పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) పార్టీ అధినేత.. షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ తదుపరి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ గద్దె దించడంలో విజయం సాధించిన ఉమ్మడి ప్రతిపక్షం ఇప్పటికే షాబాజ్ షరీఫ్‌ను ప్రధాని పదవికి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించింది.
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ సర్కార్ కూలిపోయింది. పాక్ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొని పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నిలిచారు. ఇమ్రాన్ ఖాన్ పాక్ పదవీచ్యుతుడు కావడంతో.. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) పార్టీ అధినేత.. షాబాజ్ షరీఫ్ ఆ దేశ తదుపరి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన అనంతరం.. షాబాజ్ షరీఫ్ ట్విట్టర్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి కీలక పోస్టు చేశారు. గత రాత్రి జరిగిన నాటకీయ పరిణామాల తర్వాత పాకిస్తాన్ తీవ్రమైన సంక్షోభం నుంచి బయటపడిందని అన్నారు.
‘‘దేశం, పార్లమెంటు హౌస్ ఎట్టకేలకు నిన్న రాత్రి తీవ్రమైన సంక్షోభం నుంచి విముక్తి పొందింది. కొత్త ఉషోదయానికి పాకిస్థాన్ దేశానికి అభినందనలు’’ అని షెహబాజ్ ట్వీట్ చేశారు. కొత్త ప్రభుత్వంలో రాజకీయ ప్రత్యర్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని చెప్పిన షాబాజ్.. చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. ‘‘మేము ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోము.. ఎవరికీ అన్యాయం చేయము. మేము ఎవరినీ జైలులో పెట్టము. చట్టం తన పని చేస్తుంది’’ అని షాబాజ్ ట్వీట్ చేశారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి తొలగించబడినందున.. కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సోమవారం(ఏప్రిల్ 11) మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. ఇమ్రాన్ ఖాన్ గద్దె దించడంలో విజయం సాధించిన ఉమ్మడి ప్రతిపక్షం ఇప్పటికే షాబాజ్ షరీఫ్‌ను ప్రధాని పదవికి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించింది.
రాజకీయ హైడ్రామా..
గత కొన్ని వారాలుగా పాకిస్తాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగిన సంగతి తెలిసిందే. దేశంలో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపిస్తూ విపక్షాలు ఆయనపై అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి. అయితే తమ ప్రభుత్వాన్ని గద్దె దింపే ప్రయత్నాల వెనక విదేశీ కుట్ర ఉందని ఆరోపించిన ఇమ్రాన్ ఖాన్.. జాతీయ అసెంబ్లీలో తనపై అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేయించేలా ప్రణాళికలు రచించారు. అవిశ్వాస తీర్మానం డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి తిరస్కరించడంతో.. జాతీయ అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఇమ్రాన్ ఖాన్ సిద్దమయ్యారు.
అయితే ఈ చర్యలను ఉమ్మడి ప్రతిపక్షం సుప్రీం కోర్టులో సవాలు చేశాయి. దీంతో ఏప్రిల్ 7న ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరిస్తూ డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అవిశ్వాసం తీర్మానంపై ఓటింగ్ తప్పనిసరి అయింది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శనివారం జాతీయ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే సభ పలుమార్లు వాయిదా పడింది. ఈ క్రమంలోనే నాటకీయ మలుపులు చోటుచేసుకున్నాయి. అనూహ్యంగా పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైసర్‌తో పాటు డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ రాజీనామా చేశారు. దీంతో అందరూ డైలామాలో పడ్డారు. అయితే అప్పటికప్పుడు అయాజ్ సాదిఖ్‌ను యాక్టింగ్ స్పీకర్‌గా ఎన్నుకొని అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఎట్టకేలకు ఆదివారం తెల్లవారుజామున అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది.
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులు ఉన్నారు. మెజార్టీకి రావాలంటే.. 172 మంది మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇమ్రాన్ సర్కార్‌కు వ్యతిరేకంగా 174 ఓట్లు వచ్చినట్లు జాతీయ అసెంబ్లీ స్పీకర్ ఆయాజ్ సాదిఖ్ ప్రకటించారు. దీంతో ఉమ్మడి ప్రతిపక్షం విజయం సాధించింది. దీంతో చివరి బంతికి ఇమ్రాన్ ఖాన్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఇక, ఓటింగ్ సమయంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ సభ్యులు సభకు హాజరుకాలేదు.
