ఆస్కార్ అవార్డు గ్రహీత, అమెరికన్ నటుడు విలయం హర్ట్ (71) మృతి చెందారు. హాలీవుడ్ లో అనేక చిత్రాల్లో ఆయన నటించారు. గొప్ప నటుడిగా పేరు, ప్రఖ్యాతులు సంపాదించారు. మరో వారం రోజుల్లో ఆయన 72వ పుట్టిన రోజు ఉంది. ఈ సమయంలో ఆయన చనిపోవడం విచారకరం. 

ది బిగ్ చిల్ (The Big Chill), ఎ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ (A History of Violence) వంటి చిత్రాల్లో నటించి ప్రఖ్యాతి పొందిన అమెరికన్ నటుడు విలియం హర్ట్ (William Hurt) 71 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఈ విష‌యాన్ని యూఎస్ మీడియా వ‌ర్గాలు ఆదివారం వెల్లడించాయి. విలియం హ‌ర్ట్ కుమారుడు కూడా ఈ విష‌యాన్ని ధృవీక‌రిస్తూ ఒక ప్ర‌క‌టన విడుద‌ల చేశారు. ‘‘ మా నాన్న ఆయ‌న 72వ పుట్టిన రోజుకు ఒక వారం ముందు మార్చి 13,2022న మ‌ర‌ణించారు. ఆయ‌న మృతి ప‌ట్ల మా కుటుంబం అంతా విచారంగా ఉంది. ఆయ‌న స‌హ‌జ కారణాల‌తో కుటుంబ స‌భ్యుల మ‌ధ్య మృతి చెందాడు.’’ అని పేర్కొన్నారు. 

విలియం హ‌ర్ట్ కు మే 2018లో టెర్మినల్ ప్రోస్టేట్ క్యాన్సర్ (erminal prostate cancer) ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే ఆయ‌న కుమారుడు చేసిన ప్ర‌క‌ట‌న‌లో హ‌ర్ట్ చ‌నిపోయేందుకు ఈ క్యాన్స‌ర్ కార‌ణ‌మ‌య్యిందా అనే విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌లేదు. విల‌యం హ‌ర్ట్ 1983లో వ‌చ్చిన గోర్కీ పార్క్ (Gorky Park) అనే చిత్రంలో ర‌ష్య‌న్ పోలీసు అధికారి పాత్ర పోషించారు. 1991లో వ‌చ్చిన అన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ (Until the End of the World) అనే చిత్రంలో అంధులకు ప్రయోజనం చేకూర్చే ఒక యంత్రాన్ని నిర్మించాలని తాప‌త్ర‌య ప‌డే వ్య‌క్తి పాత్ర‌లో న‌టించారు. ఈ పాత్ర‌ల‌తో ఆయ‌న ఖ్యాతి పెరిగింది. 

మొద‌టి సారిగా హ‌ర్ట్ 1980లో ఆల్ట‌ర్డ్ స్టేట్స్ (Altered States) అనే సినిమాలో ఒక గొప్ప శాస్త్ర‌వేత్త పాత్ర పోషించారు. 1981లో బాడీ హీట్ (Body Heat)లో కాథ్లీన్ టర్నర్ సరసన కనిపించడం అతన్ని సెక్స్ సింబల్‌గా మార్చింది. కిస్ ఆఫ్ ది స్పైడర్ ఉమెన్స్ లో ‘గే’ ఖైదీగా నటించినందుకు 1985లో ఉత్తమ నటుడుగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాడు. ‘‘ చిల్డ్రన్ ఆఫ్ ఎ లెస్సర్ గాడ్ (Children of a Lesser God)’’ (1986)లో చెవిటి విద్యార్థుల ఉపాధ్యాయుడిగా, "బ్రాడ్‌కాస్ట్ న్యూస్ (Broadcast News)" (1987)లో స్లో-విట్టెడ్ టీవీ యాంకర్ గా కూడా ఆయ‌న ఆస్కార్ అవార్డుల‌కు నామినేట్ అయ్యారు. 

విలియం హర్ట్ వాషింగ్టన్ DCలో 1950లో మార్చి 20వ తేదీన జన్మించాడు. అయితే ఆయ‌న తండ్రి US దౌత్యవేత్త కావ‌డంతో హ‌ర్ట్ చిన్న‌త‌నంలో వివిధ ప్రాంతాల్లో నివ‌సించాడు. ఆయ‌న త‌ల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తర్వాత త‌ల్లి టైమ్-లైఫ్ సామ్రాజ్యానికి వారసుడైన హెన్రీ లూస్ IIIని వివాహం చేసుకొని న్యూయార్క్‌కు వెళ్లిపోయారు. అయితే ఆయ‌న న్యూయార్క్‌లోని ప్రఖ్యాత జూలియార్డ్ ఆర్ట్స్ స్కూల్‌లో చేరే ముందు టఫ్ట్స్ విశ్వవిద్యాలయం (Tufts University) లో వేదాంతశాస్త్రం చదువుతూ ఆమెకు స‌మీపంలో ఉన్నారు. 

హాలీవుడ్ లో విలియం హ‌ర్డ్ కు గొప్ప కీర్తి ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న అక్క‌డ స్థిర‌ప‌డ‌లేదు. కానీ ఒరెగాన్‌లో తన ఇంటిని ఏర్పాటు చేసుకున్నాడు. త‌న స్టార్‌డమ్ వ‌ల్ల త‌న‌కు అసహనంగా అనిపిస్తూ ఉంటుందని ఆయ‌న ప‌లు ఇంటర్వ్యూలలో తెలియ‌జేశారు. అదంతా త‌న‌కు అసౌక‌ర్యంగా అనిపిస్తుంద‌ని చెప్పారు. విల‌యం హ‌ర్ట్స్ టఫ్ట్స్ యూనివ‌ర్సిటీలో చ‌దువు ముగించిన త‌రువాత వర్ధమాన నటి మేరీ బెత్ సూపింగర్ (Mary Beth Supinger)ను వివాహం చేసుకున్నారు. ఆమెను నాటకంలో శిక్ష‌ణ ఇప్పించ‌డానికి లండన్‌కు వెళ్లారు. అనంత‌రం న్యూయార్క్ తిరిగి వచ్చి విడాకులు తీసుకున్నారు. ఆయ‌న‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.