలోనే నాకు తొలిసారిగా/ కానరాని కన్నీటి సముద్రాలు/ ఉప్పొంగుతూ కనిపించాయి‘ అని పారదర్శకంగా తనను గురించి చెప్పుకున్న ఈ కవిని నిరంతరం మెలకువగా ఉంచింది కూడా ఈ గుడిసే. పొగాకు కంపెనీ సైరన్ మోతలు, కోడిపెట్ట వేసిన రంగురంగుల రెట్టలు, గుడిసెకు కాపలా కన్నై వెలిగిన గుడ్డిదీపం, రెల్లుపోచలు, అడివి, ఇంకా ఇటువంటి ఎన్నో జీవనవాస్తవికతలు ఆయన లోని నిత్యనిబద్దతను కాపాడుతున్నాయి. ఆయనను తన సహజ జీవనశైలిలోనే జీవించేట్టు చేస్తున్నాయి. తన సామాజిక కవితానేపథ్యం, ఆయన కవిత్వంలో స్పష్టంగా కచ్ఛితంగా ప్రతిఫలించింది.

మైనారిటీ మతంలో పుట్టిన ఈ కవి, ’అమ్మ పాడిన ఆ పాట, బాల్య రంజాన్‘ వంటి కవితలలో మైనారిటీ జీవనవేదనని స్పష్టంగా కవిత్వీకరించాడు. తాను ఒక సీతాకోకచిలుకగా, రాకాసి లోయవలే ఉన్న ఈ ప్రపంచంమీద వాలినప్పుడు తన తల్లి చనుబాలలో కలిపి తాగించిన కవిత్వమే తనను బతికించి ఉంచిందని చెప్పుకున్నాడు. ఆమె తన చిన్నప్పుడు పాడిన ఖసీదాలు, ఆమె వల్ల తనకు సంక్రమించిన కవిత్వం – ఇవన్నీ తనలోపల ఆరకుండా వెలుగుతూ వుండడం చేతనే తాను కవిగా నిలబడ్డానని చెప్పుకోడంలో ఈ కవి అంతర్లోకం ఖచ్చితంగా కనిపిస్తోంది. మైనారిటీ వేదనను, సమాజవేదనను మేళవించి నిప్పులు కురిపించాడు. ప్రేమను కురిపించాడు. అన్ని వేళల్లోను, అన్ని సందర్భాల్లోను, అప్రమత్తంగా కనుచూపుతో ఆకర్షిస్తున్నాడు.

కవిత్వానికి కావలసిన ముడిసరుకు దేవిప్రియ విషయంలో ఎవరూ ఊహించలేని కోణాలనుంచి, ఎవరు పట్టించుకోని విషయాల నుంచి వచ్చి చేరుతుంది. ’దెర్సూఉజాలా‘, విప్లవకారుల కోసం ఎదురుచూస్తున్న ఖాళీ కుర్చీలు, విమాన ప్రయాణాలు, శిఖామణి పెళ్ళికి రైలు ప్రయాణం, రుతువర్ణన గురించి ’కిమ్ కాలమ్‘, బెల్లి లలిత హత్య, తన కవిత్వంలో విస్తృతంగా పరచుకున్న గద్దర్ (అనేక రూపాల్లో, మెటఫర్లలో), గరీబు గీతాలు, సమాజానందస్వామి, అందులోని మహావ్యంగ్యం, తొలిసారిగా తెలుగు కవిత్వంలో కవితావస్తువుగా సంగీతాన్ని, బిస్మిల్లాఖాన్ ను స్వీకరించడం, సీసాయుధం వంటివి ఎన్నైనా దేవిప్రియ కవితావస్తువుల పరిధి అనూహ్యమైనదని చెప్పడానికి ఉదాహరించవచ్చు. ఈయన కవితానిర్మాణ నిపుణత వల్ల కవిత్వానికి అదనంగా అనుభూతి పరిధి విస్తృతమవుతుంది. కవిత్వ వైశాల్యం, వైవిధ్యం, ఊహచేసే పద్ధతి వల్ల దేవిప్రియ కవిత్వంలో పదేపదే చదివించే గుణం ఎక్కువ. భావుకత్వం తొణికిసలాడే కవి దేవిప్రియ. తక్షణ స్పందనల్ని కూడా అపూర్వమైన రీతిలో అపురూప కవిత్వంగా మలిచేకళ దేవిప్రియకు తెలుసు.

’నేను/ శ్రమపోసి / పెంచుకున్న దేహం/ పిడుగులు మోసుకు తిరిగే ఆకాశం, నన్ను/ ఒక్కడినే ఫోటో తీసినా/
కడిగి చూస్తే అందులో / మీరందరూ కనిపిస్తారు‘. దేవిప్రియలోని ముభావలక్షణం కవిత్వంలో అంతర్ముఖతగా దర్శనమిస్తుంది. ఆయన స్పందనల్లో సమాజాన్ని విశ్లేషిస్తూ రాసే కవిత్వంలో లేదా ప్రపంచవిషయాలు ప్రస్తావిస్తున్నప్పుడు కానీ, ఈ అంతర్ముఖత లక్షణం వల్ల కవిత్వంలో ఒక భిన్నమైన కోణం ఆవిష్కారమవుతుంది. శబ్దం పట్ల, అర్థం పట్ల, నడక పట్ల ఉండే శ్రద్ధ వల్ల, ప్రాపంచిక దృక్పథం వల్ల ఈయన కవిత్వానికి వేరొక చోట కనబడని మెరిసే లక్షణం వస్తుంది. ఈ మెరుపు కవిత్వమే కవిగా దేవిప్రియ చిరునామాను ప్రకాశింపజేస్తుంది. ఆ లక్షణం దేవిప్రియ కవితలు మనకు లెక్కలేనన్ని గుర్తుండిపోడానికి కారణమవుతుంది.

