'నేల విమానం', 'తురాయి పూలు' కవితా సంపుటాలు... జయంతి వాసరచెట్ల జంట పుస్తకాల ఆవిష్కరణ
రెండు రోజుల్లో జయంతి వాసరచెట్ల కలం నుండి జాలువారిన కవితా సంపుటాలు నేల విమానం, తురాయి పూలు తెలుగు పాఠకులకు అందుబాటులోకి రానుంది.
హైదరాబాద్: జనవరి 6వ తేదీన (గురువారం) చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జయంతి వాసరచెట్ల రచించిన కవితా సంపుటాలు 'నేల విమానం' ' తురాయి పూలు' ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. త్యాగరాయ గానసభ సౌజన్యంతో చందన పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో కళా సుబ్బారావు వేదికపై సాయంత్రం 6గంటలకు ఈ జంట పుస్తకాల ఆవిష్కరణ జరగనుంది.
ఈ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డా. నాళేశ్వరం శంకరం అధ్యక్షత వహించనున్నారు. ''తురాయి పూలు" కవితా సంపుటిని తెలంగాణ సాహిత్య అకాడమి పూర్వ అధ్యక్షులు డా.నందిని సిధారెడ్డి, "నేల విమానం" కవితా సంపుటిని మేడ్చెల్ జిల్లా అదనపు కలెక్టర్ డా. ఏనుగు నరసింహారెడ్డి ఆవిష్కరించనున్నారు.
read more జయంతి వాసరచెట్ల కవిత : కొన్ని అక్షరాలు
తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ పుస్తకాల ఆవిష్కరణ సభకు విశిష్ట అతిథులుగా తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా వి.యస్ జనార్దన మూర్తి. ఆత్మీయ అతిథులుగా డా. చీదెళ్ళ సీతాలక్ష్మి , పైడిమర్రి గిరిజారాణి , డా.బెల్లంకొండ సంపత్ కుమార్ , ఘనపురం దేవేందర్ తదితరులు పాల్గొంటున్నారు.
వాసరచెట్ల జయంతి కవిత్వమే కాకుండా కథలు, నవలలు కూడా రాస్తున్నారు. గతంలో కాన్పు, ఆమె గెలిచింది వంటి మినీ నవలలు, మల్లిక పేరుతో నవల, 20 వరకు కథలు, 86 పుస్తక సమీక్షలు రాశారు. ప్రస్తుతం 'కుతంత్రం' అనే మరో నవల రాస్తున్నారు. ఆమె రాసిన అపరిచిత యుద్దం ( కరోనా కవిత్వం) ముద్రణలో ఉంది.