జయంతి వాసరచెట్ల కవిత : కొన్ని అక్షరాలు
జ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న అక్షరాల సృష్టి కర్తల గురించి జయంతి వాసరచెట్ల రాసిన కవిత "కొన్ని అక్షరాలు" లో చదవండి.
ఆకృతి దాల్చకుండానే ….
పెదాల నుండి వెల్లువలా ప్రవహిస్తుంటాయి
పుక్కిట నిండిన అక్షరాలన్నీ
కొత్తకొత్త పదబంధాలై వల్లెవేస్తుంటాయి..!!
అతను వేళ్ళకొసలలో ఒడిసిపట్టుకున్న
సుద్దముక్క అస్త్రంతో అక్షరసైనికులను
సృష్టిస్తాడు…!!
అతను విజ్ఞాన సృష్టి కర్త..!
తన ఎదురుగా కూర్చున్న విద్యార్థులను
మేథో మధనం చేసి వారి నుండి వ్యక్తిత్వపు
వెన్న తీస్తాడు
విద్యార్థులు రేపటికాలపు దివిటీలు
కాలపు కాంతిపుంజాల వెంట
క్రమశిక్షణ దారులలో
అలుపెరుగని ప్రయాణం సాగిస్తేనే
వారు కలలుగన్న ప్రపంచాన్ని చేరుకుంటారు..!
ప్రస్తుత ప్రపంచంలో గురుశిష్యులిద్దరూ
తరాలకు విజ్ఞాన వారసులు
తల్లిదండ్రులు సహృదయ ప్రేక్షకులు
అప్పుడప్పుడూ….
వల్లె వేస్తున్న కొన్ని అక్షరాలు
అపశృతులు పలుకుతుంటాయి…!!
అది వాటితప్పుకాదు..!
నిర్వికారంగా పలికే పెదాలది
ఆచరించే వ్యక్తులది…
కానీ ….
తేజోమూర్తిగా కనబడే అతను
చేతిలోని సుద్దముక్కతో...
నిరంతరం కొన్ని అక్షరాలను సృష్టించి
జ్ఞాన జ్యోతులు వెలిగిస్తూనే ఉంటాడు.