ప్రేమకు భాషా, వయసు, దేశం, రంగు, రూపంతో సంబంధంలేదని ఎందరో చెప్పారు, మనం కూడా ఎన్నో సినిమాల్లో చూశాం. ఏ వయసులో ఎవరికి ప్రేమ గంట మోగుతుందో చెప్పడం కష్టం.

కొందరికి యుక్త వయసులో ప్రేమ చిగురిస్తే మరికొందరికి లేటు వయసులో ఘాటు ప్రేమ పుడుతుంది. దీనిని రుజువు చేస్తూ బ్రిటన్‌లో ఓ ఘటన జరిగింది. ఓ మహిళ ఏకంగా 81 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

వివరాల్లోకి వెళితే.. యూకేకు చెందిన ఐరిష్‌ జోనిస్‌ (81) అనే వృద్ధురాలు ఈజిప్ట్‌కు చెందిన మహమ్మద్‌ అహ్మద్‌ ఇబ్రహీం (35) అనే వ్యక్తితో తొలుత పరిచయం ఏర్పడింది. రెండేళ్ల క్రితం ఈజిప్ట్‌ పర్యటనకు వెళ్లిన జోనిస్‌కు ఇబ్రహీంకు మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

ఆ వయసులోనూ రెండు మూడుసార్లు ప్రియుడ్ని కలవడానికి ఈజిప్ట్‌ వెళ్లారు జోనిష్. అయితే అక్కడి వాతావరణం ఆమెకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. వేడి వాతావరణంతో పాటు విపరీతమైన ట్రాఫిక్‌, ఆహారపు అలవాట్లు జోనిస్‌ను చాలా ఇబ్బందులకు గురిచేశాయి.

దీంతో విసుగుచెందిన ఆమె ఇబ్రహీంతో యూకేలోనే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. తనకంటే వయసులో 45 ఏళ్లు చిన్నవాడైన ప్రియుడిని వివాహం చేసుకున్నారు జోనిష్.

అప్పటికే జోనిస్‌కు పెళ్లయి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారి వయసు 50 ఏళ్లకు పైబడే. కానీ తల్లి వివాహానికి వారు ఎలాంటి అడ్డు చెప్పలేదు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. అవి కాస్తా వైరల్‌ అయ్యాయి.

అయితే యూకేలో స్థిరపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఇబ్రహీంకు ఎంతకీ వీసా దొరకలేదు. చివరికి ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఆ దేశ మహిళను వివాహం చేసుకుంటే అక్కడే స్థిరపడొచ్చని ఓ మిత్రుడి సలహాను ఆచరించి జోనిస్‌ను వివాహం చేసుకున్నారని పలువురు అభిప్రాయపడ్డారు.