పురపోరులో అధికార పార్టీదే హవా... ఎన్నికలకు ముందే వరుస విజయాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిస్తోంది. పోలింగ్ కు ముందే ఆ పార్టీ పలువురు కౌన్సిలర్లను గెలిపించుకోగలిగింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో ఎన్నికలు లేకుండానే తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా పలు పట్టణాల్లో వార్డులను ఏకగ్రీవమయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.
పెద్దపల్లి పట్టణంలో 21వ వార్డు ఏకగ్రీవమయ్యింది. ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి కౌన్సిలర్ గా చిట్టిరెడ్డి మమత పోటీలో నిలిచారు. అయితే ఆమెకు వ్యతిరేకంగా పోటీలో నిలిచిన ఇతరపార్టీల అభ్యర్ధులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమయ్యింది.
read more పుర ఎన్నికలపై కేటీఆర్ యాక్షన్: సమన్వయ కమిటీ ఏర్పాటు, ఏకగ్రీవాలపై దృష్టి
ఈ వార్డులో పోటీకి ఆసక్తి చూపి నామినేషన్ కూడా దాఖలుచేసిన విజయలక్ష్మి ముడుసు, బండారి పుష్ప, స్రవంతి తిరుమలరెడ్డి, రేడపాక మల్లేశ్వరి, దొంతి రెడ్డి మంగమ్మలను ఫోటీలో నిలవకుండా టీఆర్ఎస్ నాయకులు ఒప్పించగలిగారు. దీంతో సోమవారం వీరంతా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్ఎస్ ఖాతాలో ఎన్నికలు లేకుండానే ఓ వార్డు వచ్చిచేరింది.
ఇదే పెద్దపల్లి మున్సిపాలిటీలో మరో వార్డు కూడా ఏకగ్రీవమయ్యింది. మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ పోటీచేస్తున్నారు. అయితే ఇతర పార్టీల నుండి పోటీలో నిలిచిన అభ్యర్ధులు ఇవాళ నామినేషన్ల ఉపసంహరించుకున్నారు. దీంతో పెద్దపల్లి లో రెండు కౌన్సిలర్ స్థానాలను అధికార టీఆర్ఎస్ ఎన్నికలు లేకుండానే కైవసం చేసుకుంది.
read more రెబెల్ అభ్యర్థులపై విపక్షాల చూపు: ఆటలు సాగవన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇక హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కూడా 2వ వార్డు ఏకగ్రీవమయ్యింది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్ గా యాదగిరి ఫోటీలో నిలవగా మిగతా పార్టీల అభ్యర్ధులంతా ఫోటీ నుండి తప్పుకున్నారు. దీంతో ఈ స్ధానం ఏకగ్రీవమయ్యింది. మంగళవారం ఏకగ్రీవానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
కొత్తపల్లి మున్సిపాలిటీ వార్డు నెంబర్ 1లో టీఆర్ఎస్ అభ్యర్థి వాసాల రమేష్ కు మద్దతుగా కాంగ్రెస్ అభ్యర్ధి పుప్పాల మల్లేశం తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నాడు. సోమవారం మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో అతడు టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.