మెక్సికో: తనను తానే గుర్తించలేక ఓ మహిళ దారుణానికి పాల్పడింది. ఓ పోటోలో భర్త పక్కనున్నది తానేనని గుర్తించలేకపోయిన భార్య అతడిపై కత్తితో దాడిచేసి చంపడానికి ప్రయత్నించింది. చివరకు భర్త పక్కనున్నది తానేనని గుర్తుపట్టి శాంతించింది. తనను తాను గుర్తుపట్టలేకపోవడం కాస్త ఆలస్యం అయ్యుంటే ఘోరం జరిగేది.  

ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది.  మెక్సికో సిటీలో నివాసముండే జువాన్‌, లియోనోరా భార్యాభర్తలు. చాలా సంవత్సరాలు క్రితమే వీరిద్దరు ప్రేమించుకుని మరీ పెళ్ళి చేసుకున్నారు. ప్రస్తుతం కాస్త వయసు మీదపడటంతో పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ప్రేమలో వుండగా దిగిన ఫోటోలను జువాన్ తిరగేశాడు. ఈ క్రమంలోనే ఫోటోలు పూర్తిగా పాడయిపోవడం గమనించాడు. దాంతో వాటిని డిజిటలైజ్‌ చేయించాడు. దంపతులిద్దరు యవ్వనంలో ఉండగా తీసిన ఫోటోలను డిజిటలైజేషన్‌ చేయించడంతో అవి మరింత అందంగా మారాయి. 

ఇలా యవ్వనంలో వుండగా దిగిన ఫోటోను జువాన్ తన మొబైల్ లో వాల్ పేపర్ గా పెట్టుకున్నాడు. అయితే ఈ ఫోటోను చూసిన లియోనోరా తన ఫోటోను గుర్తుపట్టలేకపోయింది. భర్త పెళ్లికిముందు వేరే మహిళతో దిగిన ఫోటో అని అనుమానించింది. భర్త తనను మోసం చేశాడని భావించిన ఆమె అతడిని అంతమొందించడానికి సిద్దమయ్యింది. కోపంలో కత్తి తీసుకుని భర్త మీద దాడి చేసింది. దీంతో జువాన్ తీవ్రంగా గాయపడ్డాడు. 

అతడు ఏదోవిధంగా భార్య దాడి నుండి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో లియోనోరాను అదుపులోకి తీసుకుని ఆమె కోపానికి గల కారణాన్ని తెలుసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు భర్తకు తెలపడంతో డేటింగ్‌ చేసే రోజుల నాటి ఫోటోని తాను డిజిటలైజ్‌ చేయించానని చెప్పాడు. దీంతో తనను తాను గుర్తుపట్టుకున్న భార్య పాశ్చాత్తాపానికి లోనయ్యింది.