కరీంనగర్ కేంద్రంగా నూతన రైళ్ల ఏర్పాటు తో పాటు పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ శుక్రవారం కేంద్ర రైల్వే శాఖామంత్రి సురేష్ అంగాడికి వినతి పత్రం సమర్పించారు. కరీంనగర్ నుంచి తిరుపతికి రైలు ఐదు రోజుల పాటు పొడిగించిన ట్రయల్ రన్ సమయం డిసెంబర్ తో ముగిసినందున మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

అయితే ఆ రైలును కొనసాగిస్తూ వారానికి 7 రోజులు నడిచేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రికి ఎంపీ విజ్ఞప్తి చేశారు. అలాగే సిర్పూర్ కాగజ్ నగర్ రైలు ఉప్పల్ రైల్వే స్టేషన్ లో ఆగేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. దీంతో మంత్రికూడా స్పందించి వెంటనే రైల్వే శాఖ అధికారులకు రైల్వే స్టేషన్లో ఆగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 

read more  డబుల్ బెడ్రూమ్ పథకంపై కీలక నిర్ణయం... వారికోసమే: మంత్రి గంగుల

అలాగే ముంబైకి నడుస్తున్న రైలును పుణ్యక్షేత్రమైన షిరిడి వరకు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం నాగర్ సోల్ రైల్వే స్టేషన్లో ముంబై రైలు ఆగేలా చర్యలు చేపట్టాలని మంత్రిని ఎంపీ కోరారు. 

ప్రస్తుతం నిజామాబాద్ మీదుగా సికింద్రాబాద్ కు నడుస్తున్న రైలు ప్రయాణం సమయం అధికంగా ఉన్నందున తక్కువ సమయంలో చేరుకునేలా కాజీపేట మీదుగా నూతన రైళ్లను ఏర్పాటు చేయాలని  విజ్ఞప్తి చేశారు.  

read more  నిజామాబాద్ జిల్లా రైతులకు ఝలక్: అంతకు మించి అంటున్న ఎంపీ అరవింద్

కాజీపేట నుంచి కరీంనగర్ కు బైపాస్ రైలు మార్గం నిర్మించేందుకు సర్వే పూర్తయినందున వెంటనే పనులు చేపట్టాలని కేంద్ర మంత్రిని ఎంపీ సంజయ్ కోరారు. కరీంనగర్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి సురేష్ అంగడి హామీ ఇచ్చినట్లు ఎంపీ బండి సంజయ్ వివరించారు.