ముడతలను తగ్గించడం నుంచి పొడి చర్మాన్ని నివారించడం వరకు నెయ్యి ఎన్నో చర్మ సమస్యలను పోగొడుతుంది. నెయ్యిని ముఖానికి ఇలా అప్లై చేస్తే బోలెడు ప్రయోజనాలను పొందుతారు.  

చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి, చర్మానికి పోషణను అందించడానికి ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులు వంటి ఎన్నో పద్ధతులను ఉపయోగిస్తుంటారు చాలా మంది. అయితే కొంతమంది మాత్రం చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి హోం రెమెడీస్ నే వాడుతుంటారు. ఈ హోమ్ రెమిడీస్ లో నెయ్యి ఒకటి. దేశీ నెయ్యిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతామో చాలా మందికి తెలుసు. అయితే దీన్ని ముఖానికి అప్లై చేస్తే చర్మానికి నేచురల్ గ్లో వస్తుందన్న సంగతి మీకు తెలుసా?

దేశీ నెయ్యిని ఆయుర్వేద వైద్యంలో ఎన్నో రోగాలను నయం చేయడానికి చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. నెయ్యి ఎన్నో చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. దేశీ నెయ్యిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, బ్యూటిరిక్ ఆమ్లం, విటమిన్ ఎ, విటమిన్ బి 12, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మంచి చర్మానికి అవసరం. నెయ్యి మన చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. నెయ్యి వైద్యాన్ని వేగవంతం చేస్తుంది. కాబట్టి మన చర్మంపై దేశీ నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

ముఖానికి నెయ్యిని ఎలా అప్లై చేయాలి

పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడగండి. నెయ్యిని అరచేతులకు అద్దుకుని ముఖానికి అప్లై చేయండి. తర్వాత కొన్ని నిమిషాల పాటు ముఖాన్ని తేలికగా మసాజ్ చేయండి. రాత్రంతా దాన్ని అలాగే వదిలేయండి. ఉదయాన్నే ముఖాన్ని కడగండి. 2-3 వారాల పాటు ఈ విధానాన్ని అనుసరించడం వల్ల మీ ముఖం అందంగా మారిపోతుంది. నెయ్యి మీ చర్మాన్ని మృదువుగా, అందంగా, మెరిసేలా చేస్తుంది.

ముడుతలను దూరం చేస్తుంది 

నెయ్యిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ముడతలను, ఫైన్-లైన్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. నెయ్యి కొల్లాజెన్ ను పెంచుతుంది. ఇది ముడతలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.

ముఖంపై కాంతిని పెంచుతుంది 

దేశీ నెయ్యితో క్రమం తప్పకుండా ముఖానికి మసాజ్ చేసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. ఇది మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

పొడిబారడం తగ్గుతుంది

హెల్త్ లైన్ ప్రకారం.. నెయ్యిలో ఉండే విటమిన్ ఎ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు చర్మాన్ని నేచురల్ గా హైడ్రేట్ చేసి లోతుగా మాయిశ్చరైజ్ చేస్తుంది. అలాగే చర్మాన్ని మృదువుగా, తేమగా మార్చడంతో పాటు చర్మం పొడిబారే సమస్యకు గుడ్ బాయ్ చెబుతుంది. 

పిగ్మెంటేషన్ తొలగింపు

నెయ్యి చర్మంలో కొల్లాజెన్ అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. ఇది చర్మ ప్రకాశాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్ సామర్థ్యాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది పిగ్మెంటేషన్ మచ్చలను తొలగిస్తుంది.