RTC Strike: కరీంనగర్ లో ఉద్రిక్తత... గాయపడ్డ మహిళా కండక్టర్ కు ఎంపీ పరామర్శ
కరీంనగర్ లో ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియల్లో పాల్గొని గాయపడ్డ ఆర్టీసీ మహిళా కండక్టర్ ను బిజెపి ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అండగా వుంటామని హామీ ఇచ్చారు.
కరీంనగర్: ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియల సందర్భంగా పోలీసులతో జరిగిన తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయిన మహిళా కండక్టర్ సంధ్యారాణిని ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు. వర్క్ షాపు సమీపంలోని సంధ్యారాణి ఇంటికి వెళ్లి, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం పోలీసులు వ్యవహరించిన తీరును ఎంపీకి ఆమె వివరించారు. తోపులాటలో శ్వాస ఆడలేదని సంధ్యా రాణి చెప్పారు. చనిపోతున్నానేమో అనే ఆందోళన పడ్డట్టు ఆమె చెప్పారు. హుటాహుటిన బీజేపీ నేతలు హాస్పిటల్ కు తరలించి కాపాడారని తెలిపారు.
వైద్య పరీక్షలు నిర్వహించగా షుగర్ లెవల్స్ పడిపోయినట్టు గుర్తించారని వివరించారు. డ్రైవర్ బాబు తమకు చాలా సన్నిహితుడని ఆమె చెప్పారు. ఆత్మీయుడి మరణాన్ని తట్టుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యక్రియల్లో పాల్గొన్న సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో జరిగిన తోపులాటలో కళ్లు తిరిగి పడిపోయినట్టు చెప్పారు.
read more Karimnagar Bandh video: పోలీస్ లాఠీచార్జీ... ఏబీవీపీ నాయకుడికి తీవ్ర గాయాలు
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. బిజెపి పార్టీ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. పరామర్శ సందర్భంగా ఎంపీతో పాటు మాజీ మేయర్ డి.శంకర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొట్టె మురళీకృష్ణ, నగర ప్రధాన కార్యదర్శి బండ రమణారెఢ్డి వెళ్లారు.
ఆర్టీసీ కార్మికుడు బాబు మరణానికి జెఎసి ఇచ్చిన బంద్ హింసాత్మకంగా మారింది. ఈ బంద్ కి మద్దతు తెలిపిన ఏబీవీపీ నాయకులను పోలీసులు ఇష్టారాజ్యంగా అరెస్టులు చేశారు. ఈ క్రమంలో ఏబీవీపీ నాయకులపై పోలీసుల లాఠీఛార్జ్ చేయడంతో కొందరు నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ లాఠీచార్జీలో కిరణ్ అనే ఏబివిపి నేత తీవ్రంగా గాయపడ్డాడు.
read more బండి సంజయ్ పై ఏసీపీ దాడి: బిజెపి రాస్తారోకో, దిష్టిబొమ్మ దగ్ధం
పోలీసులు దాడులు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహింస్తోందని ఆరోపించారు. ఫ్రెండ్లీ పోలీసులంటే ఈరోజు కేవలం టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీసులుగా తయారయ్యారని అన్నారు. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వానికే సిగ్గుచేటన్నారు.
ఆర్టీసీ డ్రైవర్ బాబు మరణానికి సంబంధించి కరీంనగర్‌లో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌తో ఏసీపీ అనుచితంగా ప్రవర్తించారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్ కోర్టు సెంటర్ వద్ద బండి సంజయ్ కూడా బైఠాయించి నిరసన తెలియజేశారు. ఆర్టీసీ కార్మికుడు బాబు అంతిమయాత్రపై కూడా పోలీసుల నిర్బంధం ఏంటని విపక్షనేతలు మండిపడ్డారు.