Asianet News TeluguAsianet News Telugu

70 ఏళ్లుగా లైసెన్స్ లేకుండానే కారు డ్రైవింగ్.. చివరకు ఏమైందంటే?

ఒకటి కాదు రెండు కాదు.. 70 ఏళ్లుగా ఓ వ్యక్తి ఇన్సూరెన్స్ లేకుండా.. కనీసం లైసెన్స్ కూడా లేకుండా కారు నడుపుతూ ఎంచక్కా నగరం రోడ్లు చుట్టేశాడు. కానీ, ఇటీవలే ఓ చోట పోలీసులు ఆపడంతో ఆయన యవ్వారం బయటపడింది. 1938లో జన్మించిన ఆ వ్యక్తి తన 12వ ఏట నుంచి ఇన్సూరెన్స్, లైసెన్స్ లేకుండానే కారు నడుపుతున్నారని పోలీసులకు తెలిపాడు. దీంతో ఖంగుతినడం పోలీసుల వంతైంది. ఈ విషయాన్ని పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టి వెల్లడించారు.
 

without licence.. insurance he driving for 70 years in UK
Author
New Delhi, First Published Jan 29, 2022, 7:40 PM IST

న్యూఢిల్లీ: వాహనంతో ఇప్పుడు రోడ్డెక్కాలంటే.. అన్ని డాక్యుమెంట్లు(Documents) సరిగా ఉన్నాయా? లేవా? అని సరిచూసుకోవాల్సిందే. లేదంటే.. జేబుకు చిల్లుపడిపోతుంది. ఫైన్‌ల మీద ఫైన్‌లు పడుతూ మోతమోగిపోతుంది. లైసెన్స్‌ డాక్యుమెంట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఇలా అన్ని డాక్యుమెంట్లను సరి చూసుకునే జర్నీ ప్రారంభిస్తాం. కానీ, ఆ వ్యక్తి 70 ఏళ్లుగా ఇన్సూరెన్స్(Insurance) లేకుండా.. కనీసం లైసెన్స్ కూడా లేకుండా స్వేచ్ఛగా రోడ్లపై కారుతో తిరిగాడు. ఔను.. 70 సంవత్సరాలు లైసెన్స్(Licence) లేకుండానే రోడ్లపై ఫ్రీగా రయ్యిమని దూసుకెళ్లాడు. అన్ని సంవత్సరాలు ఒక్కసారైనా ఆయనను పోలీసులు ఆపలేదు. అదృష్టవశాత్తు యాక్సిడెంట్ కాలేదు. మరే ఇతర కారణాలతో ఆయనను పోలీసులు ఆపలేదు. ఇటీవలే పోలీసులు యాక్టివ్ పెట్రోలింగ్‌లో భాగంగా ఆ వృద్ధుడి కారు ఆపారు. ఆయన వివరాలను అడిగి పోలీసులే నోరెళ్లబెట్టారు.

ఈ ఘటన యునైటెడ్ కింగ్‌డమ్‌లో జరిగింది. నాటింగ్‌హమ్‌లోని బుల్‌వెల్‌లో పోలీసులు ప్రో యాక్టివ్ పెట్రోలింగ్ చేపట్టడానికి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఊరికే టెస్కో ఎక్స్‌ట్రా దగ్గర పోలీసులు ఓ డ్రైవర్‌ను తన కారును(Car) రోడ్డు పక్కకు ఆపాల్సిందిగా సంకేతాలు ఇచ్చారు. ఆ వృద్ధ డ్రైవర్ పోలీసుల సంజ్ఞలకు అనుకూలంగా వ్యవహరిస్తూ కారును రోడ్డు పక్కన ఆపాడు. కారు దస్త్రాలు, లైసెన్స్ సహా ఇతర డాక్యుమెంట్లు చూపెట్టాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. దీనికి ఆ వృద్ధుడు తాపీగా ఇచ్చిన సమాధానం విని ఖంగుతిన్నారు ఆ పోలీసులు. తన దగ్గర ఇన్సూరెన్స్ లేదని, డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని ఆ డ్రైవర్ సమాధానం ఇచ్చాడు.

తాను 1938లో జన్మించారని ఆ డ్రైవర్ చెప్పాడు. తన 12వ యేట నుంచి కారు డ్రైవింగ్ చేస్తున్నానని వివరించాడు. అప్పటి నుంచి తాను లైసెన్స్ అనేదే ఎరుగనని పేర్కొన్నాడు. తనను ఎప్పుడూ పోలీసులు ఆపలేదని వివరించాడు. అంతేకాదు, అదృష్టవశాత్తు యాక్సిడెంట్లు కూడా కాలేవని, ఆ విధంగా తాను పోలీసులకు ఎదురుబడలేదని చెప్పాడు. ఈ సమాధానాలను పోలీసులు తొలుత నమ్మలేకపోయారు. తర్వాత అన్ని వివరాలను ధ్రువీకరించుకున్న తర్వాత నమ్మక తప్పలేదు. ఆ తర్వాత వారు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు.

ఈ రోజు సాయంత్రం షేర్‌వుడ్, కారింగ్టన్‌లో ప్రో యాక్టివ్ పెట్రోలింగ్ కోసం సిటీ నార్త్ ఆపరేషన్ టీమ్ బయల్దేరిందని పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. టెస్కో ఎక్స్‌ట్రా దగ్గర ఓ కారును ఆపారని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాన్ని తాము నమ్మలేకపోయామని వివరించారు. 1938లో జన్మించిన ఓ వ్యక్తి తన 12వ యేట నుంచి ఔను 12వ యేట నుంచి ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడుపుతున్నాడని తెలిసిందని పేర్కొన్నారు. ఏదో రకంగా ఆయన ఇప్పటి వరకు పోలీసుల ముందుకు రాలేడని తెలిపారు. అదృష్టవశాత్తు తనకు యాక్సిడెంట్  కాకపోవడం లేదా.. ఇతరులను ఆయన ఢీకొట్టి ఆర్థికంగా నష్టపరచకపోవడంతో ఆయన తతంగం పోలీసుల ముందుకు రాలేదని వివరించారు.

అదే సమయంలో మరో హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు నాటింగ్‌హమ్ నగరంలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ క్రియాశీలకంగా పని చేస్తున్నదని వివరించారు. తద్వారా చిన్న చిన్న ట్రిప్‌లలో బయటికి వచ్చినా సరే.. ఆ సిస్టమ్ ఇట్టే పట్టేస్తుందని తెలిపారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ డాక్యుమెంట్లు వెంట తెచ్చుకోవాలని సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios