ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారం రావడంపై పాకిస్తాన్ సానుకూలంగా స్పందించింది. అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అయితే.. ఆఫ్గనిస్తానీలు తమ బానిస సంకెళ్లను తెంచుకున్నారని పొగిడాడు. అమెరికా సైన్యం ఉపసంహరణ పూర్తయింది.. తాలిబాన్లు అధికారాన్ని చేపట్టారు. కానీ, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్‌ల మధ్య ఎందుకు బెడిసింది? ఎందుకు సరిహద్దులో దాడులు చేసుకుంటున్నారు. ఇప్పుడు కొత్త ప్రధానితో ఈ సమస్య సాల్వ్ అవుతుందా? మరింత జఠిలం అవుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే.. 

న్యూఢిల్లీ: గతేడాది ఆగస్టు 15న అష్రఫ్ గనీ ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబాన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అమెరికా ఆర్మీ వెనుదిరిగింది. అప్పటి వరకు తాలిబాన్లకు సంబంధించిన విలువైన సమాచారాన్ని అమెరికాకు చేరవేసే పని పాకిస్తాన్ చేపట్టింది. ఆ సమాచారం ఆధారంగా అమెరికా సైన్యం తాలిబాన్లపై వైమానిక దాడులు కూడా జరిపింది. కానీ, అనూహ్యంగా అమెరికా ఆర్మీ ఉపసంహరణ గడువు దగ్గర పడ్డ కొద్దీ పాకిస్తాన్ దాని వైఖరిని మార్చుకుని బహిరంగంగా తాలిబాన్లకు మద్దతు ఇస్తూ ప్రకటనలు చేసింది. ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగా తాలిబాన్ల విజయాన్ని కీర్తించాడు. ఆఫ్ఘనిస్తాన్లు బానిస సంకెళ్లను తుంచుకున్నారని పొగిడాడు. అప్పటి నుంచి అమెరికా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు.

అమెరికా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ.. అంతర్జాతీయ వేదికలపై తాలిబాన్ల మద్దతు కోసం కూడా గళమెత్తాడు. ఆయన ప్రభుత్వ నేతలూ ఈ పని చేశారు. గతంలో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా పాకిస్తాన్‌ వారితో సఖ్యంగానే ఉన్నది.

తాలిబాన్లు అధికారంలోకి రావడం తమకు కలిసి వస్తుందని పాకిస్తాన్ భావించడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తాయి. ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ల తొలి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత భారత్ తాలిబాన్లకు వ్యతిరేకంగా ఉన్న ఆ దేశ ప్రభుత్వాలకు దగ్గరయింది. దీనితో భారత్‌తో ఉన్న తమ శత్రుత్వానికి తాలిబాన్ల రూపంలో మరో మిత్రువు పాకిస్తాన్‌కు కలిసి వస్తుందని భావించింది. ఇంకో కారణం.. ఉగ్రవాద రూపంలో ఉన్నది. పాకిస్తాన్‌లో ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపించాలని తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) విధ్వంసం సృష్టిస్తున్నది. ఈ ఉగ్రవాద సంస్థను తాలిబాన్లు కంట్రోల్ చేస్తారని భావించింది.

కానీ, అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత పాకిస్తాన్ ఆశించినట్టుగా వ్యవహారాలు జరగలేవు. ఆ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదమే దీన్ని నిరూపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్‌లోని కునార్, ఖోస్త్ ప్రావిన్స్‌లలో 20 మంది చిన్నారులు సహా 50 మంది వైమానిక దాడుల్లో మరణించారు. ఈ వైమానిక దాడులను పాకిస్తానే చేసిందని తాలిబాన్లు ఆరోపిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లు కూడా ఆ సరిహద్దులో భారీగా సాయుధులను మోహరించి పాకిస్తాన్ ఆర్మీపై దాడులు జరిపిస్తున్నది.

ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎందుకు?
పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ మధ్య సరిహద్దు వివాదం పాతది. అఫ్గాన్‌లో అమెరికా మద్దతున్న ప్రభుత్వాలు కొలువుదీరి ఉన్నప్పుడు కూడా పాకిస్తాన్ సరిహద్దు విషయంలో రాజీ పడలేదు. మళ్లీ తాలిబాన్లు అధికారంలోకి రాగానే.. ఈ పరిస్థితి మారుతుందని పాకిస్తాన్ భావించింది. కానీ, మారలేదు. పైపెచ్చు పాకిస్తాన్‌కు తాము సామంతులం కాదని ప్రకటించుకునే ఉబలాటంలోనూ తాలిబాన్లు సరిహద్దు వివాదం నుంచి వెనక్కి తగ్గడం లేదు. అదే విధంగా అక్కడ పష్తున్‌లను వేరు చేస్తూ వెళ్లుతున్న సరిహద్దును వ్యతిరేకించడంతో ఆప్గనిస్తాన్‌లోని పష్తున్ కమ్యూనిటీ నుంచి వారికి మద్దతు కూడా లభిస్తున్నది. అలాగే, టీటీపీ ఉగ్రవాదానికి కళ్లెం పడుతుందని పాక్ ఆశించింది. కానీ, టీటీపీ కూడా దాదాపు తాలిబాన్ భావజాలానికి సమీపంగా ఉన్నదే. అందుకే టీటీపీని తాలిబాన్ పెద్దగా అడ్డుకోవడం లేదు. అందుకే పాకిస్తాన్‌లో టీటీపీ విధ్వంసం కొనసాగుతూనే ఉన్నది. ఈ ఏడాది జనవరి నుంచి ఈ విధ్వంసంలో 128 మంది ఉగ్రవాదులు, 100 మంది పాక్ జవాన్లు మరణించారు.

అలాగే, అఫ్గనిస్తాన్‌లో అస్థిరత్వానికి పాక్ కారణం అని చాలా మంది అఫ్గనిస్తానీలు భావిస్తున్నారు. అందుకే ఆప్గన్‌లో ఏ సమస్య వచ్చినా.. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు వీధుల్లో మారుమోగుతున్నాయి. 

ఇమ్రాన్ నిష్క్రమణ ప్రభావం 

ఇమ్రాన్ ఖాన్ ఒకరకంగా తాలిబాన్ల మద్దతు కొంతైనా కూడగట్టుకున్నాడు. గతేడాది నవంబర్‌లో టీటీపీతో కాల్పులు విరమణ ఒప్పందం వరకు వెళ్లగలిగాడు. కానీ, నూతన ప్రధాని షాబాజ్ షరీఫ్ భిన్న మార్గంలో వెళ్తున్నారు. అమెరికాతో సన్నిహిత్యాన్ని పెంచుకోవాలని ఆరాటపడుతున్నాడు. అదే సమయంలో ఉగ్రవాదులను ఉపేక్షించేది లేదని, వారిపై దాడులు ముమ్మరం చేస్తామని ప్రకటిస్తున్నాడు. ఈ వైఖరితో పాకిస్తాన్‌లో శాంతి కంటే విధ్వంసమే ఎక్కువ ఏర్పడే ముప్పు ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే, ఏం జరగనుందనడానికి కాలమే సమాధానం చెబుతుంది.