కాళేశ్వరం పనులపై కేటీఆర్ అసంతృప్తి... అధికారులకు కీలక ఆదేశాలు
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ-9 పనులను మిషన్ మోడ్ లో జరిగేలా చూడాలని... వచ్చే దసరా నాటికి ఈ ప్యాకేజీ పనులను వంద శాతం పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ-9 పనులను మిషన్ మోడ్ లో జరిగేలా చూడాలని... వచ్చే దసరా నాటికి ఈ ప్యాకేజీ పనులను వంద శాతం పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో జాతీయ పతాక ఆవిష్కరణ ఆయన అనంతరం కోనరావుపేట మండలం మల్కపేట లో ప్యాకేజీ-9 సొరంగ మార్గం, బండ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
మొదట కేటీఆర్ సొరంగ మార్గం పనులు, లైనింగ్, పంప్ హౌజ్ నిర్మాణం పనులను మొదట పరిశీలించారు. పనులు ఆశించిన మేర వేగంగా సాగడం లేదంటూ మంత్రి ఇరిగేషన్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పనులు మరింత వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బండ్ పనులను పరిశీలించిన మంత్రి క్షేత్రస్థాయిలో పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎట్టిపరిస్థితుల్లోనూ ప్యాకేజీ నైన్ పనులను వచ్చే దసరా నాటికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు వచ్చే దసరా కల్లా ఎగువ మానేరు జలాశయం గోదావరి జలాలతో నింపి రైతుల పంట పొలాలకు సాగు జలాలను అందించాలని అధికారులకు సూచించారు.
read more తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. అమరవీరులకు నివాళులర్పించిన కేటీఆర్...
అయితే ప్రాజెక్టు కోసం సేకరించిన అటవీ భూములలో పనులు చేపడితే అటవీశాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ఇరిగేషన్ అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సేకరించిన అటవీ భూమికి బదులుగా ఇదివరకే వారికి ప్రత్యామ్నాయ భూమిని ఇచ్చామన్నారు. అటవీ అధికారులు ఏమైనా ఇబ్బందులు సృష్టిస్తే వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని అధికారులకు మంత్రి సూచించారు.
మలకపేట గ్రామాన్ని ఆనుకుని ఉన్న బండ్ వద్ద సీవేజి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఇరిగేషన్ అధికారులకు సూచించారు. వాల్ పేట జలాశయం, మల్కపేట జలాశయం పర్యాటక అభివృద్ధికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నందున ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేయాలని... ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ఆరు బండ్ లలో ప్రతి బండ్ కు ప్రత్యేక థీమ్ తో ఆహ్లాదం కలిగించే పూల మొక్కలను హరితహారం లో భాగంగా నాటాలని మంత్రి అటవీ అధికారులను ఆదేశించారు.ప్యాకేజీ తొమ్మిది పనుల పరిశీలనలో మంత్రి వెంట కలెక్టర్ కృష్ణ భాస్కర్ , అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, శిక్షణ కలెక్టర్లు సత్య ప్రసాద్, రిజ్వాన షేక్ బాషా, ప్యాకేజీ9 కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ,స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.