Also Read: ప్రముఖ కవి, జర్నలిస్టు దేవిప్రియ ఆకస్మిక మరణం

పై లక్షణాలతో పాటు దేవిప్రియ కవిత్వాన్ని ’ఉల్లేఖన స్థాయి‘ కి చేరుకున్న కవిత్వంగా కూడా చెప్పుకోవలసి ఉంది. ఒక కవిత్వం ఉల్లేఖనాస్థాయికి చేరడం అరుదు. పఠాభి, శ్రీశ్రీ, ఆరుద్ర వంటి వారి కవిత్వాన్న సభల్లోనూ, వ్యాసాల్లోను, ప్రత్యేకసందర్భాల్లోను, సంభాషణల్లోను కోట్ చేస్తుంటాం. అలా కోట్ చేసే కవిత్వ పాదాలు దేవిప్రియ కవిత్వంలో కోకొల్లలు. ’ఆకాశం చెట్టుకి కట్టిన/ అద్భుతమైన ఊయలలా వుంది విమానం‘, ’నాకు రెండు/ విధులున్నాయి / కవిత్వనిత్యనిబద్దం/ దారిద్ర్యవిముక్తియుద్ధం‘, ’కవులు ప్రేమిస్తారు/ నిజానికి వాళ్ళకు చేతనైంది/ అదొక్కటే‘, ’గాలినదిలో తేలే/ గాలిపటం పడవ‘, ’మరణం ఒకతీర్చలేని రుణం‘, నిప్పులనదిలో ఈదుతున్న మహాధ్భుతమైన మంచుచేప వంటివెన్నో ఈ కోవకు చెందినవి.

దేవిప్రియ కవిత్వంలో మరో ప్రధాన లక్షణం లయ. అత్యాధునిక వచనకవిత్వంలో ఇది అతితక్కువగా కనిపించే లక్షణం. ఈ గుణం వల్ల దేవిప్రియ కవిత్వం చదువుతున్నప్పుడు ఒక గంభీరమైన నడకతో సాగుతుంది. శబ్ధప్రధానమైన ఈ గుణం వల్ల అనుభూతి సాంద్రత పెరుగుతుంది. ఈ అనుభూతి సాంద్రత పెరగడానికి కేవలం శబ్ద ప్రాముఖ్యతే కాక, వస్తువులోని భిన్నత కూడా కారణం. తీసుకున్న వస్తువులోని సున్నితమైన పార్శ్వాలు ఆవిష్కరమవుతుండడం, శబ్దలయ దానికి తోడవడం, దేవిప్రియ కవిత్వంలో ఎల్లెడలా కనిపిస్తుంది. ’అడివీ, నువ్వంటే నాకిష్టం‘, ’అసామాన్య పర్వతపవనగాన జలపాతం‘, ’ముందుకు దూకుతున్న/ ఇనుప జింకలా వుంది మా రైలు‘, ’నీ పాటలో/ నీ చెవులకు లోలకులై కదలాడిన నక్షత్రాలు /నీ చేతులకు గాజులై నిక్వణించిన చంద్రరేఖలు/ నీ సిగలో నాగరమై ప్రజ్వలించిన సూరీడు/ నాకు కనిపించలేదమ్మా‘ ఇలా సాగుతుంది కవితల నడక, ఆ లయతో కూడిన నడక అనుభూతికి సాంద్రతరం చేస్తుంది.

ఇక పాటల విషయం – ఒక చిన్న ఉదాహరణతో ఆయన పాటను కూడా ఎలా దోచుకున్నాడో చెబుతాను. ’జమ్ జమ్మల్ మర్రీ‘ అనే పాటలో ’ధారలు కట్టిన చెమటే జరి పైట నీకు, చల్‘ అనే చరణంలో ఎంత కవిత్వం దాగుందో విశ్లేషిస్తే పాటకు దేవిప్రియ కలం ఎలా ఉరకలెత్తుతుందో, పాటను కూడా కవిత్వంతో ఎలా నింపుతుందో ఇట్టే తెలిసిపోతుంది. రన్నింగ్ కామెంటరీలు, వ్యంగ్య, సినిమా స్క్రిప్టులు, హత్తుకునే అడ్వర్టయిజ్ మెంట్లు, ఇలా బహుముఖీనమైన ప్రతిభావ్యుత్పత్తులతో నైపుణ్యంతో తన కవిత్వ నిత్య నిబద్దతతో వాస్తవిక ప్రాపంచిక దృక్పథంతో సాహిత్య రంగంలో, కవిత్వ రంగంలో పెనవేసుకున్న అసాధారణ కవి దేవిప్రియ. కుడోస్ టు దేవిప్రియ.

(దేవి'30 సంచిక కోసం రాసిన వ్యాసం, 2002)