ప్రేమ పేరిట వంచన...ప్రియుడి కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి యువతి నిరసన
ప్రేమించిన వాడి చేతిలో మోసపోయిన ఓ యువతి న్యాయం కోసం రోడ్డెక్కిన ఘటన కరీంనగర్ జిల్లాలోని మానుకొండూరు పరిధిలో చోటుచేసుకుంది.
కరీంనగర్: ప్రేమించిన వాడి చేతిలో మోసపోయిన ఓ యువతి న్యాయం కోసం రోడ్డెక్కిన ఘటన కరీంనగర్ జిల్లాలోని మానుకొండూరు పరిధిలో చోటుచేసుకుంది. తనను ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న యువకునిపై చర్యలు తీసుకోవాలంటూ రవళి అనే యువతి న్యాయపోరాటానికి దిగింది.
ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మానుకొండూరు సమీపంలోని చెంజర్ల గ్రామానికి చెందిన రవళి ఖాదర్ గూడెం గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. దీంతో ఇద్దరి ఇష్టప్రకారం రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు యువతి తెలిపింది. ఇలా కొంతకాలం తనతో ఎంతో అప్యాయంగా వున్న ప్రియుడు ఇప్పుడు తనను దూరం పెడుతున్నాడని... మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని రవళి ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలంటూ ప్రియుడి స్వగ్రామం ఖాదరగూడెంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి రవళి నిరసనకు దిగింది. తెల్లవారుజామునే వాటర్ ట్యాంక్ ఎక్కి తన ప్రియున్ని తనకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేస్తోంది.
read more తన తండ్రితో భార్యకు అక్రమసంబంధం...అనుమానంతో ఇద్దరినీ నరికిచంపిన దుర్మార్గుడు
ఇలా ఆగస్ట్ ఫస్ట్ న కూడా తనకు న్యాయం చేయాలంటూ రవళి గ్రామ పంచాయితీ కార్యాలయం ముందు ఆందోళన చేసింది. అయితే ఆమెకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించడంతో తన స్వగ్రామమైన చెంజర్లకు వెళ్లిపోయింది. ఆ మరుసటి రోజు తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోతో పాటు ఓ లేఖ కూడా రాసింది. అయితే ఆమె కుటుంబసభ్యులు వద్దని వారించడంతో తన ప్రయత్నాన్ని విరమించుకుని మళ్లీ పోరాటం చేస్తోంది.
ఇక ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామునే ఖాదరగూడెం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు యువతికి నచ్చజెప్పి కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు.