లండన్: తన లీక్స్‌తో ప్రపంచంలోని ప్రముఖులను ముప్పుతిప్పలు పెట్టిన  వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను ఎట్టకేలకు బ్రిటీష్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈక్వేడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకున్న అసాంజేను ఏడేళ్ల తర్వాత లండన్ పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.

అసాంజేను త్వరలోనే వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. స్వీడన్‌లో నమోదైన లైంగిక వేధింపుల కేసు విచారణ నుంచి తప్పించుకునేందుకు ఈక్వేడార్ రాయబార కార్యాలయంలో గత ఏడేళ్లుగా అసాంజే తలదాచున్నారు.

కాగా, అసాంజేను అరెస్ట్ చేసేందుకు లండన్‌తో ఈక్వేడార్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందంటూ వికీలీక్స్ ఇటీవల ట్వీట్ చేసి సంచలనం రేపింది. ఈక్వేడార్ ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారుల నుంచి తమకు ఈ సమాచారం అందినట్లు వికీలీక్స్ వెల్లడించింది.

 

బ్రిటీష్ పోలీసులను ఆహ్వానించి మరీ అసాంజేను అప్పగించిందని వికీలీక్స్ తాజాగా చేసిన మరో ట్వీట్‌లో పేర్కొంది. ఇది ఇలావుంటే, అసాంజేను తమ కస్టడీకి అప్పగించాలంటూ అమెరికా.. బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరుతోంది.