కరీంనగర్: అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి అత్యంత ఘనంగా పెళ్లిచేశారు. అయితే పంచప్రాణంగా చూసుకున్న కూతురు అత్తింటికి వెళ్లిపోతుంటే ఆ తల్లి తట్టుకోలేకపోయింది. గుండెల్లో పెట్టుకుని చూసుకున్న కూతురు ఇకపై తమతో కలిసి వుండదన్న విషయం ఆ తల్లి గుండె తట్టుకోలేకపోయింది. ఇలా కూతురు అత్తవారింటికి వెళ్లడం కంటే ముందే ఆ తల్లి తిరిగిరాని  లోకాలకు వెళ్లిపోయింది. 

ఈ విషాద సంఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లా  కొడిమ్యాలలో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే... మండలకేంద్రంలో నివసించే లింగంపల్లి లక్ష్మీ(55), ఈదయ్య(60) భార్యాభర్తలు. వీరికి జమున, మహేష్ ఇద్దరు సంతానం. వారిద్దరిని ఈ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. 

read more  అచ్చంపేట ఘటనపై విచారణ: పోలీసుల చెంతకు శిశువు తల

అయితే బుధవారం వీరి కూతురు వివాహం  కొండాపూర్ కు చెందిన విలాస్ అనే యువకుడితో జరిగింది. అయితే పెళ్లి కుదిరినప్పటి నుండి కూతురుని తమను విడిచి వెళ్లిపోతోందని తల్లి లక్ష్మి  బాధపడుతూనే వుంది. ఈ క్రమంలో పెళ్లి తర్వాత ఆమె ఆవేదన మరింత ఎక్కువయ్యింది. 

దీంతో వియ్యంకుల ఇంట్లో విందుకు అందరూ సిద్దమవుతున్న సమయంలో లక్ష్మి ఒక్కసారిగా  గుండెపోటుకు గురయ్యింది. దీంతో ఆమెను  వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రికి చేరేలోపే ఆమె మృతిచెందింది. 

read more  పార్లమెంట్ ఫలితం ఎఫెక్ట్... బిజెపికి చెక్ పెట్టేందుకు గంగుల వ్యూహమిదే

దీంతో ఆనందం వెల్లివిరియాల్సిన పెళ్లింట విషాదం  అలుముకుంది. కూతురు విందు రోజే తల్లి చనిపోవడం కుటుంబ సభ్యులనే కాదు గ్రామస్తులను కన్నీరు పెట్టిస్తోంది. కూతురుపై ప్రేమతో ఆ తల్లి ప్రాణాలనే వదిలింది.