కరీంనగర్: కాకతీయ కాలువలో వెలుగు చూసిన మరణాలపై పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి స్పందించారు. డైరీలోని రాత సత్యనారాయణ రెడ్డిదా కాదా అనేది తేలాల్సి ఉందని ఆయన చెప్పారు. కరీంనగర్ కాకతీయ కెనాల్లో గత నెల 17వ తేదీన వెలుగుచూసిన... పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం కారు ప్రమాదంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

సత్యనారాయణ రెడ్డికి సంబంధించిన ఓ డైరీ ఆయన ఫర్టిలైజర్ షాపులో పోలీసులకు దొరికినట్టుగా తెలుస్తోంది.  దాంతో పలు కీలక ఆధారాలు పోలీసులకు లభించాయని తెలుస్తోంది. ఆ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా ప్రమాదం కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు....మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కరీంనగర్ బ్యాంకు కాలనీలోని నారెడ్డి సత్యనారాయణ రెడ్డి ఇంట్లో నివాసముంటున్న వారితో పాటు చుట్టు ప్రక్కల వారిని,  ఇటు ఫర్టిలైజర్ షాపు సిబ్బంది... పార్టనర్లు... అటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోని భాగస్వాములను, బంధువులను కూడా విచారించినట్టు కూడా తెలుస్తోంది. 

Also Read: ఎమ్మెల్యే సోదరి కుటుంబం మృతిలో కొత్త ట్విస్ట్: డైరీలో కీలక ఆధారాలు

విచారణ ఇలా సాగుతున్న నేపధ్యంలో... కరీంనగర్ లోని సత్యనారాయణ రెడ్డి ఫర్టిలైజర్ షాపులో ఓ డైరీ మాత్రం పోలీసులకు లభించినట్టు సమాచారం. పోలీసులు ఈ డైరీని స్వాధీనం చేసుకున్నారని... ఈ డైరీలో పలు కీలక ఆధారాలు పోలీసుల దృష్టికి వచ్చాయని తెలుస్తోంది. అయితే డైరీలో ప్రధానంగా... తనకు సంబంధించిన ఆస్తులను... తన తర్వాత... తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అప్పగించాలని రాసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే అనేక అనుమానాలతో సతమతమవుతున్న పోలీసులకు... ఇప్పుడు ఈ కొత్త ట్విస్ట్ మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. సత్యనారాయణ రెడ్డికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. కరీంనగర్ లోని బ్యాంకు కాలనీలో ఆయనకు మూడు నుంచి నాలుగు అంతస్థుల భవనం, ఫర్టిలైజర్ షాపులు ఉన్నాయి. అంతే కాకుండా వ్యవసాయ భూములు ఉన్నట్టుగా తెలుస్తోంది.  వీటి విలువ కూడా కోట్ల రూపాయల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాంటి తన ఆస్తులను... ముందుగానే తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అప్పగించాలని రాయడంతో... నారెడ్డి సత్యనారాయణ కుటుంబం ఆత్మహత్యకు ఏమైన పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Also Read: కాకతీయ కెనాల్ లో కారు... కుళ్లిన స్థితిలో ఎమ్మెల్యే సోదరి, ఆమె భర్త, కూతురు

ఇందులో భాగంగానే... తన కారును... నిండుగా ప్రవహిస్తున్న కాకతీయ కెనాల్లోకి తీసుకెళ్ళారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఆతహత్య నిజమైతే... సత్యనారాయణ రెడ్డి ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో అనే కోణంలో కూడా విచారణ సాగిస్తున్నారు. 

ఈ కేసు విషయంలో పోలీసులు ప్రతి అంశాన్ని క్షణ్ణంగా పరీశీలిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం సత్యనారాయణ రెడ్డి డైరీలో వెలుగు చూసిన అంశాల పై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం ప్రమాదం వెలుగు చూసిన విషయం ఒకసారి చూసుకుంటే... గత జనవరి 27వ తేదీ నుండి కనబడకుండా పోయిన నారెడ్డి సత్యనారాయణ రెడ్డి... ఆయన కుటుంబ సభ్యులు... 20 రోజుల తర్వాత... గత నెల 17వ తేదీన... కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం యాదవుల పల్లి వద్ద కారులో విగత జీవులై కనిపించారు. 

బైకు పై వెళ్తూ ప్రమాదానికి గురైన ఓ మహిళ ఆచూకి కోసం... పోలీసులు కాకతీయ కెనాల్ కు నీటి సరఫరాను నిలిపివేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ప్రాథమికంగా ప్రమాదంగా కేసును నమోదు చేసుకున్న పోలీసులు... అనంతరం ఈ కేసు మిస్టరీని చేధించేందుకు లోతైన దర్యాప్తు చేపట్టారు. 

సత్యనారాయణ రెడ్డి డైరీ విషయంపై కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి స్పందించారు. సత్యనారాయణ రెడ్డి షాప్ లో కొన్ని వస్తువులు దొరికాయని, అంతే కాకుండా ఆయనకు సంబంధించిన డైరీల పలు కీలక అధారాలు లభించాయన్నారు. అయితే డైరీలో రాసింది సత్యనారాయణ రెడ్డి చేతి రాతేనా... కాదా... అనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ డైరీని హ్యాండ్ రైటింగ్ ఎక్స్ పర్ట్స్... ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కు పంపించామన్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నందున అన్ని విషయాలు చెప్పలేమన్నారు.