వ్యక్తిగత భద్రతను వదులుకున్న బండి సంజయ్... అందుకేనా...?
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై రాళ్లదాడి జరిగినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి స్పందించారు.
కరీంనగర్: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన వ్యక్తిగత భద్రతను ఉపసంహరించుకున్నారు. రెండు రోజుల క్రితం ఆయనపై రాళ్ల దాడి జరిగిందన్న ప్రచారంతో అప్రమత్తమై పోలీసులు కల్పించిన ప్రత్యేక భద్రతను కూడా ఎంపీ వదులుకున్నారు. ఈ రాళ్లదాడి ఘటనపై జరుగుతున్న ప్రచారం అవాస్తమంటూ కరీంనగర్ సిపి ప్రకటించిన కొద్దిసేపటికే ఎంపీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
గత నాలుగు రోజుల క్రితం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పై కిసాన్ నగర్ లో రాళ్ల దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి తెలిపారు. ఎంపీతో పాటు పలువురు కానిస్టేబుళ్లు, బిజెపి కార్యకర్తకు ఈ రాళ్లదాడిలో దెబ్బలు తగిలాయని... దీంతో పట్టణంలో టెన్షన్ నెలకొని ఉందని దూలం కళ్యాణ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు గుర్తించినట్లు సిపి తెలిపారు.
ఎంపీ సంజయ్ పై రాళ్లదాడి జరిగినట్లు సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని... ప్రజలెవ్వరూ దీన్ని నమ్మవద్దని సిపి సూచించారు. పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు మరియు ఇతర ప్రముఖులు ఎవరైనా ప్రజా కార్యక్రమాలలో పాల్గొన్న సమయంలో, ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ తరపున పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా 24 గంటలు వారిని కంటికి రెప్పలా కాపాడుటకు పోలీసుశాఖ తరపున ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండే సాయుధులైన వ్యక్తిగత అంగరక్షకులను కూడా కేటాయించడం జరిగిందన్నారు.
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఏ ప్రజా ప్రతినిధిపై కూడా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడా రాళ్ల దాడులు, భౌతికమైన దాడులు జరగలేదని, అటువంటి దాడి జరిగివుంటే అదే రోజు ఎంపీ పోలీసుల దృష్టికి తీసుకుని వచ్చే వారన్నారు. అంతేకాకుండా వారి వ్యక్తిగత రక్షణ కోసం కేటాయించిన పోలీసు సిబ్బంది వెంటనే వేగంగా స్పందించి ఉండేవారని అన్నారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. ఓటు వేసిన ప్రముఖులు (ఫొటోస్)
సోషల్ మీడియాలో కొంతమంది తెలిసీ తెలియని పరిజ్ఞానంతో ఉద్దేశ్యపూర్వకంగా పార్లమెంటు సభ్యుడిపై రాళ్ల దాడి జరిగిందంటూ ప్రచారం చేశారన్నారు. ఇందుకోసం ఓ సందేశాన్ని ఫేస్ బుక్ మరియు వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విషయం ఆందోళనకరంగా వుందని పేర్కొన్నారు.
కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ప్రజల భద్రత కోసం ఎల్లవేళలా పనిచేస్తూ, పోలీసుల పట్ల గౌరవం ఇనుమడింపజేసి ఈ కమిషనరేట్ కు ఒక గుర్తింపును తీసుకొని వస్తున్నారని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తలు, సందేశాలు, సరికాదన్నారు.
ఎటువంటి చిన్న సంఘటనకు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రశాంతమైన వాతావరణంలో, ప్రజలు నిర్భీతితో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా, ఎన్నికలు సజావుగా జరగడానికి పోలీసుల నిరంతర శ్రమిస్తూ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం
సమాజం పట్ల ఏమాత్రం అవగాహన లేని కొంతమంది యువకులు సామాజిక వేదికలైన వాట్సప్, ఫేస్ బుక్ లలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని... వారు తమ వైఖరి మార్చుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవలసి వస్తుందని సిపి కమలాసన్ రెడ్డి హెచ్చరించారు.