కొలంబియాలో వింత సంఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం అదృశ్యమైన ఓ మహిళ సముద్రంలో సజీవంగా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొలంబియా సముద్ర తీరంలో నీటిపై తేలుతున్న ఆ మహిళను బుధవారం మత్స్యకారులు రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే దీని వెనుక ఓ విషాదగాథ వుంది. 

తన పేరు ఎంజెలికా గైటన్‌ అని రెండేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్లు వెల్లడించింది. తాను మళ్లీ పుట్టానని, దేవుడు తన మరణాన్ని కోరుకోలేదంటూ గైటన్ ఆనందం వ్యక్తం చేసింది. ఆమె సముద్రంలో దాదాపు ఎనిమిది గంటల పాటు నీటిపైనే తేలుతూ ఉన్నట్లు చెప్పింది. 

‘20 సంవత్సరాలుగా తన భర్త చిత్రహింసలకు గురిచేసేవాడని తీవ్రంగా కొట్టేవాడని గైటన్ వాపోయింది. తనకు ఇద్దరు పిల్లలని వారు చిన్న పిల్లలు కావడంతో అతని నుంచి విడిపోలేక హింసలను మౌనంగా భరించాల్సి వచ్చిందని తెలిపింది.

తన భర్తపై పలుమార్లు పోలీసులకు సైతం ఫిర్యాదు కూడా చేశానని చెప్పింది. అయితే పోలీసులు ఒక్కరోజు మాత్రమే అతడిని జైలులో ఉంచి కౌన్సిలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపించే వారని గైటన్ వెల్లడించింది.

అయినప్పటికీ తన భర్త ప్రవర్తనలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పైగా పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు మరింత కొట్టేవాడని చెప్పింది. అయితే 2018లో తన భర్త చంపాలని చూశాడని.. తనను కాపాడుకునేందుకు ఇంటి నుంచి పారిపాయాను.

కానీ ఆశ్రయం లేకపోవడంతో 6 నెలలు వీధుల్లోనే గడిపాను ఆ తర్వాత తనకు కామినో డిఫే రెస్క్యూ సెంటర్‌లో ఆశ్రయం దొరికిందని గైటన్ పేర్కొంది. అయితే అక్కడ ఉండటానికి అధికారులు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో నిరాశ్రయురాలిని అయ్యానని.. ఏ దిక్కూ లేకపోవడం వల్ల చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కొలంబియా సముద్రంలో దూకినట్లు పేర్కొంది. సముద్రంలో దూకిన ఆనంతరం స్పృహ కోల్పోయానని ఆ తర్వాత ఏం జరిగిందో తనకు గుర్తు లేదని పేర్కొంది.

తనను రక్షించిన వ్యక్తులు నీటిలో అసస్మారక స్థితిలో ఉన్నానని చెప్పినట్లు గైటాన్‌‌ వివరించింది. ఆమెను రక్షించిన మత్స్యకారులు మాట్లాడుతూ.. తాము తీరంలో చేపల వేటకు వెళుతుండగా దూరంగా ఆమె నీటిలో తెలుతూ కనిపించిందన్నారు.

అది ఎంటన్నది తమకు స్పష్టంగా కనిపించకపోవడంతో చెక్క అయి ఉంటుందనుకున్నామన్నారు. కాసేపటకి ఆమె రక్షించాలంటూ చేయి పైకిత్తడంతో ఏంటో చూడటానికి దగ్గరికి వెళ్లామని, అక్కడికి వెళ్లి చూడగా గైటాన్‌ అపస్మారక స్థితిలో కనిపించిందని వారు చెప్పారు.