ఎవరి జీవితంలో అయినా ప్రేమ,పెళ్లి అనేవి మధుర క్షణాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇవి జరుగుతాయి. అలాంటి క్షణాలను ఎవరూ మిస్ చేసుకోవాలని అనుకోరు. అంతేకాకుండా వాటిని అందంగా ఫోటో రూపంలోనో, వీడియో రూపంలోనో బంధించుకుంటారు. తర్వాత వాటిని చూసుకొని మురిసిపోతుంటారు.  ఒక్కోసారి అనుకోకుండా జరిగిపోయే క్షణాలను ఫోటోలు, వీడియోల రూపంలో బంధించే అవకాశం ఉండదు. అలాంటివాళ్లు.. ఆ క్షణం మమ్మల్ని ఎవరైనా ఓ ఫోటో తీసి ఉంటే ఎంత బాగుండు అని కూడా ఫీలౌతుంటారు. తన అక్క భవిష్యత్తులో అలా ఫీలవ్వకుండా ఉండాలని ఓ చెల్లి పడిన తిప్పలు ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

ఇంతకీ మ్యాటరేంటంటే.... అమెరికాకు చెందిన ఓ యువతికి ఆమె బాయ్ ఫ్రెండ్ లవ్ ప్రపోజ్ చేయాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని ఆ యువతి చెల్లికి తెలియజేశాడు. అతను ప్రపోజ్ చేసే సమయంలో తన అక్క కళ్లల్లో కనిపించే మెరుపుని ఆమె క్యాప్చర్ చేయాలని అనుకుంది. అలా అని ఆ ప్రేమ జంట ప్రైవసీ పోగొట్టాలని ఆమె అనుకోలేదు. అందుకే ఓ వినూత్న ప్లాన్ వేసింది.

తన అక్కకి బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నాడో ముందుగానే తెలుసుకుంది. ఆ తర్వాత తాను అక్కడున్న విషయం వారికి తెలీకుండా.. కనీసం వాళ్లు తనని చూసినా గుర్తుపట్టకుండా ఉండేందుకు ఒక చెట్ల పొదలాగా తయారయ్యింది. ఆవిధంగా ఆమె డ్రస్ తయారు చేసుకోని మరీ వేసుకోవడం విశేషం. అనంతరం వాళ్లని ఫాలో అయ్యి.. రహస్యంగా వాళ్ల లవ్ ప్రపోజల్ ని తన కెమేరాలో బంధించింది.

దీనికి సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. కాగా... ఆ ఫోటోస్ వైరల్ గా మారాయి. ఆమె ట్వీట్ ని 21వేల మంది రీట్వీట్ చేయగా.. 1.7లక్షల మంది లైక్ కొట్టారు. ఆమె చేసిన పనిని నెటిజన్లు అభినందిస్తున్నారు. నాకు ఇలాంటి సోదరి ఉంటే బాగుండూ అని కొందరు కామెంట్స్ చేయడం గమనార్హం.