కరీంనగర్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసి షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెట్టాయి. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో కాస్త ముందుంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్రంలోని అన్ని  మున్సిపాలిటీల్లో  ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. 

అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాన్ని దృష్టిలో వుంచుకుని కరీంనగర్ వంటి పట్టణాలపై టీఆర్ఎస్ మరింత దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇతర పార్టీలకు చెందిన నాయకులను పార్టీలో చేర్చుకుని బలాన్ని ప్రదర్శించేందుకు మంత్రి గంగుల కమలాకర్ ప్రయత్నిస్తున్నారు. ఇలా  బుధవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ కుర్ర తిరుపతిని స్వయంగా మంత్రి గంగుల టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.  

క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో తిరుపతికి మంత్రి గంగుల పార్టీ కండువా కప్పి చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు ఎమ్మెల్సీ నారదాసు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, మాజీ కార్పొరేటర్ సునీల్ రావు, పలువురు మాజీ కార్పొరేటర్లు, టిఆర్ఎస్ పార్టీ  నాయకులు తదితరులు పాల్గొన్నారు.

read more  మున్సిపల్ ఎన్నికలే టార్గెట్... టీఆర్ఎస్ నేతల ఇళ్లలోనే ఆ యంత్రాంగం: ఈసికి బిజెపి ఫిర్యాదు

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని సాధించడం ఖామయని ధీమా వ్యక్తం చేశారు. 

మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని... రెండవ స్థానం కోసమే కాంగ్రెస్, బిజెపిలు పోటీ పడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ దయతో తనకు మంత్రి పదవి లభించిందని అన్నారు. అభివృద్ధి పనులు జరగాలంటే ప్రతిపక్షం లేకుండా టీఆర్ఏస్ పార్టీకి పట్టం కట్టాలని అన్నారు. 

అభివృద్ధిని ఆకాంక్షించే పార్టీ టిఆర్ఎస్ అని...అభివృద్ధి నిరోధక పార్టీ బిజెపి అని అన్నారు. కరీంనగర్ బిజెపి ఎంపీ బండి సంజయ్ ప్రధాన మోడీ, అమిత్ షా, గవర్నర్ తమిళసై తో పాటు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి స్మార్ట్ సిటీ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. 

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి ఒక్కరు కార్పొరేటర్ గా గెలిచిన అభివృద్ధిని అడ్డుకుంటారన్నారు. టిఆర్ఎస్ గెలిస్తేనే కరీంనగర్ అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. 

read more  రెడ్డి, వెలమ బలుపు వ్యాఖ్యలు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ యూటర్న్

ఐటీ టవర్ లో 18 కంపెనీలు తమ సంస్థ నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయని...ప్రస్తుతానికి ఐటీ టవర్ ప్రారంభోత్సవం మాత్రమే ఆగిందన్నారు. ఉద్యోగుల నియామక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 

ఈ మున్సిపల్ ఎన్నికల్లో  పోటీచేసే అభ్యర్థుల ఎంపికను పారదర్శకంగా చేపడతామన్నారు. పార్టీకి విధేయతగా ఉండటంతో పాటు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే వారికే టికెట్ లకు ఇస్తామని మంత్రి గంగుల తెలిపారు.