కరీంనగర్ జిల్లాలో ''కేసీఆర్ వనం''..ఆ ఎమ్మెల్యే ఆలోచనే: మంత్రి గంగుల

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి నీళ్లతో పాటు పచ్చని చెట్లు ఎంతో ఇష్టమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. 

gangula kamalakar review meeting over harithaharam

కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి నీళ్లతో పాటు పచ్చని చెట్లు ఎంతో ఇష్టమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీలలో ప్రత్యేక దృష్టితో హరితహారం నిర్వహిస్తున్నామని అన్నారు. కాంక్రీట్  జంగల్ గా ఉన్నకరీంనగర్ ను హరిత వనంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు అధికారులు కసిగా పని చేయాలని మంత్రి సూచించారు. డిఎంఎఫ్‌టీ నిధుల నుండి హరితహారానికి ఒక కోటి రూపాయలు కేటాయిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో హరితహారం, రైతు వేదికలు, రైతు కల్లాల నిర్మాణాల పురోగతిపై కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్, అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ... జిల్లా కేంద్రంలో అందమైన పూల మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఈ జిల్లా అడవుల పెంపకంలో చాలా వెనుకబడి ఉందని అన్నారు.

 చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచన మేరకు వెదురుగట్ట అడవికి  "కేసీఆర్ వనం" అని నామకరణం చేసి తీర్మానం చేశామన్నారు. వెదురుగట్ట హరితహారం లో భాగంగా అద్భుతంగా మొక్కలు నాటారని మంత్రి రవిశంకర్ ను అభినందించారు. కురిక్యాల గ్రామంలోని బొమ్మలగుట్టను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు

హరితహారం కింద కరీంనగర్ నగర పాలక సంస్థ కు 50 లక్షలు, చొప్పదండి మున్సిపాలిటీ 30 లక్షలు, కొత్తపల్లి మున్సిపాలిటీకి 20 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. హరితహారం కార్యక్రమానికి నిధుల కొరత  లేకుండా ఉండేందుకే ఇప్పటికే మున్సిపల్ నిధులతో పాటు గ్రీన్ ఫండ్, డిఎంఎఫ్టి  నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని 14.5 కిలో మీటర్ల ప్రధాన రహదారులతో పాటు, జిల్లా సరిహద్దుల వరకు గల ఆర్&బి రోడ్లకు ఇరువైపులా సాధ్యమైనంత వరకు 2 లేదా 3 వరుసలు చెట్లు నాటాలని అధికారులకు సూచించారు.

read more  కరోనా నుండి రక్షించుకోవాలంటే... ఇలా చేయాల్సిందే: హరీష్ రావు

హరితహారం కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధి తో నిర్వహించాలని పేర్కొన్నారు. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని... నాటిన మొక్కలు 80శాతం ఖచ్చితంగా కాపాడాలని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమ పదవులు కూడా కోల్పోవాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు జవాబుదారీతనంతో పని చేసి హరితహారం లో అద్భుత ఫలితాలు రాబట్టలని సూచించారు. 

దసరా కల్లా రైతు వేదికలు, రైతు కల్లాలు పూర్తి కావాలని మంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. రైతు కల్లాల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.750 కోట్లు కేటాయించిందని, ఒక్కో నియోజకవర్గానికి 1000 చొప్పున 1లక్ష రైతు కల్లాల నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. కరీంనగర్ జిల్లాలో 2318 మంది రైతులు  కల్లాలు నిర్మించేందుకు  రైతులు దరఖాస్తు చేసుకున్నారని... ఇందుకోసం జిల్లాకు 22కోట్లు నిధులు మంజూరు కాబడ్డాయని పేర్కొన్నారు.

అర్హులైన రైతులు దసరాకల్లా నిర్మాణాలు పూర్తి చేయాలని... దానికి తగ్గట్లుగా అధికారులు చొరవ చూపాలని తెలిపారు. జిల్లాలో చిన్న, సన్నకారు, పెద్ద రైతులు జాతీయ ఉపాధిహామీ పథకం కింద పంటను ఆరబెట్టుకోవడానికి వీలుగా సొంత పొలంలో సిమెంట్‌ కల్లాలు నిర్మించుకోవడానికి  దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కల్లాల నిర్మాణానికి ఆసక్తిగల రైతులు తమ పేర్లు సంబంధిత ఎంపీడీవో, ఏఈఓ దగ్గర నమోదు చేసుకోవాలని సూచించారు. ఒక్కో కల్లం యూనిట్‌ కాస్ట్‌ 50 చదరపు మీటర్లకు రూ. 56వేలు, 60 చదరపు మీటర్లకు రూ.68 వేలు, 75 చదరపు మీటర్లకు రూ.85వేలుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 

బీసీ, జనరల్‌ రైతులకు యూనిట్‌ కాస్ట్‌ 10 శాతం డబ్బులు వాటాగా చెల్లించాల్సి ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తి ఉచితంగా కల్లాలు నిర్మిస్తారన్నారు. ఈ కల్లాల నిర్మాణానికి ఆసక్తిగల రైతులు సెల్ప్‌ హెల్ప్‌ గ్రూపు మెంబర్స్‌ అయి ఉండాలన్నారు. ఉపాధిహామీ జాబ్‌కార్డు ఉన్న రైతులు అర్హులన్నారు. రైతులు ముందుగా సొంత ఖర్చులతో సూచించిన కొలతలు, నియమాలతో కల్లాలు నిర్మించుకోవాలన్నారు... ప్రభుత్వం రెండు విడుతల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందని మంత్రి గంగుల వెల్లడించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios