మంకీపాక్స్‌ను డబ్ల్యూహెచ్‌వో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి చెందే మార్గాల గురించి, ఇతర కీలక విషయాలు పెద్దగా తెలియదని, కాబట్టి ఈ ప్రకటన చేసినట్టు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనామ్ తెలిపారు. ప్రస్తుతం ఈ వైరస్ 75 దేశాల్లో వ్యాపించిందని వివరించారు.
న్యూఢిల్లీ: మంకీపాక్స్ వైరస్ ఇప్పటికే సుమారు 75 దేశాలకు పాకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియసస్ ప్రకటించారు. ఇది డబ్ల్యూహెచ్‌వో ప్రకటించే అత్యంత ప్రమాద సూచిక. ఈ ప్రకటనతో సమస్యపై దేశాలన్నీ ఏకం కావాలని చెబుతున్నట్టుగా భావించాలి. ఒక దేశానికి మరో దేశం సహకరించుకుని వైరస్‌కు కట్టడి చేయడానికి ప్రయత్నించాలి. అంతేకాదు, వ్యాక్సిన్లు, ట్రీట్‌మెంట్‌ల కోసం ఫండింగ్ సేకరించడానికి, అంతర్జాతీయంగా సమైక్య కృషికి పిలుపు ఇస్తున్నట్టుగా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని పేర్కొంటుంటారు.
అంతర్జాతీయంగా దీని ముప్పు మాడరేట్‌గా ఉన్నప్పటికీ యూరపియన్ రీజియన్‌లో మాత్రం రిస్క్ తీవ్రంగా ఉన్నదని టెడ్రోస్ వివరించారు. అంతర్జాతీయంగా ఈ ముప్పు తీవ్రత చిక్కబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఈ వైరస్ అంతర్జాతీయ ప్రయాణాల ద్వారా ఎక్కువగా వ్యాపించే ముప్పు ప్రస్తుతానికి కనిపించడం లేదని చెప్పారు.
‘ఇప్పుడు మన అందరి ముందు ఒక కొత్త సమస్య వచ్చి పడింది. మంకీ పాక్స్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్నది. ఇది కొత్త మార్గాల్లో వ్యాప్తి చెందుతున్నది. వాటి గురించి మనకు పెద్దగా తెలియదు. ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్‌కు ఈ పరిస్థితులు సరిపోతున్నాయ’ని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ శనివారం చెప్పారు.
ఈ వైరస్ మరింత వేగంగా విజృంభిస్తున్నదని ఆయన ట్వీట్ చేశారు. ఈ వైరస్ బారిన ఇప్పటి వరకు 16000 మంది పడ్డారని పేర్కొన్నారు. 75 దేశాల్లో ఈ వైరస్ ఉనికి ఉన్నదని తెలిపారు. ఐదుగురు మంకీపాక్స్ కారణంగా మరణించారు. అందుకే తాను ఎమర్జెన్సీ కమిటీ సమావేశాన్ని నిర్వహించానని వివరించారు. హెల్త్ రెగ్యులేషన్స్ నిబంధనల మేరకు ఈ వైరస్ వ్యాప్తిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్‌గా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
గురువారం సమావేశమైన డబ్ల్యూహెచ్‌వో నిపుణుల కమిటీ ఏదీ తేల్చకుండానే త్రిశంకులో పడింది. అంటే, ఈ మంకీపాక్స్‌ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించాలా? లేదా? అనే విషయంపై సమావేశం జరిగింది. తొమ్మిది మంది ఈ ప్రతిపాదనను వ్యతిరేకించగా.. ఆరుగురు సైంటిస్టులు మాత్రం ఈ ప్రతిపాదనను బలపరిచారు.
