అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత దేశ విషయాలంటేనే వేలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాడు. తాజాగా భారత్, చైనాల మధ్య సరిహద్దు వెంబడి పరిస్థితులు టెన్షన్ గా మారడంతో ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ట్వీట్ చేసాడు. 

"భారత్, చైనాలు ఇరు దేశాల మధ్య కూడా సరిహద్దు వెంట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి అమెరికా  ,ఇప్పటికే ఈ విషయాన్నీ ఇరు దేశాలకు కూడా తెలిపాము. ధన్యవాదాలు" అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసారు. 

గతంలో భారత్, పాకిస్తాన్ విషయంలో కూడా ఇలానే మధ్యవర్తిత్వం చేస్తానంటూ పలుమార్లు ట్రంప్ అవాకులు చవాకులు పేలిన విషయం తెలిసిందే! అప్పుడు భారత్ ట్రంప్ ఆఫర్ ను కరాఖండిగా  తిరస్కరించడం,ఇది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక విషయం అని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే!

ఇకపోతే, చైనా సరిహద్దుల్లో కాలుదువ్వుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, త్రివిధ దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రధాని చర్చించారు. అనంతరం విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌తోనూ మోడీ మాట్లాడారు.

సరిహద్దు భద్రతలపై త్రివిధ దళాల అధిపతులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత మోడీ ఈ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

మే 5న పాంగాంగ్ ప్రాంతంలో భారత్- చైనా దేశాల సైనికులు తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రెండు వైపులా సైనికులు తీవ్ర గాయాల పాలయ్యారు. నాటి నుంచి లడఖ్‌ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.

తిరిగి మే 9న ఉత్తర సిక్కింలోనూ ఇదే తరహా పరిస్ధితులు తలెత్తాయి. తమ గస్తీకి చైనా సైనికులు పదే పదే అడ్డొస్తున్నారని భారత సైన్యం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.