అరుణ ధూళిపాళ కవిత : శిఖర పతాక
దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ శిఖరంపై ఎగరేయడానికి కంకణ బద్ధులైన నిర్ణయాత్మక జ్ఞానశక్తులు అంటూ అరుణ ధూళిపాళ రాసిన కవిత ' శిఖర పతాక ' ఇక్కడ చదవండి :
వెండి వెన్నెల చెక్కిలిపై
మట్టి పెదవులు ముద్దాడిన క్షణం
భారత సంతతి యావత్తు
చెమ్మగిల్లిన కనుగవల మసకలో
వీక్షించిన ఆనందపు సంగమం
పెద్దరికాలను బద్దలు కొట్టి
విదేశీ కిరీటాలను
భరతమాత పాదాల చెంతకు చేర్చిన
అరుదైన అంతరిక్ష కావ్యం
ఆకలి, దాహాల
దేహ బాధల ఊసు వదిలి,
కాళ రాత్రులను సైతం
పట్టపగళ్ళుగ మార్చి,
యంత్రాలకు కళ్ళను ముద్రించి
రోజులను లెక్కించక చేసిన మేధోమథనం -
సందేహ, సందోహాల నడుమ
పట్టువదలని జాతి రత్నాలు
దేశ కీర్తి పతాకాన్ని
ప్రపంచ శిఖరంపై ఎగరేయడానికి
కంకణ బద్ధులైన నిర్ణయాత్మక జ్ఞానశక్తులు
ప్రతియెదలో ఆత్మవిశ్వాస ఆయుధాన్ని
స్థిరంగా చెక్కిన ధీశిల్పులు
పరిశోధనా దిగ్గజులకు ఋణగ్రస్తం
భరతజాతి జనులు సమస్తం..!!!
జయహో భారత్...!!!