Asianet News TeluguAsianet News Telugu

ప్రముఖ కవి, జర్నలిస్టు దేవిప్రియ ఆకస్మిక మరణం

ప్రముఖ తెలుగు కవి, జర్నలిస్టు దేవిప్రియ కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దేవిప్రియ జర్నలిస్టుగా పలు ప్రయోగాలు చేశారు

Telugu poet, journalist Devipriya dies
Author
Hyderabad, First Published Nov 21, 2020, 9:41 AM IST

హైదరాబాద్: ప్రముఖ కవి, జర్నలిస్టు దేవిప్రియ ఆకస్మికంగా మరణించారు. అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు సాహిత్య లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

తాడికొండకు చెందిన దేవిప్రియ ఉదయం వంటి పలు పత్రికల్లో పనిచేశారు. ఆయన అమ్మచెట్టు, నీటిపుట్ట, చేప చిలుక, తుఫాను తుమ్మెద, గరీబు గీతాలు, సమాజాంద స్వామి వంటి పలు రచనలను వెలువరించారు. గాలి రంగు అనే గ్రంథానికి ఆయనకు 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 

దేవిప్రియ మృతదేహాన్ని సికింద్రాబాదులోని ఆల్వాల్ లో గల నివాసానికి తరలిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు తిర్మలగిరి స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 

దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు. ఆయన అసలు పేరు షేక్ ఖాజా హుస్సేన్, తండ్రి షేక్ హుస్సేన్ సాహెబ్, తల్లి షేక్ ఇమామ్ బీ. గుంటూరులోని ఏసీ కాలేజీలో బిఎ చదువుకున్నారు. సాహిత్యరంగంలో ఆయన దేవీప్రియగా ప్రసిద్ధి పొందారు. తన సాహిత్యాన్నంతా ఆయన దేవిప్రియ పేరుతో వెలువరించారు.

కాలేజీ రోజుల్లోనే ఆయన సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నారు గుంటూరు కేంద్రంగా అవతరించిన పైగంబర కవులు బృందంలో ఆయన చేరారు. జర్నలిస్టుగా ఆయన ప్రాజావాహిని, నిర్మల, ప్రజాతంత్ర, జ్యోతి, మనోరమ తదితర పత్రికల్లో పనిచేశారు. ఉదయం, హైదరాబాద్ మిర్రర్ పత్రికల్లో పనిచేశారు ఆయన రన్నింగ్ కామెంటరీ కార్టూన్ కవిత్వం తెలుగు పత్రికా రంగంలో కొత్త ఒరవడి సృష్టించింది.  దాసి, రంగులకల తదితర సినిమాలకు ఆయన పనిచేశారు. 

దేవిప్రియ మృతికి తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి సంతాపం ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios