ఉక్రెయిన్ డర్టీ బాంబ్‌లు తయారు చేస్తున్నదని రష్యా ఆరోపిస్తున్నది. సోవియట్ యూనియన్ టెక్నాలజీని వినియోగించి మూసివేసిన చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ఈ న్యూక్లియర్ విపన్‌ను తయారు చేస్తున్నదని ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు నిజమేనా? డర్టీ బాంబ్ అంటే ఏమిటి? డర్టీ బాంబ్ అంటే అణుబాంబేనా? 

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌(Ukraine)పై యుద్ధం చేస్తున్న రష్యా(Russia) సంచలన ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్ దేశం డర్టీ బాంబ్(Dirty Bomb) తయారు చేస్తున్నదని పేర్కొంది. ప్లుటోనియం ఆధారంగా తయారు చేసే న్యూక్లియర్ విపన్(Nuclear Weapon) ఇది అని వివరించింది. కొన్ని వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ రష్యన్ మీడియా ఈ వార్తలు ప్రచురించింది. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 2000లో మూసివేశారు. ఈ ప్లాంట్‌లోనే ఉక్రెయిన్ న్యూక్లియర్ విపన్ తయారు చేస్తున్నదని పేర్కొంది. రష్యా ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి ముందు వ్లాదిమిర్ పుతిన్ ఇదే విధంగా ఆరోపించారు. సోవియట్ యూనియన్ ఉనికిలో ఉన్నప్పుడు వినియోగించిన టెక్నాలజీని ఉక్రెయిన్ ఇప్పుడు ఉపయోగిస్తున్నదని, ఆ టెక్నాలజీ ఆధారంగానే ఉక్రెయిన్ స్వతహాగా న్యూక్లియర్ మరణాయుధాలను తయారు చేస్తున్నదని అన్నారు. రష్యాపై యుద్ధానికి ఉక్రెయిన్ ప్రభుత్వం అన్ని విధాల సిద్ధం అవుతున్నదని పేర్కొన్నారు.

ఇంతకీ ఈ డర్టీ బాంబ్ అంటే ఏమిటి? డర్టీ బాంబు కూడా అణుబాంబు వంటిదేనా? నిజంగానే ఉక్రెయిన్ ఈ బాంబులను తయారు చేస్తున్నదా? అనే విషయాలను పరిశీలిద్దాం. ఎక్కడ యుద్ధం జరిగినా.. ఇరు పక్షాలు వీలైనంతగా ఎదుటి వర్గంపై దుష్ప్రచారం చేయడం సహజమే. అందుకే యుద్ధం జరుగుతున్నప్పుడు వచ్చే సమాచారాల్లో చాలా వరకు అతిశయోక్తులు, ఆధారాల్లేని ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఇరు పక్షాలు చేసే ఆరోపణలు ఏవైనా.. వాస్తవాలను పరిశీలించే ప్రయత్నం చేయడం కనీస ధర్మం.

రష్యా చేస్తున్న ఈ వాదనలకు ఆధారాల్లేవు. ఈ ఆరోపణలు కేవలం గుర్తు తెలియని వర్గాల సమాచారంగా పేర్కొంటున్నారు. కానీ, ఉక్రెయిన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నది. తాము మళ్లీ న్యూక్లియర్ క్లబ్ చేరాలనే ఆలోచనలు లేవని కొట్టిపారేస్తున్నది. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత 1994లో న్యూక్లియర్ ఆయుధాలకు స్వస్తి పలికిందని తెలిపింది.

డర్టీ బాంబు ఏమిటని తెలుసుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వివరాలను ఓ సారి చూడాలి. ఈ సీడీసీ ప్రకారం, డైనమైట్, రేడియో యాక్టివ్ పౌడర్, పెల్లెట్ల మిశ్రమంగా ఈ డర్టీ బాంబును చూడవచ్చు. డైనమైట్ లేదా ఇతర పేలుడు పదార్థాలు బద్ధలైనప్పుడు ఆ పేలుడు నుంచి రేడియో యాక్టివ్ మెటీరియల్ దాని చుట్టు పక్కల వాతావరణంలోకి వెదజల్లబడతాయి. అందుకే రేడియోలాజికల్ డిస్పర్సల్ డివైజ్‌ను డర్టీ బాంబ్‌ పేర్లను ఒకదానికి మరొకటి ప్రత్యామ్నాయంగా వినియోగిస్తుంటారు.

అయితే, చాలా వరకు ఈ బాంబులు మనిషి ప్రాణాలు తీసేసేంత రేడియేషన్‌ను విడుదల చేయవు. పేలుడుతోనే ఎక్కువ ప్రాణ నష్టం జరగవచ్చని, కానీ, దాని నుంచి వచ్చే రేడియో యాక్టివ్ తరంగాలు పెద్దగా ప్రాణ హానీ తలపెట్టకపోవచ్చు. అయితే, ఈ డర్టీ బాంబ్ పేలుడు వల్ల భయాందోళనలు సృష్టించవచ్చు. అది పేలిన ప్రాంతంలో తీవ్ర కాలుష్యాన్ని కలిగిస్తుంది. 

న్యూక్లియర్ బాంబ్‌..డర్టీ బాంబ్‌ ఒకటేనా?

డర్టీ బాంబ్.. న్యూక్లియర్ బాంబ్ రెండు వేరు. న్యూక్లియర్ బాంబ్ భారీ పేలుడు కలిగిస్తుంది. డర్టీ బాంబు పేలుడు కంటే అణుబాంబు తీవ్రత కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది. న్యూక్లియర్ బాంబు పేలుడు వల్ల వేలాది చదరపు మైళ్ల దూరం రేడియేషన్ వ్యాపిస్తుంది. అదే డర్టీ బాంబ్ ద్వారా ఈ రేడియేషన్ కొన్ని మైళ్ల దూరం మాత్రమే వ్యాపిస్తుంది. డర్టీ బాంబు విధ్వంసాన్ని సృష్టించే బాంబ్ కాదు.. ఆటంకాలు కలిగించే బాంబ్ మాత్రమే. కోపం, కాలుష్యాన్ని వ్యాపించడమే ఈ బాంబ్ ప్రధాన లక్ష్యం అని యూఎస్ న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్ వెల్లడించింది.