ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతోంది. బుధవారం పలు ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరసన దీక్షకు దిగారు. జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలోని డిపో ఎదుట నిర్వహించిన ధర్నాలో జేఏసీ నేతలు పాల్గొన్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే కార్మిక నాయకులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. వేతనాలు లేక కార్మిక కుటుంబాలు అల్లాడుతున్నా ముఖ్యమంత్రి మాత్రం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కార్మికుల ఆవేదనను మానవీయ కోణంలో పరిశీలించి చర్చలు జరపాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపే వరకు సమ్మె ఆగదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.

Also Read:#RTC strike సమ్మె సంగతి చూడండి: గవర్నర్‌ను కోరిన అఖిలపక్ష నేతలు

మరోవైపు నర్సం పేట్ లో నిన్న చనిపోయిన ఆర్టీసీ డ్రైవర్ యాకుబ్ పాషా మృతికి సంతాపంగా కార్మికులు జగిత్యాల డిపో ముందు 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జరిగిన ధర్నాలో 100 మంది పాల్గొన్నారు.     

కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లెలో రామవ్వ అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది. భార్య మరణాన్ని జీర్ణించుకోలని భర్త భూమయ్య మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అఖిలపక్ష నేతలు బుధవారం తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేలా ప్రభుత్వానికి సూచించాలని అఖిలపక్ష నేతలు గవర్నర్‌ను కోరారు.

ఈ సందర్భంగా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఆందోళనలకు గురిచేస్తోందని ఆరోపించారు. హైకోర్టులో ప్రభుత్వం వేసిన అఫిడవిట్ తప్పని ఆయన వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ కార్మికుల బతుకులు రోడ్డు పడ్డాయని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి గీతారెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలు పరిష్కరించాలని.. ఆయన మొండిగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.

Also Read:#RTC strike తీర్పు కాపీ అందేవరకు.. సమ్మె కొనసాగుతుంది: అశ్వత్థామరెడ్డి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వంతో మాట్లాడాలని గవర్నర్‌‌ను కోరామని ఆయన వెల్లడించారు. సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని చాడ తెలిపారు.

ప్రభుత్వం తక్షణమే ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఎండీ.. హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ దారుణమని చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు.