కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాక గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ దంపతులను గుర్తుతెలియని అగంతకులు గొంతుకోసి అతి దారుణంగా హత్యచేశారు. దుండగుల దాడిలో దంపతులు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలారు. 

ఈ జంట హత్యలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కొండపాక గ్రామానికి గతంలో పూరెల్ల పోశాలు ఎంపిటీసిగా పనిచేశాడు. అయితే అతడు మంగళవారం  మద్యాహ్నం భార్య పూరెల్ల సుశీలతో కలిసి పొలం పనుల కోసం తమ వ్యవసాయ భూమి వద్దకు వెళ్లారు. కానీ వీరి కదలికపై ముందే సమాచారాన్ని అందుకున్న గుర్తు తెలియని వ్యక్తులు చుట్టుపక్కల ఎవ్వరూ లేని సమయాన్ని చూసి పదునైన ఆయుధంతో వారిద్దరి గొంతులుకోసి పరారయ్యారు. ఈ దాడితో రక్తను మడుగులో పడిపోయిన దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. 

read more  సోషల్ మీడియాలో వేధింపులు.. యువకుడు అరెస్ట్

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ దంపతులిద్దరికీ ఇంటి సమీపంలోనే మూడెకరాల భూమి ఉండేదని, ఈ విషయంలో వేరే వారితో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని సమాచారం. దీనిపై కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి. పొలంలో గెట్ల పంచాయితీ కారణంగా పోశాలు తన ప్రత్యర్థులతో పలు మార్లు తగవు పెట్టుకున్నట్టు స్థానికులు పోలీసులకు వివరించారు. 

అయితే దంపతుల హత్యకు పాల్పడిన వారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. భూ తగదాలే భార్య, భర్తలా మరణాలకు కారణమా? ఒకవేళ అయితే ఇందులో ఎంతమంది పాల్గొన్నారో తెలుసుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.