రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూనే ఉన్నాం కదా.. మధ్యలో రెండు, మూడు రోజులు లేదా ఒక వారం మానేస్తే ఏమౌతుంది. మళ్లీ వారం తర్వాత మొదలెడతాం కదా.. అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే...వ్యాయామం మధ్యలో ఆపడం వల్ల చాలా నష్టాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రోజూ వ్యాయామం చేసి మధ్యలో ఆపేస్తే కండరాల మోతాదు తగ్గుతుందని... కొవ్వు శాతం పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల మధుమేహం, గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత కాలంలో మధుమేహం, గుండె జబ్బు సమస్యలు పెరగడానికి ఇది కూడా ఒక కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కవేళ ఎప్పుడైనా వ్యాయామం చేయటానికి తగినంత సమయం లభించకపోతే ఇంట్లో, ఆఫీసుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని వివరిస్తున్నారు. రోజుకి కనీసం 5000 అడుగులు.. సెలవుదినాల్లో 10,000 అడుగులు నడిచేలా చూసుకోవటం మంచిది. ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌ పరికరాలు ధరిస్తే ఎంత చురుకుగా ఉన్నామో తేలికగా తెలుసుకోవచ్చు. 

ఎక్కువసేపు కూచొని పనులు చేసేవారు వీలైనప్పుడల్లా కుర్చీలోంచి లేచి మూడు, నాలుగు నిమిషాల సేపు అటూఇటూ నడవటం మేలు. కావాలంటే వాహనాలను ఆఫీసు, దుకాణ సముదాయాలకు కాస్త దూరంలో నిలిపి నడిచి వెళ్లొచ్చు కూడా. సహోద్యోగులను కలవటానికి వెళ్లేటప్పుడు దూరం దారులను ఎంచుకోవచ్చు. అవసరమైతే తేలికగా కుర్చీలో కూచొని చేసే యోగా పద్ధతులనూ పాటించొచ్చు.

ఇలాంటివి పాటిస్తే.. వ్యాయామానికి గ్యాప్ ఇచ్చినా పర్లేదంటున్నారు నిపుణులు. అలా కాకుండా విశ్రాంతి ఇస్తే మాత్రం నష్టం తప్పదంటున్నారు.