ఇబ్రహీంపట్నం: అబ్దుల్లాపూర్‌మెట్ లో ఎమ్మార్వో దారుణ హత్య తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగుల్లో భయాందోళన మొదలయ్యింది. కార్యాలయాల్లో ప్రజలను కలిసేందుకు... వారి నుండి దరఖాస్తులు స్వీకరించే సమయంలోనే జాగ్రత్త పడుతున్నారు. ఇలా జగిత్యాల జిల్లాలోని ఓ మండల కార్యాలయ సిబ్బంది అయితే కార్యాలయంలోకి ఎవరినీ రానివ్వకుండా అతి జాగ్రత్త ప్రదర్శిస్తున్నారు.  

ఇబ్రహీంపట్నం మండల తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు ప్రజల నుండి దరఖాస్తులను కిటికిలో నుంచే తీసుకుంటున్నారు. వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన వారిని లోపలికి అనుమతించడం లేదు. ఇలా కేవలం ఎమ్మార్వో మాత్రమే కాదు మిగతా సిబ్బంది కూడా అతిజాగ్రత్త ప్రదర్శిస్తున్నారు.

read more ఎమ్మార్వో విజయారెడ్డి ఇంటికి సురేష్: భర్త సుభాష్ రెడ్డితో భేటీ, అందుకోసమేనా?

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య అనంతరం రెవెన్యూ సిబ్బంది విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఇలా వారం తర్వాత విధుల్లోకి చేరిన రెవెన్యూ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. 

ఇలా ఇబ్రహీంపట్నం ఎమ్మార్వో కార్యాలయంలో కూడా భద్రతాచర్యలు చేపట్టారు. ఒకవేళ అత్యవసర పనిపై ఎవరినైనా కార్యాయంలోకి పిలిస్తే గేటు వద్ద వారిని వీఆర్‌ఏలు తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.  

read more  Tahsildar vijayareddy: నా భర్త అమాయకుడు.. నిందితుడు సురేష్ భార్య

విజయారెడ్డి హత్య అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. ఈ ఘనటతో కొందరు రైతులు తమ తీరును మార్చుకున్నారు. తమ భూముల విషయంలో ఇబ్బంది పెడుతున్న అధికారులను చేతిలో పెట్రోల్ పట్టుకొని బెదిరిస్తుండటం గమనార్హం. ఇలాంటి సంఘటనే ఇటీవల శ్రీకాకుళంలో చోటుచేసుకుంది.

 శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మం డలం దూకలపాడులో బుధవారం వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో రైతు భరోసా గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకొచ్చిన అల్లు జగన్‌మోహనరావు అనే రైతు గ్రామ పంచాయతీ కార్యదర్శి జె.సుమలతపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.

‘నా పొలంలో మురికి కాలువ తవ్విస్తావా.. నాకు ప్రభుత్వం నుంచి ఏ పథకం రాకుండా చేస్తావా’ అంటూ దూషించాడు. ‘నిన్ను పెట్రోల్‌ పోసి చంపేస్తా.. నేనూ పెట్రోల్‌ పోసుకుంటా’ అంటూ బ్యాగ్‌లోంచి పెట్రోల్‌ బాటిల్‌ తీసి తన శరీరంపై పోసుకోబోయాడు. స్థానికులు అడ్డుకోవడంతో సభలో ఉన్న అధికారులు, ఇతరులపై పెట్రోల్‌ పడింది.

అగ్గిపుల్ల తీయడానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో మహిళా అధికారులు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. పంచాయతీ కార్యదర్శి సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రైతును అదుపులోకి తీసుకున్నారు.