కరీంనగర్: కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయాలపై దృష్టి పెడతామని... ఒక్కసారి ఎన్నికలు అయిపోగానే ప్రజా సంక్షేమంపైనే తామంతా దృష్టి పెడతామన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ పదవులు అనేవి ప్రజలు ఇచ్చిన బిక్ష అని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. 

కరీంనగర్ మేయర్ గా యాదగిరి సునీల్ రావు శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరీంనగర్ అభివృద్ధికి ఎంపీ బండి సంజయ్ సహకరించాలని కోరారు. తీగల గుట్టపల్లి సమీపంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

20 సంవత్సరాల క్రీతం ఇదే మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా గెలిచి రాజకీయ రంగ ప్రవేశం చేశానని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేసుకున్నారు. కరీంనగర్ అభివృద్ధి మెట్టు అయితే.... పాలక వర్గ సబ్యుల ప్రవర్తన, నడవడి మరో మెట్టు అన్నారు. పాలకవర్గ సభ్యులు చక్కటి నడవడి...ప్రవర్తన చాలా ముఖ్యమని... అదే మరో సారి గెలుపు దారి తీస్తుందన్నారు.

read more  టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ కే ట్రబుల్: అక్కడికే హరీష్ రావు పరిమితం

పాలక వర్గ సభ్యులు ఏం చేస్తున్నారనేది ప్రజలు గమనిస్తారన్నారు. ఈ పాలకవర్గంలోని 60 మంది సభ్యులు సమానమే...వీరిని ప్రభుత్వం సమానంగా చూస్తుందన్నారు. అయితే ప్రజలు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దని... జవాబు దారి తనంగా ఉండి నీతివంతమైన పాలన అందించాలని సూచించారు.

 పాలక వర్గం ముందుకు సాగాలంటే అధ్యక్ష స్థానం చాలా ముఖ్యమని... అందుకే మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోవడం జరిగిందన్నారు. మేయర్ సునీల్ రావు నేతృత్వంలో పాలక వర్గం, అధికారులు జవాబు దారితనంగా పని చేస్తారని నమ్మకం తనకు ఉందన్నారు. పదవులు కేవలం అలంకారం కావద్దని... గర్వం ఉండకుండా పాలక వర్గం ప్రజలకు దగ్గరుండి పని చెయ్యాలని మంత్రి సూచించారు. 

పాలక వర్గం నడిచే ప్రతి అడుగు అభివృద్ధి వైపు ఉండాలన్నారు. మున్సిపల్ లో ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు సహజమేనని... అయితే ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచి నగరాన్ని అభివృద్ధి పరచాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు రాబట్టి పనులు చేసే భాద్యత తనదని అన్నారు. 

read more  ఒకే ఫ్రేములో కేసీఆర్, రేవంత్: చేతిలో చెయ్యేసి.... చూడడానికి రెండు కళ్ళు చాలవు

ఇప్పటకే కరీంనగర్ కు రాష్ట్ర ప్రభుత్వం 350 కోట్లు విడుదల చేసిందన్నారు. ఆ నిధులతో ఇప్పటీ కొన్ని అభివృద్ధి పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు.  ఇంకా కొన్ని అభివృద్ధి పనులు చేసి నగరాన్ని సుంధరంగా తయారు చేస్తామని... స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా కూడ నగర అభివృద్ధి జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కరీంనగర్ రెండో మహానగరంగా మారబోతోందని అన్నారు. మానేరు రివర్ ఫ్రంట్, ఐటీ టవర్, సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇవన్ని నగరానికి  మరిన్ని హంగులు తెస్తామని మంత్రి గంగుల వెల్లడించారు. 

 మేయర్ గా యాదగిరి సునీల్ రావు పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం కరీంనగర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ పదవ తరగతిలో 9.5గ్రేడు సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తామన్న ఫైలుపై మేయర్ తొలి సంతకం చేశారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో సునీల్ పాల్గొన్నారు
.