కరీంనగర్: తమ పార్టీకి చెందిన రెబల్ అభ్యర్థులను బెదిరించినట్లుగా తనపై వచ్చిన ఆరోపణలను మంత్రి గంగుల కమలాకర్ కొట్టిపారేశారు. తాను ఎవ్వరినీ బెదిరించలేదు కానీ కొందరిని నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని బ్రతిమాలినట్లు తెలిపారు. అలారేకుర్తికి చెందిన టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిని బ్రతిమాలిన మాట మాత్రం నిజమన్నారు.

ఎంఐఎం పార్టీతో తాము ఒప్పందం చేసుకుని మేయర్ పదవి ఇస్తామని అంగీకరించినట్లుగా బీజేపీ నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 10 డివిజన్లలో పోటీ చేసే ఎంఐఎంకు మేయర్ పదవి ఎలా ఇస్తామనుకుంటున్నారని ప్రశ్నించారు.  కరీంనగర్ లో తమ మేయర్ అభ్యర్థిని కేసీఆరే నిర్ణయిస్తారని..సీల్డ్ కవర్ లో ఎవరి పేరు వస్తే వారే మేయర్ అని అన్నారు. 

read more  జమ్మికుంటలో దూసుకుపోతున్న కారు... ఈటల సమక్షంలో భారీగా చేరికలు

దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పేదలందరికీ ఎందుకు ఇళ్లు కట్టివ్వలేదని మంత్రి ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు కనీసం అభ్యర్థులు కూడా దొరకలేదని...  అలాంటి వారు తమను ఎదుర్కోగలమని ప్రగల్భాలు పలుకుతున్నారని మంత్రి గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీఆర్ఎస్ పార్టీ తమకు కన్న తల్లితో సమానమని... ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆరే తమ బాస్ అని గంగుల అన్నారు. కేసీఆర్ దగ్గర తాము కేవలం కార్యకర్తలమేనని తెలిపారు. అబివృద్ది పనులు జరగాలంటే టీఆర్ఎస్ పార్టీకే ఓటేసి గెలిపించాలని సూచించారు. 

కరీంనగర్ అభివృద్ధి కి తానే బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ లో ప్రస్తుతం రూ.700 కోట్లతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రం లో హైదరాబాద్ తర్వాత రెండవ అతి పెద్ద నగరంగా కరీంనగర్ రూపుదిద్దుకొంటుందని.... ఆ దిశగానే అభివృద్ది పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 

read more   కేసీఆర్, కేటీఆర్‌లను కట్టేసి కొట్టినా పాపం లేదు: కోమటిరెడ్డి సంచలనం

కరీంనగర్ లో ఆరు నెలలలోపు 24 గంటల నీరు ఇంటింటికీ అందిస్తామన్నారు. ఇప్పటివరకు కేవలం చెప్పింది చేయడం కాదు చెప్పనిది కూడ చేశామన్నారు. మానేరు రివర్ ఫ్రాంట్ ను మార్చి 15 న ప్రారంభిస్తామని... దీని వల్ల ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. కరీంనగర్ లో ఎక్కడ అవినీతి జరగకుండా చూసుకుంటానని... అలా జరిగితే తానే బాధ్యత వహిస్తానని అన్నారు.