ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా, సాగునీటి లక్ష్యాల సాధనకు ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాల పునర్ వ్యవస్థీకరణ జరగాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. గురువారం ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పరిశీలించారు.

అనంతరం సాగునీటి రంగంపై కరీంనగర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. సాగునీటికి సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ విభాగాలు ఒకే గొడుగు క్రిందకి తీసుకొస్తామని సీఎం వెల్లడించారు.

Also Read:ఆ విషయంలో మోడీకి మద్దతిచ్చి తప్పు చేశాం: కేటీఆర్ సంచలనం

రాష్ట్రంలోని సాగు నీటి ఇంజనీరింగ్ వ్యవస్థ ను 11 సర్కిల్స్‌గా విభజన చేస్తామని, వీటి అధిపతిగా చీఫ్ ఇంజనీర్ వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాలలో ఖాళీలు భర్తీ చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ఏప్రిల్ నెలాఖరులోగా ఇరిగేషన్ అధికారులు, సిబ్బందికి క్వార్టర్స్ నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తి పోసేలా అధికారులు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యచరణ సిద్ధం చేయాలన్నారు. సాగునీటి కాలువలకు మే నెలాఖరులోగా అవసరమైన అన్ని మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Also Read:బాధ కలిగిస్తున్నాయి: సొంత పార్టీపై తుమ్మల సంచలన వ్యాఖ్యలు

కరీంనగర్‌తో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రాలలో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్‌ల స్థానంలో కొత్త కలెక్టరేట్‌ల నిర్మాణం చేపట్టాలని సీఎం చెప్పారు. కొత్త కలెక్టరేట్ లను మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్ట్‌లలోని నీటీని ఎప్పటికప్పుడు తోడి పోసుకుంటూ రిజర్వాయర్‌లను నింపాలన్నారు. ఇంజనీరింగ్ వ్యవస్థను పటిష్ట పరచుకోవాలని, అవసరమైతే పోలీసుల మాదిరి వాకీటాకీలను ఏర్పాటు చేసుకోవాలని కేసీఆర్ సూచించారు.