పురపోరులో టీఆర్ఎస్ జోరు... మంత్రి గంగుల వ్యూహాలకు ప్రతిపక్షాలు చిత్తు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పురపాలక ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తూ పోలింగ్ కు ముందే పలువురు టీఆర్ఎస్ అభ్యర్ధుల ఎన్నికను ఏకగ్రీవం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతామని గ్రహించి బీజేపీ, కాంగ్రెస్ లు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నాయని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. సోమవారం కొత్తపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు పుప్పాల మల్లేశం, కరీంనగర్ నగరపాలక సంస్థ 33 డివిజన్ కు చెందిన ఉయ్యాల ప్రణీత శ్రీనివాస్ గౌడ్ తమ నామినేషన్ లను ఉపసంహరించుకొని టీఆర్ఎస్ లో చేరారు. వీరిద్దరు మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి స్వయంగా వారిద్దరికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ... టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఇప్పటికే తేలిపోయిందన్నారు. దీన్ని గ్రహించే టీఆర్ఎస్‌ను ఇబ్బందిపెట్టడానికి ప్రతిపక్షాలు మెంటల్ గేమ్ మొదలుపెట్టినాయని అన్నారు. అందులోభాగంగానే టీఆర్ఎస్ లోని రెబల్ అభ్యర్థులకు గాలం వేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ లకు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌లు డిపాజిట్ ల కోసం కొట్లాడాలని అన్నారు. తెలంగాణలో బీజేపీకే ఉనికే లేదని, కార్యకర్తలూ లేరనిఅందువల్లే ఇతర పార్టీలనుండి వచ్చే నాయకులపై ఆధారపడి ఉన్నారని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ బలం తగ్గిపోతోందని... తెలంగాణలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉందని అన్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే తెలంగాణలో బీజేపీని ఎవరూ పట్టించుకోవడం లేదని, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు లాంఛనమేనని విషయం అందరికీ తెలుసని అన్నారు.
read more బీజేపీ బీ-ఫారంలా.. వద్దు బాబోయ్ అంటున్నారు: కేటీఆర్ సెటైర్లు
జెడ్పీ ఎన్నికల మాదిరే ఈసారి కూడా టీఆర్ఎస్ జెండా ఎగరడం గ్యారంటని అన్నారు.
ఎందుకంటే పట్టణ ప్రాంతాల ప్రజల కోసం ఈ ప్రభుత్వం 150కిపైగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, స్వయంగా కేటీఆరే మున్సిపల్ మంత్రి కాబట్టి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారని అన్నారు. ఫలితంగా పట్టణాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని, ఏ రకంగా చూసినా కాంగ్రెస్, బీజేపీలను మన రాష్ట్రంలో ఎవరు పట్టించుకోవడం లేదని అన్నారు.
బీజేపీ కాంగ్రెస్ లకు కార్యకర్తల బలం గానీ జనం బలం లేదని అన్నారు. గత చరిత్ర బాగాలేదని... మార్గదర్శకత్వం చేసే నాయకత్వమూ కరువయిందని అన్నారు. మతాలను రెచ్చగొట్టి గెలవాలని బీజేపీ భావిస్తోందని అన్నారు. తెలంగాణలో మత రాజకీయాలు నడవబోవని టీఆర్‌ఎస్‌ను అందుకోలేనంత దూరంలో కాంగ్రెస్ వెనకబడిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసాల రమేష్, మాజీ కోఆప్షన్ సభ్యులు జమీలుద్దీన్, సునిల్ రావు, కర్ర రాజశేఖర్ లు తదితరులు పాల్గొన్నారు.