బ్రిటన్ లో హృదయం మెలిపెట్టే ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ తాను అద్దెకుంటున్న ఇంట్లోనే మృతి చెందింది. కానీ రెండున్నరేళ్లుగా ఎవ్వరూ దాన్ని గుర్తించలేదు. సరికదా.. ఆమె నుంచి అద్దె వసూలు చేస్తూనే ఉన్నారు. 

బ్రిటన్ : అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చిన తరువాత.. మనిషి.. మనిషికి దూరం అయ్యాడు. పక్కింట్లో ఎవరు ఉంటున్నారో.. ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అంతగా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. వింటేనే ఒళ్లు గగుర్పొడిచే.. మానవ సంబంధాల మీద.. సభ్య సమాజం తీరుపట్ల భయం కలిగించే ఓ సంఘటన బ్రిటన్ లో వెలుగుచూసింది. అసలేం జరిగిందంటే.. 

ఓ ఒంటరి మహిళ తను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే మరణించింది. రెండున్నరేళ్లుగా ఆమె మృతదేహం ఆ ఇంట్లోనే కుళ్లిపోయి అస్తిపంజరంగా మారింది. అయితే ఈ విషయాన్ని కాస్త కూడా గమనించకుండా.. ఆమె నుంచి సమాధానం రాకపోతే ఏమయింది అని ఆరా తీయకుండా.. యధావిధిగా కిరాయి వసూలు చేసుకుంటూ వెళ్ళింది ఆ హౌసింగ్ సొసైటీ. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే.. డబ్బులు చెల్లించడం లేదని ఆమె ఫ్లాట్ కు గ్యాస్ సరఫరాను కూడా నిలిపివేసింది. కానీ ఆమె ఏమయిందోనని మాత్రం గుర్తించకపోవడం గమనార్హం. ఇక అద్దె మాత్రం రెగ్యులర్ గా వసూలు చేసింది.. సదరు మొత్తన్ని ఆమె సామాజిక ప్రయోజనాలు నుంచి వసూలు చేసింది. ఈ షాకింగ్ ఘటన బ్రిటన్లోని పెక్ హామ్ లో వెలుగు చూసింది. కేసు విచారణలో విస్మయం కలిగించే అనేక విషయాలు బయటపడ్డాయి.

కనిపించకుండా పోయిన నలభైయేళ్లకు మంచు కొండల్లో.. అస్థిపంజరంగా... జర్మన్ స్కీయర్ మరణ రహస్యం...

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇక్కడి ఓ ఫ్లాట్ లో సోఫాలో మానవ అస్థపంజర అవశేషాలు బయటపడ్డాయి. ఈ వార్త సంచలనంగా మారింది. దంత అవశేషాలను పరీక్షించి ఆమెను అదే ఇంట్లో అద్దెకుంటున్న 58 ఏళ్ల షీలా సెలియోనేగా గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో లభ్యమయింది. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం నివేదికలో ఆమె మరణానికి సరైన కారణం తెలియరాలేదు. ఆమె అద్దె చెల్లించడం కూడా చనిపోయిన నెల.. అదే చివరిసారి. అప్పటి నుండి చెల్లించకపోవడంతో ‘పీబాడీ’ హౌసింగ్ సొసైటీ ఆ మహిళ సామాజిక ప్రయోజనాలు నుంచే అద్దె వసూలు చేసుకుంటుంది. జూన్ 2020లో మాత్రం ఆమె ఫ్లాట్ కు గ్యాస్ సరఫరా నిలిపి వేసింది.

బాలికలను సెక్స్ బానిసలుగా మారుస్తున్నారు.. కథనం రాసిన మహిళా జర్నలిస్టును అదుపులోకి తీసుకున్న తాలిబాన్లు

మరోవైపు.. ఆమె అదృశ్యంపై ఇరుగుపొరుగువారు హౌసింగ్ అసోసియేషన్ కు, పోలీసులనూ అనేకసార్లు సంప్రదించారు. అయినా సరైన స్పందన లేకుండా పోయింది. పోలీసులు రెండుసార్లు వచ్చి వెళ్లినా.. ఆమె బతికే ఉందని తప్పుడు సమాచారం ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై చేపట్టిన ఓ స్వతంత్ర దర్యాప్తు సైతం.. ఆమె ఆచూకీని కనిపెట్టడంలో విఫలమైనందున హౌసింగ్ సొసైటీనీ తప్పు పట్టింది. ఈ క్రమంలో జరిగిన దానికి హౌసింగ్ సొసైటీ క్షమాపణలు చెప్పింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన స్థానిక కోర్టు సైతం ‘ఎవరి మరణమైనా అది విషాదకరమే. రెండేళ్లకు పైగా ఆమెను గుర్తించకుండా ఉండడం.. జీర్ణించుకోలేని విషయం’ అని వ్యాఖ్యానించింది. ఇది ఇప్పటికైనా మనల్ని మనం తట్టిలేపుకోవాల్సిన సమయం.