కరీంనగర్‌ జిల్లా అల్గునూరు వద్ద కారు మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రమాదవశాత్తే రాధిక కారు కాలువలో పడినట్లు పోలీసులు గుర్తించారు. గత నెల 27న కాకతీయ కాల్వలో కారు పడినట్లుగా తెలుస్తోంది. కారు కాల్వలోకి దూసుకెళ్లిన వెంటనే రాధిక, ఆమె భర్త సత్యనారాయణ, కుమార్తె సహస్ర అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం కేనాల్‌లో ఓ బైక్ పడిపోవడంతో నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు. దీంతో కాల్వలో కారు బయటపడింది. కారులో కుళ్లిపోయిన స్థితిలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి.

Also Read:ఎమ్మెల్యే సోదరి కుటుంబం మృతి... ఎన్నో అనుమానాలు..

నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆరా తీయగా వారిని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబంగా తేల్చారు. గత నెల 27 నుంచి రాధిక కుటుంబసభ్యులు కనిపించడం లేదు.

సంఘటనా స్థలికి సీపీతో పాటు కలెక్టర్ కూడా చేరుకున్నారు. తమ వద్ద ఎలాంటి మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. మరోవైపు కాకతీయ కాలువలో వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Also Read:కాకతీయ కెనాల్ లో కారు... కుళ్లిన స్థితిలో ఎమ్మెల్యే సోదరి, ఆమె భర్త, కూతురు

ఎమ్మెల్యే చిన్న సోదరి రాధ కుటుంబం ప్రస్తుతం కరీంనగర్‌‌లో నివాసముంటోంది. ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా.. భర్త సత్యనారాయణ రెడ్డి ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. కుమార్తె వినయశ్రీ నిజామాబాద్‌లోని ఓ దంత వైద్య కళాశాలలో బీడీఎస్ చదువుతున్నారు.

మరోవైపు సోదరి మృతితో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇరుకైన వంతెన, రెయిలింగ్ కూడా సరిగా లేకపోవడంతో ప్రమాదవశాత్తూ ఈ విషాదం జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఏడాదికోసారి ఏదైనా టూర్‌కు వెళ్తుంటారని.. అలా ఏమైనా వెళ్లారేమో అనుకుని ఎదురుచూశామని మనోహర్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.