ఓ మహిళ కారులో వెళుతుండగా...ఒక్కసారిగా కాళ్ల కింద పాము కనిపించింది. దీంతో ఉలిక్కిపడిన మహిళ వెంటనే తేరుకొని కారు పక్కన ఆపేసి పరుగు తీసింది. ఈ సంఘటన అమెరికాలోని మిస్సోరిలో  చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నలభై ఏళ్ళ వయస్సున్న ఓ మహిళ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతోంది. ఇంతలో ఏదో చిన్న అలికిడి వినిపించింది. అయితే తనకేమీ కనిపించలేదు.

ఏమీ లేదనుకుంటూ మళ్ళీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈసారి... బుస్ మన్న శబ్దం వినిపించింది. మనస్సుకు తేడా కొట్టడంతో కారు మొత్తం పరిశీలించడం మొదలెట్టింది. చివరకు... ఫ్లోర్ బోర్డ్ కింద... ఓ పాము చుట్టుకొని ఉండటాన్ని చూసింది. అమ్మో పాము... బబోయ్ పాము... అనుకుంటూ... కార్ బ్రేక్ వేసి... గబగబా దిగిపోయి... కాస్త దూరం వెళ్లి నిలుచుంది. మళ్లీ వెంటనే కారు దగ్గరకు వచ్చి... కారు అన్ని డోర్లూ లాక్ తీసేసి... డోర్లు తెరిచి... దూరంగా వెళ్లి నిల్చుంది.

వణికిపోతూనే... పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చి పామును చూశారే గానీ దాన్ని బయటకు పంపలేకపోయారు. ఇక లాభం లేదనుకుని... వాహనాలను లాక్కెళ్ళే క్రేన్‌ను తీసుకొచ్చి... కారును దానికి లింక్ పెట్టి... రోడ్డు పై నుంచి... మరో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ లోగా పాముల్ని కాపాడే వాళ్లూ వచ్చారు. అప్పటికే పాము కారు నుంచి బయటకు వచ్చింది. దీంతో దానిని పట్టుకుని అడవిలో వదిలేశారు.