Frank Caprio: అమెరికాలో ప్రఖ్యాత న్యాయమూర్తి, ‘ప్రపంచంలోనే దయగల జడ్జి’గా పేరుపొందిన ఫ్రాంక్ కాప్రియో (88) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌ చికిత్స పొందుతున్నారు. 

Frank Caprio: అమెరికాలో ప్రఖ్యాత న్యాయమూర్తి, ‘ప్రపంచంలోనే దయగల జడ్జి’గా పేరుపొందిన ఫ్రాంక్ కాప్రియో (88) కన్నుమూశారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ వార్తను ధృవీకరించారు. కాప్రియో కొంతకాలంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఫ్రాంక్ కాప్రియో అమెరికాలోని మున్సిపల్ కోర్ట్ ఆఫ్ ప్రావిడెన్స్ మాజీ చీఫ్ జడ్జి. ఆయన తీర్పులు కరుణ, మానవీయత కలగలిపి ఉండేవి. జరిమానాలు చెల్లించడానికి డబ్బు లేని వారికి కాప్రియో చూపిన సహానుభూతి, సున్నితమైన తీర్పులు ఆయనను ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.

మరణానికి ముందు చివరి వీడియో

మరణానికి 24 గంటల ముందు న్యాయమూర్తి కాప్రియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగపూరిత వీడియో పోస్ట్ చేశారు. “గత సంవత్సరం నేను మిమ్మల్ని నా కోసం ప్రార్థించమని అడిగాను, మీరు అలా చేసినందువల్లనే నేను ఈ కఠిన కాలాన్ని దాటాను. కానీ దురదృష్టవశాత్తు నాకు ఒక ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు నేను ఆసుపత్రిలో ఉన్నాను. దయచేసి మళ్లీ మీ ప్రార్థనల్లో నన్ను గుర్తుంచుకోండి,” అని కాప్రియో తన చివరి సందేశంలో పేర్కొన్నారు.

View post on Instagram

కోట్లాది మంది మనసును గెలిచిన న్యాయమూర్తి

రోడ్‌ ఐలాండ్‌లోని ప్రావిడెన్స్ మునిసిపల్ కోర్ట్ లో జడ్జిగా పనిచేసిన కాప్రియో, “Caught in Providence” షో ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. జరిమానాలు చెల్లించలేని పేదలకు కరుణ చూపుతూ మానవీయ తీర్పులు ఇచ్చేవారు. అందుకే ఆయనను “ప్రపంచంలోనే అత్యంత దయగల న్యాయమూర్తి” అని కొనియాడారు.

కాప్రియో తన వృత్తి జీవితాన్ని ఫ్రాంక్ ప్రావిడెన్స్‌లో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడిగా ప్రారంభించారు. తరువాత న్యాయ విద్య పూర్తి చేసి కోర్టులో సేవలు అందించారు. మానవీయ విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఇచ్చిన తీర్పులతో ఆయన న్యాయ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. ఆయన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండేవి. కాప్రియో ఇన్‌స్టాగ్రామ్‌లో 3.2 మిలియన్ ఫాలోవర్లు ఉండేవారు. అలాగే, ఆయనకు TikTok లో కూడా 1.5 మిలియన్ మంది అనుచరులు ఉన్నారు.

కాప్రియో వారసత్వాన్ని కొనసాగిద్దాం..

ఆగస్టు 20న ఆయన కుటుంబం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటన చేస్తూ, “న్యాయమూర్తి ఫ్రాంక్ కాప్రియో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో దీర్ఘకాల పోరాటం తర్వాత ప్రశాంతంగా కన్నుమూశారు. ఆయన కరుణ, వినయం, ప్రజల పట్ల ఉన్న విశ్వాసం లక్షలాది మందికి ప్రేరణగా నిలిచాయి” అని పేర్కొంది.

ఆయనను కేవలం ఒక గౌరవనీయ న్యాయమూర్తిగానే కాకుండా, ఒక అంకితభావంతో కూడిన భర్త, తండ్రి, తాత, ముత్తాత, స్నేహితుడిగా కూడా గుర్తు చేసుకున్నారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ కరుణతో జీవిద్దామని ఆయన కుటుంబం పిలుపునిచ్చింది.