లావుగా ఉన్నావు.. ఐస్ క్రీం తినొద్దు అన్నాడని... ఓ యువతి ప్రేమికుడిని అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ సంఘటన చైనాలోని ఝుమాడియాన్ లో చోటుచేసుకుంది. కాగా.... ఘటన జరిగి నాలుగు రోజులు కాగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  సెంట్రల్ చైనాలోని ఝుమాడియాన్ కు చెందిన ఝాంగ్ అనే వ్యక్తికి కొద్ది రోజుల క్రితం  వాంగ్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో... ఇద్దరూ కలిసి తిరగడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈనెల 14వ తేదీన ఇద్దరూ కలిసి షాపింగ్ కి వెళ్లారు. అక్కడ వాంగ్ తనకు ఐస్ క్రీమ్ కావాలని  అడిగింది.

దానికి అతను.. అసలే లావుగా ఉన్నావు. మళ్లీ ఐస్ క్రీం తింటే ఇంకా లావు అయిపోతావు. వద్దు అని చెప్పాడు. ఆమె లావుగా ఉందని కాసేపు టీజ్ చేశాడు. దీంతో ఆ యువతికి బాగా కోపం వచ్చింది. ఆ కోపంలోనే దగ్గరలోని దుకాణంలోకి వెళ్లి అప్పటికప్పుడు కత్తెర కొనుగోలు చేసి ప్రియుడి పై దాడి చేసింది. తీవ్రగాయాలపాలైన అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

స్థానికులు స్పందించి ఆస్పత్రికి తరలించగా... అప్పటికే అతను మృతి చెందాడు. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.