ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ వేగంగా విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బహుశా ప్రపంచం మహమ్మారి చెత్త దశను చూడవచ్చని  మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ (Bill Gates) హెచ్చరించారు. . ఒమిక్రాన్‌ వల్ల తాను చాలా హాలిడే ప్లాన్స్ రద్దు చేసుకున్నట్టుగా వెల్లడించారు. 

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ వేగంగా విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా యూఎస్, యూకేలలో ఓమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. యూఎస్‌లో గత వారం రోజుల్లో కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్‌లలో 73 శాతం ఒమైక్రాన్ వేరియంట్‌వేనని సీడీసీ పేర్కొంది. భారతదేశంలో కూడా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200 దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ (Bill Gates).. ఒమిక్రాన్‌ వేరియంట్‌కు సంబంధించి ప్రజలను అప్రమత్తం చేసే లక్ష్యంతో వరుస ట్వీట్స్ చేశారు. ఓమిక్రాన్ కేసులు వేగంగా పెరడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తన సన్నిహితులు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఒమిక్రాన్‌ వల్ల తాను చాలా హాలిడే ప్లాన్స్ రద్దు చేసుకున్నట్టుగా వెల్లడించారు. బహుశా మనం మహమ్మారి చెత్త దశను చూడవచ్చని హెచ్చరించారు. ప్రజలకు సూచనలు కూడా చేశారు. అయితే త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నట్టుగా చెప్పారు.

‘మనం మహమ్మారి యొక్క చెత్త దశలోకి ప్రవేశించవచ్చు. Omicron మనందరికీ ఇంటికి చేరుకుంటుంది. నా సన్నిహిత మిత్రుల్లో చాలా మందికి ఒమిక్రాన్ సోకింది. నా హాలిడే ప్లాన్‌లను చాలా వరకు రద్దు చేసాను. ఓమిక్రాన్ చరిత్రలో అన్ని వైరస్‌ల కంటే వేగంగా వ్యాపిస్తోంది. ఇది త్వరలో ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఉంటుంది. ఓమిక్రాన్ మనల్ని ఎంత అనారోగ్యానికి గురి చేస్తుందనేది పెద్దగా తెలియని విషయం. దీని గురించి మరింత తెలుసుకునేంత వరకు మనం దానిని తీవ్రంగా పరిగణించాలి. ఇది డెల్టా తీవ్రత కంటే తక్కువే అయినప్పటికీ.. వేగంగా వ్యాప్తి చెంతుంది. అందుకే ఇన్‌ఫెక్షన్లు ఉప్పెనలా పెరుగుతున్నాయి’ అని బిల్‌గేట్స్ చెప్పారు. 

Also read: Omicron: ఒమిక్రాన్‌ ములాలకు HIVతో సంబంధం ఉందా?.. అసలు పరిశోధకులు ఏం చెబుతున్నారు..

అయితే ఈ పరిస్థితుల్లో మనందరం ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. మాస్క్‌లు ధరించడం, పెద్ద పెద్ద సముహాలకు దూరంగా ఉండటం, టీకాలు వేయించుకోవడం చేయాలని సూచించారు. వ్యాక్సిన్ బూస్టర్‌ డోస్ ఉత్తమమైన రక్షణను అందిస్తుందని చెప్పారు. కరోనా వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా, చనిపోకుండా నిరోధించడానికి టీకాలు రూపొందించబడ్డాయని.. అవి బాగా పనిచేస్తున్నాయని తెలిపారు. 

Scroll to load tweet…

అయితే ఓ గుడ్ న్యూస్ కూడా ఉందని బిల్‌గేట్స్ అన్నారు. ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని.. అది ఒక దేశంలో ఆధిపత్యం చెలాయిస్తే అక్కడ వేరియంట్ 3 నెలల కంటే తక్కువ సమయం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆ కొన్ని నెలలు చెడ్డవి కావచ్చని.. సరైన చర్యలు తీసుకుంటే 2022 నాటికి మహమ్మారి ముగుస్తుందని తాను ఇప్పటికీ నమ్ముతున్నట్టుగా చెప్పారు. కోవిడ్ కారణంగా మరోసారి అందరూ ఇళ్లకే పరిమితం కావడం నిరాశపరించిందని తనకు తెలుసునని చెప్పారు. కానీ ఇది ఎప్పటికీ ఇలాగే ఉండదని అన్నారు. ఏదో ఒక రోజు మహమ్మారి ముగుస్తుందని.. మనం ఒకరినొరు ఎంత బాగా చూసుకుంటామో, అంత త్వరగా ఆ సమయం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.