ఆరోగ్యం మీద కాస్తో కూస్తో శ్రద్ధ ఉన్నవారంతా ఈ రోజుల్లో వ్యాయామం పై దృష్టి పెడుతున్నారు. గంటలు గంటలు కాకపోయినా... రోజూ కొద్ది సేపైనా వ్యాయామానికి సమయం కేటాయిస్తున్నారు. అయితే... వ్యాయామం చేసిన తర్వాత చాలా మంది పొరపాట్లు చేస్తున్నారని... వాటివల్ల సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. వ్యాయామం తర్వాత కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. 

వ్యాయామం చేసే సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. చెమట రూపంలో ఎక్కువ మొత్తంలో నీరు బయటకు వెళ్తుంది. శరీరం మళ్లీ మామూలు స్థితికి రావాలంటే... వ్యాయామం తరువాత దాహం తీరేలా నీళ్లు తాగాలి.  అప్పుడే డీహైడ్రేషన్‌ సమస్య ఎదురుకాదు.
 
 కసరత్తులు వేగంగా చేస్తుంటారు కాబట్టి.. దాని కారణంగా  గుండె కొట్టుకునే వేగం, జీవక్రియల రేటు పెరుగుతాయి. శరీరంపై ఒత్తిడి సైతం అధికమవుతుంది. వీటన్నింటినీ అదుపులో ఉంచాలంటే... వ్యాయామం తరువాత కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. కాసేపటి తరువాత చురుగ్గా మారిపోతారు.

వ్యాయామం చేసిన వెంటనే స్నానం చేయడం మంచిది. స్వేద రంధ్రాలు   మామూలు స్థితికి చేరుకుంటాయి. రోజంతా తాజాగా, ఉత్సాహంగా ఉంటారు. చెమట పట్టిన దుస్తులు ఎక్కువ సేపు ధరించడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని మరవకండి.

 ఓ గంట, గంటన్నరసేపు వ్యాయామాలు చేశాక... ఇంటికి వచ్చేయడం కాదు. శరీరాన్ని పూర్తిగా స్ట్రెచ్‌ చేయాలి. ఒక్కో శరీర భాగాన్ని ముప్పై సెకన్ల పాటు స్ట్రెచ్‌ చేయడం వల్ల కండరాలు సాధారణ స్థితికి చేరుకుంటాయి.

అలసిన శరీరానికి శక్తి కావాలంటే... ఏదో ఒకటి తప్పకుండా తినాలి. దీన్ని పోస్ట్‌ వర్కవుట్‌ మీల్‌ అంటారు. గుడ్డు తెల్లసొన, రెండు ఇడ్లీ... ఇలా ఏవో ఒకటి తీసుకోవడం అవసరం.ముఖంపై చెమట ప్రభావం పడకుండా ఉండాలంటే... చర్మానికి కొద్దిగా గులాబీనీరు రాసుకోవాలి. అవసరం అనుకుంటే... తలస్నానం చేయడం మంచిది.