ప్రతిఏడాది కార్తీక మాసంలో వెలుగుల పండుగగా జరిగే కోటి దీపోత్సవంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లోని దేవతామూర్తులను దర్శించుకుంటే సకల పాపాలన్నీ తొలగిపోయి.. పుణ్యం వస్తుందని ప్రజలు నమ్ముతారు.
ప్రతి ఏటా కార్తిక మాసాన కన్నుల పండుగగా నిర్వహించే కోటి దీపోత్సవ కాంతుల వేడుకను ఈ ఏడాది అక్టోబర్ 31 నుంచి నవంబర్ 14 వరకు (15 రోజులు పాటు) హైదరాబాద్‌లోని ఎన్టీయార్ స్టేడియంలో జరపనున్నట్టు నిర్వాహకులు తుమ్మల నరేంద్రనాథ్ చౌదరి తెలిపారు. దేదీప్యమానంగా నిర్వహించే ఈ మహా పండుగలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు. ప్రజల గుండె లోతుల్లో దాగిన భక్తిభావాలను ఒకే వేదికపైకి తెచ్చిన కోటి దీపోత్సవ వేడుక దిగ్విజయంగా పదేళ్లు పూర్తి చేసుకుని 11వ ఏట అడుగుపెట్టబోతుందని ఆయన చెప్పారు. ప్రతి రోజూ ప్రవచనామృతంతో మొదలై, ప్రత్యేక అర్చనలతో పవిత్రత సంతరించుకుని, దేవ దేవుల కళ్యాణ మహోత్సవాలు, లింగోద్భవం, నీరాజనాలతో భక్తులకు నిండైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ దీపోత్సవంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లోని దేవతామూర్తులను దర్శించుకుంటే కలిగే పుణ్యం,ఆనందాన్ని ఒకేచోట, ఒకే వేదికపై కల్పించే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, మహాయోగులు, ఆధ్యాత్మికవేత్తల విచ్చేయున్న కోటి దీపోత్సవానికి ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరారు.

