శానిటైజర్ తో వండిన చికెన్ తిని... ప్రాణాలమీదకు తెచ్చుకున్న కూలీ
కరోనా వైరస్ కాదు ఆ భయమే ఓ వ్యక్తి ప్రాణాలమీదకు తెచ్చిన విషాద సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
హుజురాబాద్: కరోనా వైరస్ కాదు ఆ భయమే ఓ వ్యక్తి ప్రాణాలమీదకు తెచ్చిన విషాద సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. కరోనా సోకకుండా ఉపయోగించే శానిటైజర్ తో ఏకంగా చికెన్ కర్రీనే చేసి తిని ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడో వ్యక్తి. ఇలా అతిజాగ్రత్తతో ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు.
ఈ ఘటనకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పాపక్కపల్లి గ్రామానికి చెందిన యాకుబ్ దినసరి కూలీ. భార్యా, ముగ్గురు పిల్లలతో కలిసి గ్రామంలోనే నివసిస్తున్నాడు.
అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో వుంచుకుని ముందుజాగ్రత్తలో భాగంగా అతడు నిత్యం శానిటైజర్ ను వినియోగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే శానిటైజర్ ను ఆహార పదార్థాల్లో కలుపుకుంటే కరోనా అస్సలు దరికి చేరదని భావించాడో ఏమో తినే చికెన్ లో దాన్ని కలిపాడు. ఇలా శానిటైజర్ తో వండిన చికెన్ ను భార్యాపిల్లలు తినకపోవడంతో ఒక్కడే తిన్నాడు.
read more కరోనా నుంచి కోలుకున్నాకే అసలు ప్రమాదం.. ఇలా చేయడం తప్పనిసరి: డాక్టర్ శ్రీకాంత్ హెచ్చరిక
ఇలా చికెన్ తో పాటే ప్రమాదకరమైన శానిటైజర్ ఒంట్లోకి చేరడంతో యాకూబ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విపరీతంగా వాంతులు చేసుకోవడంతో ఆందోళనకు గురయిన భార్య ఇరుగుపొరుగు వారి సాయంతో వరంగల్ ఏజీఎం కు తరలించింది. అతడికి చికిత్స అందించిన పేగులకు తీవ్రమైన గాయాలయినట్లు... అయితే ప్రాణాలకు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.
కానీ ఈ శానిటైజర్ ప్రభావంతో అతడి కాళ్ళు, చేతులు పనిచేయడం లేదు. ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా వైద్యానికి డబ్బులు లేక హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకున్నాడు. అతడి దీన పరిస్థితి గురించి తెలుసుకున్న స్థానిక నాయకులు ఆర్థికసాయం చేయడమే కాకుండా జిల్లాకు చెందిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల దృష్టికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.