రాజకీయాల్లో హత్యలుండవు... ఆత్మహత్యలే: మరోసారి ఈటల కీలక వ్యాఖ్యలు
ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల్లో నాయకులు ఎదగాలంటే ఓపిక చాలా అవసరమని... క్షణికావేశంతో తీసుకునేే నిర్ణయాలు పనిచేయవని మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ప్రదాన పార్టీలన్నీ రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగా హుజూరాబాద్ లో మంత్రి ఈటల రాజేందర్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇప్పటివరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనేవే లేవన్నారు. ఆ పార్టీలు ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో గెలవలేదన్నారు. కాబట్టి మరోసారి ఇక్కడి ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారన్న నమ్మకం వుందన్నారు.
కేంద్ర ప్రభుత్వ డబ్బులతో రాష్ట్ర పథకాలు అమలవుతున్నాయని బిజెపి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. అయితే కేంద్రం నేరుగా డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టమని చెప్పదని ఈటల తెలిపారు. గతంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఇలాగే మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసిందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం మసిపూసి మాయ చేయడానికి మరోసారి ప్రయత్నిస్తోందని... దాన్ని ఎవ్వరూ నమ్మవద్దని సూచించారు.
read more బహిరంగంగా ఈటల.. లోలోపల హరీష్ .. జగన్‌కు షాక్ ఇచ్చే పనిలో నటుడు
రాజకీయాల్లో క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం పనిచేయదని... అలా నిర్ణయాలు తీసుకున్నవారు పైకి రాలేరన్నారు. రాజకీయంలో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయంటూ ఈటల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
మరికొద్దిరోజుల్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అందరినీ కలుపుకుపోయే వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు అన్నింటిని టీఆర్ఎస్ గెలుచుకోవాలని... ఆ దిశగా పార్టీ అధినాయకత్వం కూడా పనిచేస్తోందన్నారు.
దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో 32 జిల్లా పరిషత్ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో కూడా అన్ని గెలుచుకోవాలని అన్నారు. కాంగ్రెస్, బిజెపిలకు ఎన్నికలంటేనే వణుకు పుడుతోందని.... అవి మేల్కొనే లోపే ఎన్నికలు అయిపోతాయని ఎద్దేవా చేశారు.ఎన్నికల అనంతరం కౌన్సిలర్ల అభిప్రాయం మేరకే చైర్మన్లను ఎన్నుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
''ఇండియా లౌకిక దేశం. అన్ని మతాలు వర్గాలు కలిసిమెలిసి ఉండే స్వేచ్ఛ. స్వతంత్రం ఉంది. దాన్ని కాపాడే బాధ్యత పాలకులపై ఉంది. ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవద్దు. అవి మంచివి కాదు.శాంతి సౌభ్రాతృత్వం పెంచే విధంగా పాలకులు ఉండాలి. డిస్ట్రక్షన్ తేలిక కానీ కన్స్ట్రక్షన్ చాలా కష్టం. లౌకిక స్ఫూర్తి దెబ్బతీసే విధంగా కాకుండా.. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ప్రజలు సంయమనం ఓపిక వహించాలి'' అని ఈటల వెల్లడించారు.
read more మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి సుప్రీం షాక్: హైకోర్టు నిర్ణయానికి సమర్థన
సీఎస్‌ఎస్ కింద సంవత్సరానికి కేవలం 6 నుంచి 7 వేల కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఈటల తెలిపారు. అది కేంద్ర ప్రభుత్వం బిక్ష కాదు కేంద్రానికి మనం కడుతున్న టాక్స్ నుండే మనకు ఇస్తుందన్నారు. రాష్ట్రానికి వేల కోట్లు ఇస్తున్నామని చెప్పడం అబద్ధమని... అలా ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వరని ఈటల తెలిపారు.