సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను కాపాడలేకపోయిన సర్పంచ్ పై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఇలా జిల్లాలోని చెందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామ సర్పంచ్ ఆరు నెలల పాటు సస్పెన్షన్ కు గురయ్యారు. అలాగే ముగ్గురు అధికారులకు కలెక్టర్ మెమోలు జారీ చేశారు.

చెందుర్తి మండలం నర్సింగాపూర్ సర్పంచ్ రాపెల్లి గంగాధర్ ను 6 నెలలు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. గతనెల 22న గ్రామంలోని మల్లె గుట్ట ప్రాంతంలో హరితహారం కార్యక్రమంలో నాటిన సుమారు 1100 మొక్కలను ద్వంసం చేశారని పేర్కొంటూ గ్రామ వార్డు సభ్యులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు ఏపీఓ లకు పిర్యాదు చేశారు.  ఈ విషయమై గతనెల 28న డిఆర్‌డిఓ, డీపీఓ లు సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. అదేరోజు మండల అధికారులు సర్పంచుపై స్థానిక పోలీస్ స్టేషన్లో మరియు అటవీ అధికారుల వద్ద కేసు నమోదు చేశారు. 

మెదక్ లో ఆరోవిడత హరితహారాన్ని ప్రారంభించిన కేసీఆర్

ఎంపీడీఓ ఇచ్చిన నివేదిక ఆధారంగా గత నెల 28న జిల్లా కలెక్టర్ సర్పంచుకు షోకాజు నోటీస్ జారీ చేశారు. సర్పంచు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో సర్పంచును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చెట్ల ద్వంసం విషయాన్ని సకాలంలో పై అధికారులకు తెలపని కారణంగా ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ ప్రదీప్ కుమార్ మరియు ఏపీఓ అరుణకు మెమోలు జారీచేశారు.