కరీంనగర్: మున్సిపల్ ఎన్నికల్లో బుధవారం వరకు బిజీగా గడిపిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వ్యక్తి గత సెక్యూరిటీకి కూడా అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అయన భద్రతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఎంపీ సంజయ్ ఫోన్‌ కూడా స్విచాఫ్‌ రావడంతో వారు మరింత ఆందోళన పడుతున్నారు.

తన ప్రచారంలో రాళ్ల దాడి జరిగిందని బండి సంజయ్‌ చెబుతుండగా అలాంటిది ఏమీలేదని కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి ప్రకటించారు. దీంతో ఇరువురి మధ్య వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది.కాగా బుదవారం రాత్రి బీజేపీ నాయకులు గాయత్రిపై తెరాస దాడి చేయగా ఆ విషయమై పోలీసులతో చర్చించినప్పుడు వివాదం మరింత ముదిరిందని కార్యకర్తల అనుమానం.

 భద్రతా కల్పిస్తామని చెప్పినప్పటికీ అయన వద్దని వారించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ లో పోలీసులు తనపై దాడి చేశారని ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టడంతో గత కొద్దీ రోజులుగా పోలీసులకు ఎంపీ కి మధ్య వివాదం ముదురుతుండటం గమనార్హం.ఈ నేపథ్యంలో సంజయ్ విశ్రాంతి కోసం ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారా లేదా పోలీసులతో వివాదం కారణంగా అజ్ఞాతంలోకి లోకి వెళ్లారా అనేది తెలియడం లేదు. 

ఇదిలావుంటే, బండి సంజయ్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో తనపై జరిగిన రాళ్ల దాడి ఘటన అవాస్తవమని  కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ప్రకటించడాన్ని ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. 

read more  ఎంపీ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు: సీపీ కమలాసన్ రెడ్డి ప్రకటన ఇదే

ఎలాంటి దాడి జరగక పోతే...  2 రోజుల క్రితం భద్రత పెంపు, బాంబు స్క్వాడ్ కేటాయింపునకు కారణం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.  బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పోలీస్ కమిషనర్  అనుచితమైన ప్రకటనలు చేయడం సరికాదని అన్నారు. భద్రత పెంచాలంటూ తాను ఎలాంటి దరఖాస్తు చేసుకోనప్పటికీ.. భద్రత పెంచారని... ఇందుకు కారణం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. 

ఒకవేళ సాధారణ భద్రత పెంపులో భాగంగానే అదనపు బలగాలను కేటాయిస్తే..  ప్రచారం ముగియడానికి మూడు రోజుల ముందు  అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఏమొచ్చిందో  సీపీయే ఆలోచించుకోవాలని అన్నారు. 

దుండగుల దాడిలో రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు చెందిన ఓ కానిస్టేబుల్ పైన కూడా రాళ్లు పడిన విషయం సీపీకి తెలియదా అని ప్రశ్నించారు. రాళ్లను కూడా రికవరీ చేయడం వాస్తవం కాదా అన్నారు. రాళ్ల దాడి అంశంపై సీపీ కమలాసన్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఎంపీ సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

శర్మ నగర్ లోని పోచమ్మ గుడి ముందు... రాళ్ల దాడి జరిగినా... ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకూడదనే ఉద్దేశంతో బయట పెట్టలేదని ఎంపీ చెప్పారు. ప్రజలు భయబ్రాంతులకు గురి కాకూడదనే ఉద్దేశంతోనే... రాళ్ల దాడి ఘటనను గోప్యంగా ఉంచామని పేర్కొన్నారు. దాడి జరిగిన సమయంలో చుట్టూ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉన్నందున... గొడవలు జరగకుండా సంయమనం పాటించామని అన్నారు. 

రాళ్ల దాడి జరిగిన సమయంలో.. ఈ విషయాన్ని కార్యకర్తలకు తెలిపి... ఆందోళనకు దారి తీసేలా చేయడం కరెక్టా... సంయమనం పాటించడం కరెక్టా అనేది సీపీ కమలాసన్ రెడ్డి  విజ్ఞతకే వదిలేస్తున్నామని బండి సంజయ్ ప్రకటనలో పేర్కొన్నారు. భద్రత పెంచిన నేపథ్యంలో.. మీడియా మిత్రుల ద్వారా రాళ్ల దాడి అంశం బయటకు వచ్చిందని వివరించారు. 

read more  వ్యక్తిగత భద్రతను వదులుకున్న బండి సంజయ్... అందుకేనా...?

ఈ అంశంపై తనకు ఫోన్ చేసి తెలుసుకోవాల్సిన బాధ్యత సీపీకి లేదా అని ప్రశ్నించారు. తనతో మాట్లాడకుండా పత్రికా ప్రకటన ఎలా విడుదల చేస్తారని అని అన్నారు. పోలింగ్ కు ముందు కార్యకర్తల్ని భయాందోళనకు గురి చేయడం కోసమే.... సీపీ పత్రికా ప్రకటన విడుదల చేశారని అన్నారు. ఎలాంటి దాడి జరగలేదని... పరిస్థితులు అన్నీ సవ్యంగానే ఉన్నాయని సీపీ ప్రకటించారు కాబట్టి... తాను భద్రత సిబ్బందిని వెనక్కి పంపినట్టు స్పష్టంచేశారు.  

అదనపు భద్రతా సిబ్బందితో పాటు...  వ్యక్తిగత గన్ మ్యాన్ లను కూడా వెనక్కి పంపినట్టు తెలిపారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ... బీజేపీ కార్యకర్తలను బెదిరించడం కోసం...  పత్రికా ప్రకటన విడుదల చేయడం... సీపీకి అలవాటుగా మారిందని అన్నారు. పార్లమెంటు  సభ్యుడిగా తనను ఉద్దేశించి... ప్రకటన విడుదల చేసే  ముందు కనీసం సంప్రదించక పోవడం... ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 

ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని... తాము కోరుకుంటున్నామని... ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తినా... సీపీ కమలాసన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన తనపై అధికార పార్టీ ప్రతినిధి తరహాలో సీపీ అత్యుత్సాహం తో కూడిన ప్రకటనలు చేయడం  మానుకుంటే మంచిదని హితవు పలికారు.