కరీంనగర్: జగిత్యాల జిల్లాలో బుధవారం కురిసిన వర్షం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ఇంటి ఆవరణలోనే పిడుగు పాటుకు గురై ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా మరో యువకుడు తీవ్ర గాయాలతో ప్రాణాపాయస్థితిలో వున్నాడు. ఈ ఘటన జిల్లాలోని రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన నక్క హరీష్(20) తన మిత్రుడు మహంకాళి గణేష్‌తో కలిసి ఇంటిముందున్న మర్రి చెట్టు కింద నిలబడి మాట్లాడుకుంటున్నారు. అయితే అప్పటికే ఆకాశంలో దట్టమైన మబ్బులు కమ్ముకుని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. 

read more   కొండపోచమ్మ సాగర్ కుడి కాల్వకు గండి.. (వీడియో)

అదే సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కూడిన పిడుగు మర్రి చెట్టుపై పడటంతో దాని కింద ఉన్న స్నేహితులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని గమనించిన హరీష్ కుటుంబసభ్యులు వారిని హుటాహుటిన జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నక్క హరీష్ మరణించగా, తీవ్రగాయాలైన గణేష్‌‌ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో మెరుగైన వైద్యంకోసం అతన్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు సమాచారం.